GodFather Telugu Movie Review And Rating - Sakshi
Sakshi News home page

Godfather Review: గాడ్‌ ఫాదర్‌ మూవీ రివ్యూ

Published Wed, Oct 5 2022 1:24 PM | Last Updated on Sat, Oct 8 2022 8:41 AM

Godfather Movie Review And Rating In Telugu - Sakshi

టైటిల్‌: గాడ్‌ ఫాదర్‌
నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌,నయనతార, సత్యదేవ్‌, పూరి జగన్నాథ్‌,తదితరులు      
నిర్మాతలు: రామ్‌ చరణ్‌, ఆర్‌.బీ చౌదరి
దర్శకత్వం: మోహన్‌రాజా
సంగీతం: తమన్‌
సినిమాటోగ్రఫీ : నీరవ్‌ షా
ఎడిటర్‌: మార్తాండ్‌ కె.వెంకటేశ్‌
విడుదల తేది: అక్టోబర్‌ 5, 2022

‍కథేంటంటే
ముఖ్యమంత్రి పి.కె రామదాసు అలియాస్‌ పీకేఆర్‌ అకాల మరణంతో జన జాగృతి పార్టీ(జేజేపీ) పెద్దల కన్ను సీఎం సీటుపై పడుతుంది. తదుపరి సీఎం కావాలని అతని అల్లుడు జైదేవ్‌(సత్యదేవ్‌) భావిస్తాడు. సీఎం సీటు కోసం పార్టీలోని కొంతమంది అవినీతిపరులతో చేతులు కలుపుతాడు. అయితే పీకేఆర్‌ సన్నిహితుడు, జేజేపీ పార్టీ కీలక నేత బ్రహ్మ తేజ(చిరంజీవి)మాత్రం జైదేవ్‌ ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ సీఎం కాకుండా చేస్తాడు.

దీంతో జైదేవ్‌ అతన్ని హత్య చేయించేందుకు కుట్రలు పన్నుతాడు. ఆ కుట్రలను బ్రహ్మ తేజ ఎలా తిప్పి కొట్టాడు. జైదేవ్‌ అసలు స్వరూపం భార్య సత్యప్రియ(నయనతార)కు ఎలా తెలిసింది? , అసలు బ్రహ్మ ఎవరు ? పీకేఆర్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? మధ్యలో వచ్చిన మసూన్‌ భాయ్‌(సల్మాన్‌ ఖాన్‌) ఎవరు? చివరకు బ్రహ్మ ఎవర్ని ముఖ్యమంత్రిని చేశాడు? దాని కోసం ఎలాంటి పరిస్ధితులను ఎదురుకున్నాడు? అనేదే మిగతా కథ

ఎలా ఉందంటే..
గాడ్‌ ఫాదర్‌ సినిమా మలయాళ హిట్‌ మూవీ లూసిఫర్‌కి రీమేక్‌. మోహన్‌ లాల్‌ నటించిన  ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. అంతేకాదు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. అలాంటి సినిమాను ఎంచుకొని చిరంజీవి పెద్ద సాహసమే చేశాడు. కథపై నమ్మకంతో సినిమా చేశానని చెప్పాడు. చిరంజీవి నమ్మకం నిజమైంది. లూసిఫర్‌ చూసిన వాళ్లు కూడా గాడ్‌ ఫాదర్‌ని ఎంజాయ్‌ చేస్తారు. తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా మాతృకలో కొన్ని మార్పులు చేశాడు దర్శకుడు మోహన్‌ రాజా. తనదైన స్క్రీన్‌ప్లేతో అద్భుతంగా కథను ముందుకు నడిపించాడు.

పీకేఆర్‌ మరణంతో సినిమా ప్రారంభం అవుతుంది. ప్రధాన పాత్రలను పరిచయం తర్వాత అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇద్దరు బలమైన,తెలివైన నాయకులు జైదేవ్‌(సత్యదేవ్‌), బ్రహ్మ(చిరంజీవి) ఆడే రాజకీయ చదరంగం అందరిని ఆకట్టుకుంది. ఇంటర్వెల్‌ ముందు చిరు పలికే డైలాగ్స్‌ ఫాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. ఇక సల్మాన్‌ ఖాన్‌ ఎంట్రీతో సినిమా మరోస్థాయికి వెళ్తుంది.

మసూద్‌ గ్యాంగ్‌ బ్రహ్మకు ఎందుకు సహాయం చేసింది?బ్రహ్మ నేపథ్యం ఏంటి.. చివరకు ఎవరిని సీఎం చేశారు?ఇలా సెకండాఫ్‌ సాగుతుంది. టిపికల్‌ నెరేషన్‌తో కొన్ని చోట్ల పొలిటికల్‌ డ్రామాను ఆకట్టుకునే విధంగా మలచలేకపోయాడు. హీరోయిజం ఎలివేషన్‌ మీదే ఎక్కువ దృష్టిపెట్టాడు. ప్రతి సీన్‌ చిరంజీవి అభిమానులను దృష్టిలో పెట్టుకొని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. యాక్షన్‌ సన్నివేశాలు అయితే అదిరిపోతాయి.

ఎవరెలా చేశారంటే..
చిరంజీవి నటనకు వంక పెట్టాల్సిన పనిలేదు. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు. బ్రహ్మతేజ పాత్రలో మెగాస్టార్‌ చిరంజీవి ఒదిగిపోయాడు. యాక్షన్‌ సీన్స్‌లో కూడా అద్భుతంగా నటించాడు. తన అభిమాన హీరోతో స్రీన్‌ షేర్‌ చేసుకునే అవకాశం రావడంతో సత్యదేవ్‌ రెచ్చిపోయి నటించాడు. విలన్‌ జైదేవ్‌ పాత్రకి వందశాతం న్యాయం చేశాడు. ముఖ్యంగా తన నిజ స్వరూపం గురించి నయనతార కు చెప్పే సన్నివేశంలో సత్యదేవ్ నటన చాలా బాగుంటుంది.

అతిధి పాత్రలో సల్మాన్‌ ఖాన్‌ అదరగొట్టేశాడు. యాక్షన్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించి మాస్‌ ప్రేక్షకులకు ఫుల్‌ కిక్‌ ఇచ్చాడు. ముఖ్యమంత్రి పీకేఆర్‌ కూతురు, సత్యదేవ్‌ భార్య సత్యప్రియగా నయన తార తనదైన నటనతో ఆకట్టుకుంది. సునీల్‌, బ్రహ్మాజీ, పూరి జగన్నాథ్‌, షఫీలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.

ఇక సాంకేతిక విషయానికొస్తే.. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ సంగీతం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. నీరవ్‌ షా సినిమాటోగ్రఫీ, మార్తాండ్‌ కే.వెంకటేశ్‌ ఎడిటింగ్‌ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement