టైటిల్ : కృష్ణమ్మ
నటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులు
నిర్మాత: కొమ్మలపాటి కృష్ణ
దర్శకత్వం: గోపాలకృష్ణ
సమర్పణ : కొరటాల శివ
సంగీతం: కాలభైరవ
విడుదల తేది: మే 10, 2024
‘కృష్ణమ్మ’కథేంటంటే..
ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్‌లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు.
అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు.
అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్‌గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది.
ఫ్రెండ్‌షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్‌స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్‌స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది.
సెకండాఫ్‌లో కథంతా సీరియస్ మూడ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే..
సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్‌ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్‌లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది.
యాక్షన్ సీన్స్‌లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్‌గా నటించిన అతిరా రాజ్‌కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment