హైదరాబాద్‌లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్‌ | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో కుండపోత.. వాతావరణశాఖ వార్నింగ్‌

Published Tue, May 7 2024 6:02 PM

IMD Issues Heavy Rain Alert In Hyderabad

హైదరాబాద్‌లో భారీ వర్షం

నగరాన్ని వణికించిన ఈదురుగాలులు

పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జాం

మండుటెండలతో అల్లాడిన హైదరాబాద్‌కు మరో చిక్కొచ్చి పడింది. వేడి చల్లారుతుందనుకుంటే.. వరుణదేవుడు అంతకు మించిన ప్రతాపం చూపించాడు. సాయంత్రం 5.30గంటల నుంచి మొదలైన వర్షం ఒక్కసారిగా ఉదృతంగా మారింది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు నగరజీవులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పుడప్పుడే ఆఫీసుల నుంచి బయటకు వస్తోన్న ఉద్యోగులు గాలివానకు అల్లాడిపోయారు. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్‌ జాం అయింది. టూవీలర్లు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్‌కు వార్నింగ్‌
అయితే రాబోయే సమయంలో హైదరాబాద్‌ జంట నగరాల పరిధిలోని పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నార్త్‌ హైదరాబాద్‌ పరిధితో పాటు పరిసర ప్రాంతాల్లో వర్షం పడే సూచనలున్నాయని పేర్కొంది. వాతావరణాన్ని అంచనా వేసే వెబ్‌సైట్లు అక్యువెదర్‌ ప్రకారం ఈ సాయంత్రమంతా హైదరాబాద్‌తో పాటు ఏపీలోని కోస్తా ప్రాంతం, ఉత్తర తెలంగాణకు తీవ్ర వర్షం పొంచి ఉన్నట్టు తెలిపింది. మధ్యాహ్నం 3గంటల నుంచి ఏపీలో వర్షాలు పడతాయని, సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో వర్షాలు పడతాయని అంచనావేసింది. ఈ అంచనాలకు అనుగుణంగానే భారీగా వర్షాలు కురుస్తున్నాయి

హైదరాబాద్‌లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉందని.. రాత్రి సమయంలో పలుచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తేలికపాటి నుంచి మోస్తరు.. ఉరుములు, మెరుపులతో వాన కురిసే అవకాశం ఉందని తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని సూచించింది.

తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదుగాలులతో వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టగా.. సాయంత్రం ఒక్కసారిగా వర్షం మొదలైంది. కూకట్‌పల్లి, నిజాంపేట, కేపీహెచ్‌బీ, లిగంపల్లితో పాటు మేడ్చల్‌, కండ్లకోయ, దుండిగల్‌, గండిమైసమ్మ, చందానగర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంతో పాటు పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి.

 సికింద్రాబాద్‌, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, ప్యారడైజ్‌, మారేడ్‌పల్లి, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్‌, సుచిత్ర, జీడిమెట్ల, బహదూర్‌పల్లి, పేట్‌బషీరాబాద్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా పరిధిలోని పలుచోట్ల వర్షం కురిసింది.  నేటి వరకు ఎండలతో బెంలేతెత్తిన జనానికి..  ఒక్కసారిగా వాతావరణం మారిపోవడమే కాకుండా ఈదురుగాలులు భయపెట్టించాయి. 

 

 

Advertisement
Advertisement