‘‘నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేయాలి. ‘నాయగన్’ సినిమాలో కమల్‌హాసన్‌లా కొత్త గెటప్ ట్రై చేయాలని ఉంది. చిరంజీవి నటించిన ‘ఆపద్బాంధవుడు’ చిత్రం అంటే ఇష్టం. అలాగే ‘బాహుబలి’ కూడా. అలాంటి సినిమాలు చేయాలన్నదే నా కల. కొత్త తరహా కథతో రూపొందించిన కృష్ణమ్మ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అని హీరో సత్యదేవ్ అన్నారు. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సందర్భంగా హీరో సత్యదేవ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘కృష్ణమ్మ సినిమాకి నటీనటులు, సాంకేతిక నిపుణులందరూ ఓకే అయ్యాక నేను చివర్లో ఈ ప్రాజెక్టులోకి వచ్చా. గోపాలకృష్ణ చెప్పిన కథ నిర్మాత కృష్ణకు నచ్చింది. ఆ తర్వాత ఈ కథను కొరటాల శివ విన్నారు. ఆయనకు బాగా నచ్చడంతో సమర్పకుడిగా మారారు. కొరటాలగారు కథలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. అంత పెద్ద డైరెక్టర్ అయిన కొరటాల స్క్రిప్ట్‌లో మార్పు చెప్పకుండా సినిమాకు సపోర్ట్ చేయడం సంతోషం. ∙విజయవాడ పేరు చెప్పగానే రాజకీయం, రౌడీయిజం గురించి చెబుతుంటారు. కానీ, విజయవాడ అంటే అవి మాత్రమే కాదని చెప్పే కథే కృష్ణమ్మ. ముగ్గురు స్నేహితుల కథే ఈ మూవీ. మంచి ఫ్యామిలీ ఉండాలి, జీవితంలో బాగా సెటిల్ కావాలనుకునే ముగ్గురు ఫ్రెండ్స్ కల చెదిరిపోతుంది.
అసలు అప్పుడు వాళ్లేం చేశారు? అనే కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో వించిపేట భద్ర అనే పాత్ర చేశాను. విజయవాడ యాస, పొగరు, పగ.. ఇలాంటివన్నీ ఆ పాత్రలో చూపించడం సవాల్‌గా అనిపించింది. నిర్మాత కృష్ణకి సినిమా అంటే ఫ్యాషన్. ఆయన ఖర్చుకి వెనకాడకుండా షూటింగ్ అంతా విజయవాడలోనే చేయడానికి సపోర్ట్ చేశారు. కాలభైరవ చాలా ఇంటెన్స్ ఉన్న సంగీతం ఇచ్చాడు. ‘కృష్ణమ్మ’ మూవీతో సత్యదేవ్ స్టార్ అవుతాడనే నమ్మకం ఉందని రాజమౌళి అనడం హ్యాపీగా అనిపించింది. ఈ మూవీ హిట్ అయి స్టార్‌డమ్ వచ్చినా నేను ఇప్పటిలాగే ఉంటాను. చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్‌గారి ‘రామసేతు’ చిత్రాలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉత్తరాదిలోనూ నాకు మంచి గుర్తింపు వచ్చింది. మళ్లీ ఆ రేంజ్ పాత్రలు రాకపోవడంతో చేయడంలేదు. తమిళంలో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment