MegaStar Chiranjeevi Speech At GodFather Blockbuster Success Meet - Sakshi
Sakshi News home page

Chiranjeevi: ‘గాడ్‌ఫాదర్‌’ ఆ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌

Published Sun, Oct 9 2022 1:21 AM | Last Updated on Sun, Oct 9 2022 11:18 AM

Mega Star Chiranjeevi Speech At GodFather Blockbuster Success Meet - Sakshi

ఎన్‌.వి. ప్రసాద్, సత్యదేవ్, చిరంజీవి, మోహన్‌రాజా

‘‘ఎన్ని సినిమాలు చేసినా ఎంత అనుభవం ఉన్నా ప్రతి సినిమా ఓ ప్రత్యేకమైన అనుభూతే. ఓ సినిమాకు ఎంత డబ్బులు వచ్చాయిన్నది కాదు.. ఎంతమంది చూసి వావ్‌ అన్నారన్నది కూడా అంతే ముఖ్యం. చాలాకాలం తర్వాత ఓ ‘ఇంద్ర’, ఓ ‘ఠాగూర్‌’ రేంజ్‌ బ్లాక్‌బస్టర్‌ ‘గాడ్‌ ఫాదర్‌’’ అని చిరంజీవి అన్నారు. చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాడ్‌ ఫాదర్‌’. ఈ చిత్రంలో నయనతార, సల్మాన్ ఖాన్, సత్యదేవ్‌ కీలక పాత్రలు పోషించారు. కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న రిలీజ్‌ అయింది.

ఈ సందర్భంగా శనివారం జరిగిన ‘గాడ్‌ ఫాదర్‌’ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో చిరంజీవి మాట్లాడుతూ– ‘‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాకు కొంత మంది దర్శకుల పేర్లు అనుకున్నాం. ఫైనల్‌గా దర్శకుడు మోహన్‌ రాజా రావడం నాకు ఈ సినిమాపై మరింత హైప్‌ వచ్చింది. ఆ తర్వాత సత్యానంద్‌గారిని ఇన్‌వాల్వ్‌ చేశాను. నా ఇన్‌ఫుట్స్‌ కూడా ఉన్నాయి. ముందుగా ఓ క్లైమాక్స్‌ షూట్‌ చేశాం. ఆ తర్వాత మళ్లీ క్లైమాక్స్‌ను రీ షూట్‌ చేశాం. సినిమాను నేను ఓ క్రిటిక్‌గా చూసినప్పుడు తప్పులు తెలుస్తాయని నా గట్‌ ఫీలింగ్‌. ‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రంలో చిరంజీవి కళ్లతో యాక్ట్‌ చేశారు అని అంటుంటే ఆ క్రెడిట్‌ టీమ్‌ అందరిదీ’’ అన్నారు.

దర్శకుడు బాబీ మాట్లాడుతూ – ‘‘రెండు రోజుల క్రితమే నిశ్శబ్ద విస్ఫోటనంకి మీనింగ్‌ తెలిసింది నాకు. ఎవడు పడితే వాడు మాటి మాటికి, సరిసాటి రానోళ్లందరూ మాట్లాడుతుంటే ఒక చిరునవ్వుతో ఆయన (చిరంజీవి) ఆ క్షణం ఆ పని  అలా జరిగేలా ముందుకు వెళ్తున్నారు చూడండి.. అది నిశ్శబ్ద విస్ఫోటనం అంటే. 153 సినిమాలకు ఆయన చిరునవ్వే నిదర్శనం’’ అన్నారు.

ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు మాట్లాడుతూ – ‘‘ఇండియన్  స్క్రీన్ పై చిరంజీవిగారితో పోలిక పెట్టడానికి ఎవరూ సరిపోరు. ఆల్‌ స్టార్స్‌ చిరంజీవిగారే. రీసెంట్‌గా అభిమానంతో ఫోటోలు తీసుకుంటుంటే... ఆయన ఎవరో.. మాట్లాడేవాడు మహాపండితుడు. ఆయన అలా మాట్లాడవచ్చా అండీ. అది తప్పు కదా. అలాంటివాడిని కూడా ఆయన (చిరంజీవి) ఇంటికి ఆహ్వానిస్తుంటే అది కదా సంస్కారం. ఇది కదా మేం నేర్చుకుంటున్నాము’’ అన్నారు.

దర్శకుడు మోహన్  రాజా మాట్లాడుతూ–  ‘‘ప్రాజెక్ట్‌లో చిరంజీవిగారు ఇన్ వాల్వ్‌ అవుతున్నారు అని ఎవరైనా అంటే కొడతాను. ఆయన అనుభవాన్ని ఊపయోగించుకోలేకపోతే మేం ఫూల్స్‌. ప్రతి సీన్ లోనూ ఆయన ఇన్ పుట్‌ ఉంది. అందుకే ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది’’ అన్నారు.

నిర్మాత ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘మీకు ఎవ్వరికీ తెలియని విషయం  ఆయన్ను (చిరంజీవి) అడగకుండా కూడా నేను చెబుతున్నాను. ‘అమ్ముడుపోయారు.. అమ్ముడు పోయారు అంటున్నారు. మద్రాస్‌లో ప్రసాద్‌ ల్యాబ్‌ పక్కన ఉండే కృష్ణా గార్డెన్  అమ్మి ప్రజారాజ్యం పార్టీ క్లోజింగ్‌ రోజున ఆయన అప్పులు అన్నీ తీర్చారు. అంత పెద్ద ప్రాపర్టీని అమ్మిన వ్యక్తి ఆయన. ఈ రోజుకీ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పని చేసే వ్యక్తి గురించి ఎవరు పడితే వారు మాట్లాడుతుంటారు. ఏదంటే అది రాస్తుంటారు. ఆయన స్పెషల్‌ పర్సన్  కాబట్టి ఏదంటే అది రాయొచ్చు. అదో హక్కు అయిపోయింది. ప్రజారాజ్యంలో నుంచి పుట్టిన బాధ, ఆవేశమే ఈ రోజు జనసేన. ఆ రోజు చిరంజీవిగారి గురించి ఏం  మాట్లాడారో దానికి సమాధానమే జనసేన. సార్‌.. మీరు సహనంగా, వినయంగా.. దండాలు పెడుతూనే ఉండండి. మేం కాదనం. దయచేసి కొన్ని విషయాల్లో మనం కొంతమందిని వదులుకోవాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో కానీ, మీడియా వ్యక్తులు కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేప్పుడు ఒకసారి ఆలోచించండి’’ అన్నారు.

రచయిత అనంత శ్రీరామ్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సందర్భంగా రామాయణంలోని ఓ సంఘటన నాకు గుర్తుకు వస్తోంది. చూడామణి, నగలు.. వీటి వల్ల ఆనవాలు చూపించవచ్చు కానీ.. నిజంగా నేను సీతనే చూశాను అని రాముడికి చెప్పి నమ్మించాలంటే మీ ఇద్దరికే తెలిసిన మీ మధ్య జరిగిన ఓ సన్నివేశాన్ని నాకు చెబితే ఆ సన్నివేశాన్ని నేను రాముడికి చెబుతా’’ అని సీతతో హనుమంతుడు అంటాడు. అప్పుడు సీత.. ‘‘ఓ రోజు నేను రాముడి ఒడిలో నిద్రిస్తున్నప్పుడు ఓ కాకి వచ్చి నా గుండెలమీద పొడుస్తుంటే రాముడి నిద్ర చెడకూడదని నేను అలాగే భరిస్తూ ఉన్నాను.

కానీ నా రక్తపు చుక్క తగిలి రాముడు నిద్రలేచి చూస్తుండే సరికి కాకి మళ్లీ పొడవటానికి వస్తుంది. అంత శాంతమూర్తి కూడా కోపంతో ఓ గరికను లాగి ఆ కాకిమీదకు బ్రహ్మాస్త్రంగా వేశాడు’’ అంటూ ఓ సన్నివేశం హనుమంతుడికి చెబుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే... నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని చెప్పి గరిక గర్వపడే కంటే..ఓ వ్యక్తి మంత్రించడం వల్ల నేను బ్రహ్మాస్త్రం అయ్యాను అని గరిక వినయంగా ఒప్పుకుంటే... ఆ గరిక విలువ, రాముడి విలువ పెరుగుతుంది. రాముడి విలువ పెరగదు... తగ్గదు.. ఆ రాముడి విలువ ఎప్పుడూ అలానే ఉంటుంది’’ అన్నారు.

ఎడిటర్‌ మోహన్ , ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ వాకాడ అప్పారావు, నటీనటులు కస్తూరి, మురళీ మోహన్, సునీల్, మురళీ శర్మ, డెలాగ్‌ రైటర్‌ లక్ష్మీ భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement