29,273 బోగస్ కంపెనీలు.. రూ. 44,015 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం! | Sakshi
Sakshi News home page

29,273 బోగస్ కంపెనీలు.. రూ. 44,015 కోట్లు కొట్టేసేందుకు పన్నాగం!

Published Sun, Jan 7 2024 10:12 PM

GST officers detect over 29000 bogus firms involved in fake ITC claims - Sakshi

నకిలీ ఇన్‌పుట్‌ ​​ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) క్లెయిమ్‌లకు పాల్పడిన వేలాది బోగస్‌ కంపెనీలను జీఎస్టీ అధికారులు గుర్తించారు. 2023 డిసెంబర్‌ వరకు ఎనిమిది నెలల్లో రూ. 44,015 కోట్ల క్లెయిమ్‌లకు పాల్పడిన 29,273 బోగస్ సంస్థలను జీఎస్టీ అధికారులు గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.  దీంతో ప్రభుత్వానికి 4,646 కోట్లు ఆదా అయినట్లు పేర్కొంది.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు రూ.12,036 కోట్ల ఐటీసీ ఎగవేతలకు పాల్పడిన 4,153 బోగస్ సంస్థలను గుర్తించగా వీటిలో 2,358 బోగస్ సంస్థలను కేంద్ర జీఎస్టీ అధికారులు గుర్తించారు. 926 బోగస్‌ కంపెనీల గుర్తింపుతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా రాజస్థాన్‌ (507), ఢిల్లీ (483), హర్యానా (424) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. డిసెంబరు త్రైమాసికంలో బోగస్‌ కంపెనీలను గుర్తించడం ద్వారా రూ. 1,317 కోట్లు దుర్వినియోగం కాకుండా అడ్డుకోగలిగారు. ఈ కేసుల్లో 41 మందిని అరెస్టు చేయగా, వీరిలో 31 మందిని సెంట్రల్ జీఎస్‌టీ అధికారులు అరెస్టు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

‘2023 మే నెల మధ్యలో నకిలీ రిజిస్ట్రేషన్లపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినప్పటి నుంచి రూ. 44,015 కోట్ల అనుమానిత ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ (ITC) ఎగవేతకు పాల్పడిన మొత్తం 29,273 బోగస్ సంస్థలను గుర్తించాం. దీని వల్ల రూ. 4,646 కోట్లు ఆదా అయ్యాయి. ఇప్పటి వరకు 121 మందిని అరెస్టు చేశాం’ అని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement
Advertisement