తెలంగాణ కాంగ్రెస్.. మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థుల జాబితా విడుదల

Four more Telangana Congress Lok Sabha candidates List released - Sakshi

లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం

మెదక్, నిజామాబాద్, భువనగిరి, ఆదిలాబాద్‌ స్థానాలకు అభ్యర్థులు ఖరారు

మరో 4 స్థానాలు పెండింగ్‌లోనే..  31న మరోసారి భేటీ కానున్న సీఈసీ 

సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగే మరో నలుగురు లోక్‌సభ అభ్యర్థులను కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. మెదక్‌ నుంచి నీలం మధు, భువనగిరి నుంచి చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, నిజామాబాద్‌ నుంచి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్‌ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తారని ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం రాత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

మొత్తం 17 స్థానాలకుగాను 9 స్థానాలకు ఇంతకుముందే అభ్యర్థులను ప్రకటించగా, మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం ఢిల్లీలో సమావేశమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రం తరఫున టీపీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్‌ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్‌ చౌదరి పాల్గొన్నారు.  

ఇంకా పెండింగ్‌లో నాలుగు స్థానాలు 
సీఈసీలో 8 స్థానాలపై చర్చ జరుగుతుందని భావించినప్పటికీ కేవలం ఆరు స్థానాలపై మాత్రమే చర్చ జరిగింది. పారీ్టలో అంతర్గతంగా ఒత్తిడి ఎక్కువగా ఉన్న ఖమ్మం స్థానంతో పాటు హైదరాబాద్‌ అభ్యర్థి ఎవరనేది ప్రస్తావనకు రాలేదు. ఇక ఆరు స్థానాల్లోనూ నాలుగు సీట్లను మాత్రమే ఖరారు చేశారు.

వరంగల్‌ నుంచి దొమ్మాట సాంబయ్య, నమిళ్ల శ్రీనివాస్, కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌ రెడ్డి, రాజేందర్‌ రావు, తీన్మార్‌ మల్లన్నల పేర్లను పరిశీలించినా నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ రెండు స్థానాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాల్లో ఎవరి అభ్యర్థిత్వానికి కాంగ్రెస్‌ అధిష్టానం మొగ్గు చూపుతుందనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 31న మరోసారి జరగనున్న సీఈసీ భేటీలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.    

తలనొప్పిగా మారిన ఖమ్మం 
తెలంగాణలో ఖమ్మం పార్లమెంట్‌ స్థానం హాట్‌ సీట్‌గా మారింది. ఎక్కువమంది పోటీ పడుతుండటంతో ఇక్కడ ఎవరిని బరిలో దించాలన్న అంశం కాంగ్రెస్‌ అధిష్టానానికి తలనొప్పిగా మారింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు తమకు సంబంధించిన అభ్యర్థులకు సీటు కేటాయించాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.

భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, తుమ్మల తన కుమారుడు యుగంధర్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. వీరితో పాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్, టీపీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమకుమార్‌లు సైతం తమకు ఖమ్మం సీటు కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం అభ్యర్థి ప్రకటన వాయిదా పడుతోందని చెబుతున్నారు.   

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top