Babu Case : లోకేషా.. ఈ ప్రశ్నలకు జవాబేదీ?

Can Lokesh answers the questions against his statements.? - Sakshi

ఢిల్లీలో లోకేష్‌ చేసిన ప్రకటనలేంటీ? 

ఆ వ్యాఖ్యల వెనక అసలు అంతర్థానమేంటీ? 

తెలుగు తమ్ముళ్లలో వచ్చిన సందేహాలేంటీ?

లోకేష్‌ ప్రకటనలను ఎలా చూడాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి?

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నిన్న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొన్ని ప్రకటనలు చేశారు. ఇంతకీ ఆయన చేసిన ప్రకటనలేంటీ? వాటి అంతరార్థమేంటీ?

లోకేష్‌ : తెలుగుదేశం పార్టీ ఏనుగు లాంటిది. సిద్ధమవడానికి సమయం పడుతుంది.

సందేహాలు : పార్టీని ఏనుగులా పోల్చడమేంటీ? అసలు ఏనుగు అనడంలో లోకేష్‌ ఉద్దేశ్యమేంటీ? ఎవరూ కదలలేకపోతున్నారనా? లేక పార్టీ బలంగా ఉందని చెప్పడమా? తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఏనుగే  అనుకుంటే, సిద్ధమవడానికి సమయం పడుతుందనుకొందాం. కానీ తెలుగుదేశం పార్టీ కొత్తగా వచ్చింది కాదు కదా. దాదాపు 40 ఏళ్లుగా ఉన్న ఒక పార్టీలో చంద్రబాబు అనే ఒకే ఒక వ్యక్తి అవినీతి పాలయి  జైల్లోకి వెళ్లాడు. ఒక్క అరెస్ట్‌తోనే పార్టీ తలకిందులయిందన్నది లోకేష్‌ ఉద్దేశ్యమా? లేక పార్టీ నిద్రాణంగా ఉందన్న భావనలో ఉన్నారా? 

లోకేష్‌ : చేయని తప్పుకు శిక్షించే వ్యవస్థ ఉండకూడదన్న ఉద్దేశ్యంతో, ఆ వ్యవస్తను మార్చడానికే నేను రాజకీయాల్లోకి వచ్చాను. 

సందేహాలు : లోకేష్‌ రాజకీయాల్లోకి 2014 తర్వాత వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్పుకుంటున్న లోకేష్‌ ముందెక్కడ పోటీ చేయలేదు. అప్పటికే పార్టీ అధికారంలో ఉంది. తండ్రి ముఖ్యమంత్రి కావడంతో లోకేష్‌ నేరుగా ఎమ్మెల్సీ అయ్యాడు. దొడ్డిదారిన ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడు. పార్టీ చెప్పుచేతల్లో ఉంది కాబట్టి జాతీయ కార్యదర్శి పదవి తీసుకున్నాడు. అధికారం తమదే కాబట్టి క్యాబినెట్ మినిస్టర్‌ అయ్యాడు. అంతే తప్ప.. ఎక్కడ ఎన్నికల్లో పోటీ చేసి పదవులు సాధించుకోలేదు. తెలుగు రాజకీయాలను భ్రష్టు పట్టించి ఓటుకు కోట్లు కెమెరాల సాక్షిగా ఇస్తూ అడ్డంగా దొరికి, లంచం ఇవ్వడం తప్పు కాదని వాదించే మీలాంటి నాయకులు ఉండడం వల్లే రాజకీయాల్లోకి కొత్తగా ఎవరూ రావడం లేదు. 

ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది ఏంటంటే.., లోకేష్‌ రాజకీయాల్లోకి వచ్చేసమయంలో లోకేష్‌ గానీ, లోకేష్‌ తండ్రి చంద్రబాబు గానీ జైల్లో లేరు. నిజానికి ఆ సమయంలో చేయని తప్పుకు కేసులు పెట్టి జైలుకు పంపింది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని. కాంగ్రెస్‌ కక్ష కడితే, దానికి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం వంత పాడి కేసుల్లో ఇంప్లీడ్‌ అయి తప్పుడు అభియోగాలు బనాయించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అక్రమంగా జైలుకు పంపించారు. ఈ కేసులు తప్పని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే.. 2014లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు కట్టబెట్టారు. అంటే లోకేష్‌ చెప్పే అరెస్ట్‌ ఇదేనా.? తాము అక్రమంగా అరెస్ట్‌ చేసి పంపామన్న అపరాధన భావనలో ఉన్నాడా?

లోకేష్‌ : మేం ఎనిమిదేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్నాం. మాకు హైదరాబాద్‌/సైబరాబాద్‌లో ఎకరం జాగా లేదు. 

అసలు నిజాలు : లోకేష్‌, చంద్రబాబు ఆస్తుల వెల్లడి అన్న కార్యక్రమం ఎంత కామెడీనో తెలుగు ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్‌లో కట్టిన రాజసౌధం విలువ లక్షల్లోచూపిస్తావు. ఏంటంటే.. కొన్నప్పుడు అంతే ఉందంటావు. ఇక అసలు మాకు ఒక్క గజం భూమి ఉన్నా.. ఇచ్చేస్తానంటావు. మరి మదీనాగూడలో 14 ఎకరాల్లో ఉన్న ఫాంహౌజ్‌ సంగతేంటీ? అంత ఖరీదైన లోకేషన్‌లో అంత భూమి ఎలా వచ్చింది? ఖరీదైన స్థలాలన్నీ మీ నానమ్మ నీ ఒక్కరికే ఎందుకు గిఫ్ట్‌గా ఇచ్చింది? ఇందులో క్విడ్‌ ప్రో కోల గురించి ఎప్పుడైనా వివరణలిస్తావా? దీని గురించి వేసిన కేసుల్లో  విచారణ జరగకుండా స్టేలు ఎందుకు తెచ్చుకున్నారు? మీకు, మీ కొడుకు దేవాన్ష్ కు ఇచ్చిన బహుమతులు అమ్మణ్ణమ్మ, బాలకృష్ణ ఐటీ రిటర్నులు, ఎన్నికల అఫిడవిట్లలో ఎందుకు లేవు?

లోకేష్‌ : మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మా సంస్థ హెరిటేజ్‌ నిదానంగా ఎదిగింది. లేదంటే సంస్థ విలువ ఇప్పటికీ మూడు రెట్లు పెరిగేది. 

అసలు నిజాలు : హెరిటేజ్‌ విలువ ఎంత? ఆ సంస్థ అంచలంచెలుగా ఎలా ఎదిగింది అన్నది చిత్తూరు నుంచి విజయనగరం వరకు ఎవరిని అడిగినా చెబుతారు. పదవిని అడ్డు పెట్టుకుని హెరిటేజ్‌ కోసం చిత్తూరు డెయిరీని దివాళా తీయించినప్పుడే వ్యవస్థలను ముంచే మీ ప్రతిభ అర్థం చేసుకోవాలి. అయినా హెరిటేజ్‌ అసలు లెక్కలు ఎప్పుడయినా బయటపెట్టారా? ఇందులో మీ కుటుంబ సభ్యులు కాకుండా  ఇంకెవరయినా కీలక స్థానాల్లో ఉన్నారా? ఈ మధ్యే మీ అమ్మ భువనేశ్వరీ ఏం చెప్పారు? మా సంస్థ హెరిటేజ్‌లో 2% షేర్లు అమ్మినా మాకు రూ.400 కోట్లు వస్తాయన్నారు. అంటే ఈ లెక్క ప్రకారం మీ సంస్థ విలువ రూ.20వేల కోట్లు. కేవలం పాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, సూపర్‌ మార్కెట్ల ద్వారా రూ.20వేల కోట్ల సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మానవ మాత్రుడు ఎవరయినా ప్రపంచంలో ఉంటారా? మీరు తప్ప. ఇందులో అక్రమ సంపాదన ఎంత? వ్యవస్థలను ముంచిందెంత? మీ సంస్థ బాగు కోసం ఎవరెవరిని తొక్కేశారు. కొంచెం లెక్కలు వివరంగా చెబితే అందరూ నోళ్లు వెల్లబెట్టి వింటారు. 

లోకేష్‌ : రాజకీయాల్లోకి బ్రాహ్మణి రావడం ఆమె ఇష్టం. మేం మా దారులు ఎంచుకొన్నాం. 

అసలు నిజమేంటీ : పార్టీ లోడు నువ్వెత్తడం లేదని విషయం స్పష్టమయిన తర్వాతే మీ నాన్న చంద్రబాబు పవన్‌ కళ్యాణ్‌ను ఎంచుకున్నారని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు గత మూడు వారాలుగా మీకు సంబంధించిన ఎల్లో మీడియాలోనే బ్రాహ్మణి పేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బ్రాహ్మణి రావాలి, పాదయాత్ర చేయాలి, పార్టీని నడిపించాలని ప్రచారం చేస్తున్నారు. అంటే దానర్థమేంటన్నది మీ స్టాన్‌ఫోర్డ్‌ బ్రెయిన్‌కు అర్థం కానంత గొప్పదేం ఉండదు. మీరు తారా స్థాయిలో రాజకీయాలు నడిపితే బ్రాహ్మణి పేరు ముందుకు ఎందుకు వస్తుంది? హెరిటేజ్‌ సంస్థను విడిచిపెట్టి బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావాలి అని పచ్చమీడియా పిచ్చిగా ప్రచారం చేస్తోందంటే ఇంతకు మించిన అర్థం ఇంకేముంటుంది? 


(Courtesy : Nidhi)

లోకేష్‌ : స్కిల్‌ డెవలప్‌మెంట్‌, రింగ్‌రోడ్డు అక్రమ అలైన్‌మెంట్‌, ఫైబర్‌ గ్రిడ్‌.. ఈ మూడు ప్రాజెక్టులు నా మంత్రిత్వ పరిధిలోనివి కావు, కాబట్టి వాటికి నేను బాధ్యుడిని కాదు

సందేహాలేంటీ : మొన్నటి వరకు ఏం వాదించారు.? బ్యాంకు మేనేజర్‌ తప్పు చేస్తే బ్యాంకు ఓనర్‌ను అరెస్ట్‌ చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు. అంటే అర్థమేంటీ? తప్పు జరిగింది కానీ మాది బాధ్యత కాదంటున్నావు.  ఇక ఈ మూడు ప్రాజెక్టులకు సంబంధించిన శాఖలకు కూడా నేను మంత్రిగా పని చేయలేదంటున్నావు. అంటే అర్థమేంటీ? కుంభకోణం జరిగింది కానీ నా ప్రమేయం ప్రత్యక్షంగా లేదని అర్థమా? స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మీ నాన్న శాఖలోనిది అయితే మీ ప్రమేయం అంతగా ఎందుకుంది? ఫైబర్‌ గ్రిడ్‌కు మీకు సంబంధం లేకుంటే.. మీవైపే అన్ని ఆధారాలు ఎందుకు చూపిస్తున్నాయి? మీ సంస్థ భూములు రింగ్‌రోడ్డు చుట్టే భూములు కొనాలని మీకు కలలో ఐడియా వచ్చిందా? పైగా మీ బెయిల్‌ పిటిషన్‌లో మీ అడ్వొకేట్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఏం వాదించారు? కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్‌ హౌజ్‌లో తండ్రి  చంద్రబాబుతో కలిసి ఉన్నందుకు నాపై కేసు ఎలా పెడతారని కోర్టు ముందు వాదించారు. అంటే మునగాల్సి వస్తే తండ్రిని కూడా వదిలేస్తారా? ఇవేనా మీరు నేర్చుకున్న కుటుంబ విలువలు? అసలు నోటీసులు రాకముందే ఢిల్లీకి ఎందుకు వెళ్లిపోయారు? సుప్రీంకోర్టు లాయర్లతో మాట్లాడాల్సిన మంతనాలకు ఇన్ని రోజులు పడుతుందా? అయినా న్యాయశాస్త్రంలో మీరేమీ డాక్టరేట్‌ చేయలేదు కదా.. మీకున్న ప్రతిభకు సాల్వే, లూథ్రా లాంటి సీనియర్‌ లాయర్లకు ఏం సూచనలు చేస్తారు? రాజమండ్రిలో కుటుంబాన్ని వదిలేసి ఢిల్లీ హోటళ్లలో ఉంటూ వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టేకంటే.. పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండడం మిమ్మల్ని నాయకుడిగా నిలిపేది కదా. పైగా నన్ను అరెస్ట్‌ చేసే అవకాశముంది కాబట్టి ఏపీ నుంచి ఢిల్లీ వచ్చానని నిజాయతీగా చెబితే సగటు తెలుగు ప్రజలకు కనీసం సానుభూతి అయినా వచ్చేది కదా. ఇంత చిన్న పాయింట్‌ ఎలా మిస్సయ్యారు?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top