దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్‌లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.
2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.
మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.
హైదరాబాద్‌లో భారీగా లీజింగ్
హైదరాబాద్‌లోనూ ఆఫీస్ స్థలం లీజింగ్ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.
ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్‌లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ లీజింగ్‌లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.
ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్‌కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.
ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్‌ఎస్‌ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment