Delhi: కేజ్రీవాల్‌ ఛాలెంజ్‌.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద హైటెన్షన్‌ CM kejriwal and Top AAP Leaders To Protest At BJP headquarters delhi updates | Sakshi
Sakshi News home page

Delhi: కేజ్రీవాల్‌ ఛాలెంజ్‌.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌ వద్ద హైటెన్షన్‌

Published Sun, May 19 2024 10:17 AM

CM kejriwal and Top AAP Leaders To Protest At BJP headquarters delhi updates

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  తమ పార్టీ నేతలను  అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేసి జైలుకు పంపాలని సవాల్‌ చేశారు. ఇవాళ మధ్యాహ్నం పార్టీ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయానికి నిరసన మార్చ్‌ చేపట్టనున్నారు సీఎం కేజ్రీవాల్‌. దీంతో ఢిల్లీలోని  బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద హైటెన్షన్‌ నెలకొంది. 

తమ పార్టీ నేతలను అరెస్ట్‌లతో బీజేపీ టార్గెట్‌ చేయడాన్ని తప్పుపట్టిన కేజ్రీవాల్‌  ఆదివారం తన పార్టీ నేతలతో బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తామని కావాలనుకుంటే అందరినీ ఒకేసారి అరెస్ట్‌ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో తన పీఏ బిభవ్ కుమార్ అరెస్టయిన నేపథ్యంలో సీఎం కేజ్రీవాల్‌ వీడియోలో సందేశం ద్వారా పార్టీ నేతలకు నిరసన, మార్చ్‌కు పిలుపు నిచ్చారు.

‘‘మా నేతలను ఒకరి తర్వాత ఒకరిని జైలులో పెడుతున్నారు. ప్రధాని మోదీకి నేను ఒకటి చెప్పదల్చుకున్నా. అరెస్ట్‌లను ఒక క్రీడా భావిస్తున్నారు. మా నేతలనంతా ఒకేసారి అరెస్ట్‌ చేయండి. అందుకే  నేను,  మా పార్టీ  సీనియర్‌ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తీసుకొని ఆదివారం బీజేపీ ప్రధాన కార్యాలయానికి వస్తాం. అప్పుడు మమల్ని ఒకేసారి జైలులో వేయండి’’ అని కేజ్రీవాల్‌ శనివారం ఓ వీడియో విడుదల చేశారు.

తమ పార్టీలో కీలకమైన నేతలను బీజేపీ టార్గెట్‌ చేస్తోందని మండిపడ్డారు. వారిలో రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా, మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిశీ ఉన్నారని కేజ్రీవాల్‌  తెలిపారు.

లోక్‌సభ ఎన్నికల వేళ ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఎ బిభవ్‌ కుమార్‌ తనపై ముఖ్యమంత్రి నివాసంలో దాడి చేశారని ఆరోపణలు చేయటం ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. బిభవ్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. శనివారం బిభవ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయన ఐదు రోజుల పోలీసు కస్టడీలో ఉన్నారు. సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ తనతో అమర్యాదగా ప్రవర్తించారని బిభవ్‌ కుమార్ సైతం ఆమెపై కేసు నమోదు చేశారు.

స్వాతి మలివాల్‌పై అవినీతి అరోపణ కేసు ఉండటంలో బీజేపీ  కుట్రతోనే తనపై దాడి జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారని ఆప్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.

మరోవైపు.. స్వాతి మలివాల్‌ ఘటన విషయంలో బీజేపీ నేతలు సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు చేస్తున్నారు. దాడి జరిగి రోజులు గడుస్తున్నా.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనంగా  ఉంటున్నారని మండిపడుతున్నారు. సీఎం కేజ్రీవాల్‌ పెదవి విప్పకపోవటంపై  ఈ దాడి వెనక ఆయన హస్తం ఉందంటూ బీజేపీ ఆరోపణలు చేస్తోంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement