ప్రపంచ పరిణామాలు, క్యూ3 ఫలితాలు కీలకం

Global developments, Q3 results are key role in the market says market experts - Sakshi

స్థూల ఆర్థిక గణాంకాలపైనా దృష్టి

పరిమిత శ్రేణి ట్రేడింగ్‌కు అవకాశం

ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా  

ముంబై: ప్రపంచ పరిణామాలు, దేశీయ కార్పొరేట్‌ డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఈ వారం దలాల్‌ స్ట్రీట్‌కు దిశానిర్ధేశం చేస్తాయని స్టాక్‌ నిపుణులు చెబుతున్నారు. స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టబడుల సరళీపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరల కదలికలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు.

ఈ కొత్త ఏడాది 2024 తొలి వారంలో జరిగిన అయిదు ట్రేడింగ్‌ సెషన్లలో సూచీలు మూడింటిలో లాభాలు ఆర్జించగా, రెండింటిలో నష్టాలు చవిచూశాయి. వారం మొత్తంగా సెన్సెక్స్‌ 214 పాయింట్లు, నిఫ్టీ 21 పాయింట్లు నష్టపోయాయి. ‘‘దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక త్రైమాసిక ఫలితాలు ప్రకటన నేపథ్యంలో మార్కెట్‌ పరిమిత శ్రేణి ట్రేడవుతూ, ఒడిదుడుకులకు లోనవ్వొచ్చు. స్థిరమైన ర్యాలీ కొనసాగితే అమ్మకం, అనూహ్యంగా పతనమైతే నాణ్యమైన షేర్ల కొనుగోళ్లు వ్యూహాన్ని అమలు చేయడం ఉత్తమం.

ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌ నెలకొని ఉంది. సాంకేతికంగా నిఫ్టీ 21,750 పాయింట్ల వద్ద అమ్మకాల ఒత్తిడికి లోనవుతుంది. ఈ స్థాయిని చేధించగలిగితే 22,000 స్థాయిని పరీక్షిస్తుంది. దిగువ స్థాయిలో 21,600 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు కలిగి ఉంది’’ అని మాస్టర్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అరవిందర్‌ సింగ్‌ నందా తెలిపారు.  

క్యూ3 ఫలితాల సీజన్‌ ప్రారంభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) మూడో త్రైమాసిక కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల సీజన్‌ ఈ వారం ప్రారంభం కానుంది. దేశీయ ఐటీ అగ్రగామి సంస్థలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు గురువారం( జనవరి 11న) ఆర్థిక ఫలితాలను ప్రకటించి దేశీయ కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. మరుసటి రోజు విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, ఆనంద్‌ రాఠి, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు తమ డిసెంబర్‌ క్వార్టర్‌ పనితీరును వెల్లడించనున్నాయి. క్యూ3 ఫలితాల వెల్లడి సందర్భంగా స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌ జరగొచ్చు.

స్థూల ఆర్థిక గణాంకాలు  
యూరోజోన్‌ నవంబర్‌ రిటైల్‌ అమ్మకాలు, పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక సేవల గణాంకాలు సోమవారం విడుదల అవుతాయి. జపాన్‌ నవంబర్‌ గృహ వినియోగ వ్యయ డేటా, యూరోజోన్‌ నవంబర్‌ నిరుద్యోగ రేటు, అమెరికా నవంబర్‌ వాణిజ్య లోటు గణాంకాలు మంగళవారం వెల్లడి కానున్నాయి. అమెరికా నవంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం డేటా గురువారం ప్రకటించనుంది. ఇక వారాంతాపు రోజైన శుక్రవారం దేశీయ నవంబర్‌ రిటైల్, ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడి కానున్నాయి. అదే రోజున జనవరి 5తో ముగిసిన వారం నాటి ఫారెక్స్‌ నిల్వలు, డిసెంబర్‌ 29తో ముగిసిన వారం బ్యాంకింగ్‌ రుణ, డిపాజిట్‌ వృద్ధి గణాంకాలు విడుదల కానున్నాయి. కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది.  

ప్రపంచ పరిణామాలు
ఎర్ర సముద్రంలో సరుకు రవాణా నౌకలపై యెమెన్‌కు చెందిన హౌతీ మిలిటెంట్ల దాడులతో ఎగుమతులపై భారీ ప్రభావం చూపుతోంది. అమెరికా బాండ్లపై రాబడులు గతవారం రోజుల్లో 18 బేసిస్‌ పాయింట్లు పెరిగి 4 శాతానికి పైగా చేరుకున్నాయి. యూఎస్‌ డిసెంబర్‌ పేరోల్‌ డేటా అంచనాలకు మించి నమోదవడం ‘ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ వాదనలకు బలాన్నివ్వొచ్చు. కావున ప్రపంచ పరిణామాలు ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా లేవు.

5 ట్రేడింగ్‌ సెషన్లల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు  
కొత్త ఏడాది తొలివారంలో విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) నికర కొనుగోలుదారులుగా నిలిచారు. దేశీయ మార్కెట్లో ఎఫ్‌ఐఐలు జనవరి 1–5 తేదీల్లో రూ.4,800 కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారతీయ బలమైన ఆర్థిక వ్యవస్థ పనితీరుపై విశ్వాసం ఇందుకు కారణమని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. డెట్‌ మార్కెట్లో అదనంగా మరో రూ.4000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ డేటా వెల్లడించింది.

‘‘అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఊహాగానాలతో కొత్త ఏడాదిలోనూ భారత్‌ స్టాక్‌ మార్కెట్లలో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది’’ అని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సరీ్వసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ వీకే విజయ కుమార్‌ తెలిపారు. ఇదే సమయంలో (జనవరి 1–5 తేదీల్లో) సంస్థాగత ఇన్వెస్టర్లు  రూ.7,296 కోట్ల ఈక్విటీలు విక్రయించారు. ఇక 2023లో భారత్‌ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.  డెట్‌ మార్కెట్లో రూ.68,663 కోట్ల పెట్టుబడులు పెట్టారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top