Sunita Kejriwal: కేజ్రీవాల్‌ నిజాలన్నీ వెల్లడిస్తారు!

Delhi liquor scam: Sunita Kejriwal says Arvind Kejriwal will reveal truth in court - Sakshi

‘లిక్కర్‌’ డబ్బు ఎక్కడుందో నేడు కోర్టులో చెప్పబోతున్నారు

రుజువులు కూడా సమర్పిస్తారు 

కేజ్రీవాల్‌ భార్య సునీత వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ:  మద్యం కుంభకోణం కేసులో నిజాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నట్లు ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందంటూ ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం కలిసినప్పుడు నా భర్త నాతో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు.

ఢిల్లీలో తాగునీటి సమస్యను నివారించాలని లేఖ ద్వారా పంపిన ఉత్తర్వులను కూడా కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోంది. ఢిల్లీ నాశనం కావాలని కోరుకుంటోంది. ఈడీ అధికారులు ఇప్పటిదాకా 250 సార్లు సోదాలు నిర్వహించారు. మా నివాసంలో సోదాలు చేసి కేవలం రూ.73 వేలు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ము ఇంకా దొరకలేదని ఈడీ చెబుతోంది. మద్యం కుంభకోణంలో నిజనిజాలు, ఆ డబ్బు ఎక్కడుందో గురువారం కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్‌ నాతో చెప్పారు. అందుకు రుజువులు కూడా సమర్పిస్తారు’’ అని వీడియో సందేశంలో సునీత స్పష్టం చేశారు.  

క్షీణిస్తున్న కేజ్రీవాల్‌ ఆరోగ్యం  
ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. మధుమేహ బాధితుడైన కేజ్రీవాల్‌ రక్తంలో చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయని వెల్లడించాయి. కేజ్రీవాల్‌ బ్లడ్‌షుగర్‌ లెవెల్‌ ఒక దశలో 46 ఎంజీకి పడిపోయిందని డాక్టర్లు చెప్పారని, ఇది చాలా ప్రమాదరమని తెలియజేశాయి.  

హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట  
కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన అరెస్టులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తనను ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలంటూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌ 2వ తేదీలోగా స్పందించాలని న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఈడీకి సూచించారు. తదపరి విచారణను ఏప్రిల్‌ 3వ తేదీకి వాయిదా వేశారు.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top