ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ

Published Sat, Apr 6 2024 6:30 AM

Delhi court allows CBI to question Kavitha - Sakshi

ఆమెను ప్రశ్నించాల్సి ఉందంటూ ప్రత్యేక కోర్టులో సీబీఐ పిటిషన్‌

తీహార్‌ జైలులోనే విచారించేందుకు కోర్టు అనుమతి   

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. కవిత తీహార్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది.

సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్‌ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో మహిళా సిబ్బంది తప్పకుండా ఉండాలని.. విచారణకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని సూచించింది.

ఇంతకు ముందు ఓసారి విచారణ: ఢిల్లీ లిక్కర్‌ వ్యవహారంలో.. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాతోపాటు మరో 14 మందిపై 2022 జూన్‌ 22న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అమిత్‌ అరోరా ఇచ్చిన వాంగ్మూలం, పలు విచారణ అంశాల ఆధారంగా ప్రశ్నించాల్సి ఉందంటూ.. అదే ఏడాది డిసెంబర్‌ 2న ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్‌ 11న హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వచ్చి ప్రశ్నించారు. తర్వాత ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఆలోగానే కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఈడీ అదుపులోకి తీసుకుంది.

బెయిల్‌పై సోమవారం స్పష్టత
ఈ కేసులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం స్పష్టత రానుంది. ఇక రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఈనెల 20న విచారణ చేపడతామని సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. అయితే కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. వచ్చే వారం జైలులోనే ఆమెను విచారించాలని భావిస్తున్నట్టు తెలిసింది.

Advertisement
Advertisement