'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..! | How We Are Helping Kids With Healthy Activities In Summer Holidays | Sakshi
Sakshi News home page

'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!

Published Sun, May 19 2024 12:19 PM | Last Updated on Sun, May 19 2024 4:57 PM

How We Are Helping Kids With Healthy Activities In Summer Holidays

వేసవి అంటే వేడి.. ఉక్కపోత.. పచ్చళ్లు.. అప్పడాలు, వడియాలు, మల్లెపూలు, మామిడిపళ్లు! కానీ తూనీగల్లాంటి పిల్లలకు మాత్రం వేసవంటే అచ్చంగా సెలవులడ్లు.. స్కూలు, హోమ్‌వర్క్, క్రమశిక్షణ నుంచి కొంతకాలం ఆటవిడుపు. ఇంతకాలం వారంలో వచ్చే ఒక ఆదివారం లేదా రెండవ శనివారంతో కలసి వచ్చే రెండురోజుల సెలవులతో సరిపెట్టుకున్న పిల్లలకు దాదాపు నలభై అయిదు రోజుల సెలవులు ఎంత సంబరం కలిగించే విషయమో కదా!.  సెలవల్ని చక్కగా ప్లాన్‌ చేసుకుంటే ఎండా తప్పించుకోవచ్చు. మన విలువైన సెలవుల కాలాన్ని సద్వినియోగమూ చేసుకోవచ్చు. అందుకే ఈ సెలవుల్ని మరుసటి ఏడాదికి ఒక మరపురాని జ్ఞాపకంగా, మళ్లీ రొటీన్‌లో పడేందుకు ఒక రీచార్జ్‌గా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.

సుమారు ఇరవై ముప్పై ఏళ్ల కిందటి వరకు ‘వేసవి సెలవులు’ ఎంత గొప్పగా ఉండేవనీ! పిల్లలూ పెద్దలూ కూడా వేయికళ్లతో ఎదురు చూసేలా ఉండేవి. ఎండాకాలం సెలవుల్లో గ్రామీణ ప్రాంతం వారు పట్టణాలకు, పట్టణాల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మమ్మ, నాయనమ్మలు ఇతర బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. ఇందులో భాగంగా రకరకాల శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఆయా ప్రాంతాల పద్ధతులు, అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునే వీలుంటుంది. దాని ద్వారా పిల్లల్లో అనుభవ జ్ఞానం కలుగుతుంది. వీటన్నింటినీ ఆనాటి పిల్లలు ఎటువంటి నిర్బంధమూ లేని స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో హాయిగా ఆస్వాదించేవారు. 

ఆటపాటల విషయంలో కూడా నాటి వేసవి సెలవుల తీరే వేరు. ఊరి చివరి చెరువులు, బావుల్లో ఈత కొట్టడం, కోతికొమ్మచ్చి ఆడటం, సీమ చింతకాయలు, బాదం కాయలు ఏరుకుని తినడం, మామిడి తోటలలో చెట్లకు కాసిన కాయలకు రాళ్లేసి కొట్టడం, రాలిన కాయలను కోసుకుని ఉప్పూకారం అద్దుకుని తినడం, తాటిముంజెలను జుర్రడం, ఆనక ఆ తాటిబుర్రలను బండిలా తయారు చేసుకుని ఈడ్చుకుంటూ వీధుల వెంబడి తిర గడం.. ఇవిగాక ఆరుబయట కబడ్డీ, క్రికెట్, నేలా బండాలాంటి ఆటలు హాయిగా ఆడుకోవడం. వీటన్నింటి వల్లా మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి శారీరక వ్యాయామమూ లభించేది. 

దాంతో కరకరలాడే ఆకలి పుట్టి, చద్దన్నాలనీ, చింతకాయపచ్చళ్లనీ చూడకుండా పెద్దవాళ్లు పెట్టినదంతా వద్దనకుండా కడుపునిండా తిని సెలవులు అయిపోయి తిరిగి స్కూళ్లు, కాలేజీలు తెరిచేసరికి నిగనిగలాడుతూ నున్నగా తయారయేవాళ్లు. ఆటలేగాక ఆయా కాలాలలో లభించే మామిడి, పనస, ఈత, జామ వంటి పళ్లు స్వయంగా సేకరించుకుని అందరూ కలసి కాకెంగిలి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తినడంలో కూడా చెప్పలేని అనుభూతి, ఆనంద ఆరోగ్యాలు సొంతమయ్యేవి.

ఇక రాత్రివేళ ఆరుబయట అందరూ కూర్చుని రోజంతా చేసిన అల్లరిపనులు నెమరువేసుకుంటూ కలసి అన్నాలు తినడం, ఆ తరువాత డాబాల మీదనో ఆరు బయట మంచాల మీదో పిల్లలంతా కబుర్లాడుకోవడంతో పాటు తాతయ్యలు, మావయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు. నాటి పిల్లలు భేదాభిప్రాయాలు, అరమరికలూ లేకుండా కలసిమెలసి ఉండేవారు. ఒకవేళ ఏమన్నా చిన్నా చితకా తేడాలు, మాట పట్టింపుల్లాంటివి వచ్చినా పెద్దలు వెంటనే బుజ్జగించి బుద్ధి చెప్పేవారు. 

ఆచరణతో జీవించే నాటి తరం పెద్దలంటే పిల్లలకు భయంతో కూడిన గౌరవం ఉండేది. ఒక చక్కని దృక్పథంతో భయభక్తులతో ‘పరిధులు గల స్వేచ్ఛ’తో పరమానంద భరితమైన బాల్యం అనుభవించేవారు ఆనాటి పిల్లలు. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి వేసవి సెలవులు కేవలం ‘ఆటవిడుపు వినోదాలకే’ కాకుండా విలువైన నైతిక భావాలు నింపే రోజులుగా కూడా చెప్పవచ్చు.    

మరి ఇప్పుడు..?
ఇప్పుడు నానమ్మలు, అమ్మమ్మలు, ఇతర పెద్దలూ దాదాపు కనిపించడం లేదు. అన్నిచోట్లా దాదాపు న్యూక్లియర్‌ కుటుంబాలే! పిల్లలకు సుద్దులు చెప్పవలసిన తాతలూ, బామ్మలూ వంటి పెద్దలు వృద్ధాశ్రమాలలో మూలుగుతున్నారు. ఈ పరిస్థితులలో వాళ్లకు కథలూ కాకరకాయలూ చెప్పేవారే ఉండరు కాబట్టి, కనీసం వాళ్లు ఆడియో కథలైనా వినేలా ఏర్పాటు చేయాలి. 

ఎందుకంటే కథలు చక్కటి ఊహాకల్పనకు, తద్వారా సృజనకు ప్రాణం పోస్తాయి. ఎందుకూ పనికిరారనుకున్న రాజుగారి కుమారులు విష్ణుశర్మ చెప్పిన పంచతంత్ర కథల ద్వారానే ప్రయోజకులయ్యారని మనం చదువుకున్నాం. అందువల్ల వీలయినంత వరకు ఏదో ఒకలా వారి చేత పుస్తకాలు చదివించడం లేదా కథలు వినేలా చేయడం మంచిది. 

పిల్లలూ.. ఊరికెళుతున్నారా? 
వేసవైతే పల్లెకు వెళ్తుంటారు చాలామంది. సాధారణంగా పల్లెటూరి వాతావరణానికి, పట్నాలు, నగరాల వాతావరణం, జీవనశైలికీ చాలా తేడా ఉంటుంది. పట్టణాలూ, నగరాలూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగానే నిద్ర లేస్తుంటాయి. గ్రామీణ వాతావరణం మాత్రం అందుకు విరుద్ధం. రాత్రిపూట తొందరగా పడుకుని, తెల్లవారు ఝాముకల్లా నిద్రలేచి.. పొలం పనులు, ఇంటిపనులు చేసుకుంటారు. మీరు పల్లెటూళ్లకు వెళితే అక్కడా బద్ధకంగా బారెడు పొద్దెక్కాక లేవద్దు. వీలయినంత తొందరగా నిద్రలేవండి. 

పొలం పనులకు పెద్దలు వెళ్తుంటారు కదా. వారితోబాటు మీరూ వెళ్లండి. వాళ్లు చేసే పనులు శ్రద్ధగా చూడండి. దుక్కి దున్నడం, పొలాలకు నీళ్లు పట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులనూ గమనించండి. మీరు వెళ్లే దారిలో ఏయే పంటలున్నాయో, మొక్కలున్నాయో, చెట్లున్నాయో.. ఏ పంటకు ఎంతకాలం పడుతుందో, ఏ మొక్కకు ఏయే పూలూ, పండ్లు వస్తాయో తెలుసుకోండి.

చెట్ల ఆకులను, కొమ్మలను పరిశీలించండి. వాటి పై ఏయే పక్షులున్నాయో చూడండి. వాటి కూతలను అనుకరించండి. మీరు చూసిన వాటి వివరాలన్నీ ఇంటికొచ్చాక ఒక డైరీలోనో, నోట్‌బుక్‌లోనో రాయండి. పక్షి రెక్కలెలా ఉన్నాయో, ఏయే రంగులలో ఉన్నాయో రాసుకోండి, వీలయితే వాటి బొమ్మలనూ వేయండి. చెట్ల పేర్లు, వాటి ఆకుల ఆకారం, వాటి సైజు వివరంగా రాయండి.

ఇంట్లో పనులను, వంట చేసే పద్ధతిని గమనించండి. మీ సందేహాలను పెద్దవాళ్లనడిగి తీర్చుకోండి. ఆ వివరాలన్నీ నోట్‌ చేసుకోండి. పెద్దల సమక్షంలో ఆ పనులన్నింటినీ ప్రయత్నించండి. అన్నం తిన్న తరువాత కాసేపు పడుకుని సాయంత్రం బయటికెళ్లి కొత్త స్నేహాలను కలుపుకోండి. కొత్త కొత్త ఆటలను నేర్చుకోండి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తమామల చేత కథలు చెప్పించుకుని వినండి. పాటలు పాడే వాళ్ళను పాడమనండి. 

వాటన్నింటినీ నేర్చుకోండి. అన్నీ పుస్తకంలోకి ఎక్కించడం మాత్రం మరవకండి. మిగిలిన సమయాల్లో దొరికిన పుస్తకమల్లా చదవండి. మీ తోటివాళ్లతో మీరు చూసిన సినిమా, ఊళ్ళ విశేషాలను పంచుకోండి. వాళ్ళ విషయాలనూ అడిగి తెలుసుకోండి. దూరంగా ఉన్న స్నేహితులకి ఈ విషయాలతో ఉత్తరాలు రాయండి. మీరు చదివిన, విన్న కథలను, అలాగే సినిమాలనూ ఇతరులకు చెప్పండి. సొంత భాషలో వాటిని తిరిగి రాయండి. అలా చేస్తే మీరు విన్న, కన్న విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. 

అలాగే సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా విషయాలను చెప్పడం అలవడు తుంది. భాష, భావప్రకటనల మీద పట్టు వస్తుంది. ఆసక్తి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. బొమ్మలు వేయగలిగిన వాళ్ళు.. సెలవుల్లో చూసిన విశేషాలను బొమ్మలుగా వేయండి, కథలు రాయండి.

పెద్దలూ.. ఇలా చేయండి!
బోధనా మాధ్యమాలు మాతృభాషేతరం కావడం వల్ల పిల్లలు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన ‘అమ్మ భాషలోని బాల సాహిత్య’ సొగసులను ప్రత్యక్షంగా అందుకోలేక ఎంతో నష్టపోతున్నారు. విలువైన చదువులు విద్యార్థులకు సార్థకత చేకూర్చాలంటే చదువు అనే ప్రధాన పంటలో అంతర్గత పంటగా ఉండాల్సిన ‘నైతిక విద్యా విలువలు’ భావిపౌరులకు అత్యవసరంగా అందించాలి. అందులో ప్రధానం పుస్తక పఠనం. దాన్ని అలవర్చడానికి వేసవి సెలవులను మించిన వేదిక లేదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ల ఆత్మకథలు, నీతి కథలు వంటివి పిల్లల చేత చదివించండి. వాళ్లు ఏం అర్థం చేసుకున్నారో సమీక్షలు రాయమనండి. 

లేదంటే వినిపించమనండి. అలా వినిపిస్తున్నప్పుడు వాటిని రికార్డ్‌ చేసి ఒక పాడ్‌కాస్ట్‌ చానెల్‌ను క్రియేట్‌ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్న వాట్సాప్‌ గ్రూప్స్‌లో షేర్‌ చేయండి. తద్వారా వచ్చిన ప్రశంసలు పిల్లల్లో కొత్త ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. వాళ్ల ఆలోచనా శక్తి, ఊహాశక్తి మెరుగవుతుంది. సైన్స్‌ మీద ఆసక్తి ఉన్న పిల్లల చేత సైన్స్‌ ప్రయోగాలు చేయించండి. తెలుగు, ఇంగ్లిష్‌ భాషల పదసంపదను పెంచుకునేలా వాళ్ల చేత పజిళ్లు నింపించండి. తార్కిక జ్ఞానం కోసం సుడోకు లాంటివి పూర్తి చేయించండి.

 పర్యావరణ స్పృహ కోసం వాళ్లు ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడండి. జంతువులతో పక్షులతో సమయాన్ని గడిపేలా ప్లాన్‌ చేయండి. టెర్రస్‌ మీద లేదా పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు, పూలమొక్కల పెంపకం వంటి విషయాల్లో మెలకువలు నేర్పించండి. అలాగే పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే సమయం వేసవి సెలవులే! సంగీతం, డాన్స్, పెయింటింగ్, డ్రాయింగ్‌ నేర్పించడం, కుట్లు, అల్లికలు, కాగితాలతో బొమ్మల తయారీ(ఓరిగామి), ఎండిన ఆకులు, క్లాత్‌తో బొమ్మలు చేయించండి. వీటివల్ల పిల్లల్లో సృజనతోపాటు మానసిక వికాసం కలుగుతుంది.

ప్రాక్టికల్‌గా జీవించడం
జీవితంలో ఎదగడానికి చదువు ఒక ఆసరా మాత్రమే! దాంతోపాటు తెలుసుకోవలసిన ప్రాక్టికల్‌ పాఠాలు చాలా ఉంటాయి. 13 ఏళ్లు నిండిన పిల్లలు తమ చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను తెలుసుకునేందుకు అర్హులు అవుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి వాళ్లకు చెప్పవచ్చు. జీవితాన్ని బ్యాలెన్స్‌ చేసుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో చెప్పాలి. డబ్బు విలువ, పొదుపు అవసరాల గురించి తెలియజేయాలి. 

ఆర్థిక లావాదేవీలను ఆధునిక టెక్నాలజీ ఎంత మేడ్‌ ఈజీ చేసినా బ్యాంకు, దాని పనితీరు గురించి పిల్లలకు ప్రాక్టికల్‌గా చూపించాలి. అందుకే బ్యాంకుకు వెళ్లేటప్పుడు పిల్లలనూ తీసుకెళ్లాలి. అక్కడ డబ్బు ఎలా డిపాజిట్‌ చేస్తారు, ఎలా విత్‌ డ్రా చేస్తారు. చెక్‌ బుక్‌ అంటే ఏంటి, డీడీ ఎలా తీస్తారు.. వంటి ప్రాథమికాంశాలను చూపించాలి. పిల్లల పేరిట ఇచ్చే బ్యాంక్‌ అకౌంట్స్‌ వివరాలను తెలుసుకుని వాటిని ఓపెన్‌ చేయించి, ఎలా ఆపరేట్‌ చేయాలో నేర్పిస్తే మంచిది. 

పోస్ట్‌ ఆఫీస్‌ సేవింగ్స్‌
బ్యాంక్‌ తర్వాత తిరిగి ఆ స్థాయిలో సేవలు అందిస్తున్నది పోస్టాఫీసులే! కాబట్టి పిల్లలను పోస్టాఫీసుకూ తీసుకువెళ్లి అక్కడి పని విధానంపైనా అవగాహన కలిగించాలి. అలాగే పోస్టాఫీసులో ఉండే పొదుపు పథకాల గురించి తెలియజెబుతూ వారికి అక్కడ పొదుపు ఖాతా తెరిచి, వారంతట వారే తమ పాకెట్‌ మనీని తమ ఖాతాలో జమ చేసుకునేలా చేయాలి.

అన్ని పనులూ.. అందరికీ
ఇంకో విషయం.. పిల్లలకు ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఇంటి పని, వంటపని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే! వారిని గారాబం చేయడంతోపాటు పనులపై అవగాహన కూడా కలిగించడం అవసరం. తద్వారా భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా ఏ పని కోసమూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా చేసుకోగలుగుతారు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

ఆటవిడుపు
పిల్లలు ఎంత ఆడుకుంటే అంత ఉల్లాసం కలుగుతుంది. అందుకే వారిని బాగా ఆడుకునేలా చేయాలి. ఇండోర్‌ గేమ్స్‌ ద్వారా కేవలం మాన సికోల్లాసమే కలిగితే, ఔట్‌డోర్‌ గేమ్స్‌ వల్ల శారీరక ఉల్లాసం కూడా చేకూరుతుంది. ఆటలాడిన పిల్లలు మంచి తిండి తిని బలంగా తయారవుతారు. శారీరక బలం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 

చెట్టుకు చెంబుడు నీళ్లు.. పిట్టకు చారెడు గింజలు
పిల్లలకు భూతదయ అంటే ఏమిటో తెలియజెప్పాలి. ఎండుతున్న చెట్లకు కాసిని నీళ్లు పోయడం, ఆహారం, నీళ్లు సంపాదించుకునే ఓపిక లేక రెక్కలు వేలాడేసి ప్రాణాలు కోల్పోయే అల్ప జీవుల కోసం కాసిని గింజలూ, నీళ్లూ అందించేలా అలవాటు చేయడం వల్ల వారిలో హెల్పింగ్‌ నేచర్‌ పెరుగుతుంది. 

ఫ్యామిలీ బడ్జెట్‌పై అవగాహన
పిల్లలకు కుటుంబ ఖర్చుల విషయం తెలియడం ఇష్టపడరు చాలామంది తల్లిదండ్రులు. ఆర్థికంగా తమకు ఎంత కష్టం ఉన్నా, దానిని పిల్లలకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు. దానివల్ల భవిష్యత్తులో తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల కుటుంబ అవసరాలకు ఎంత ఖర్చవుతుంది, తమకు ఎంత ఆదాయం వస్తుంది అనే రెండు అంశాలనూ బేరీజు వేసుకుని దానిని సమతుల్యం చేయడం ఎలాగో వారికి నేర్పించాలి. అందుకు ఈ వేసవి సెలవులనే ఆసరా చేసుకోవడం బెటర్‌. 

నేటి వేసవి ‘శిక్ష’ణ  కార్యక్రమాలు
కాలంతో పాటు వస్తున్న మార్పుల్లో భాగంగా గత పదేళ్లుగా వేసవి సెలవుల్లోనూ మార్పులొచ్చి పడ్డాయి. లక్షణాలతోపాటు లక్ష్యాలు మారిపోతున్నాయి. అప్పట్లో వేసవి సెలవులు పిల్లలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నీ ఇస్తే ఇటీవలి కాలంలో వస్తున్న వేసవి సెలవులు మొక్కుబడి ‘శిక్ష’ణల సెలవులుగా తయారయ్యి ‘సమ్మర్‌ కోచింగ్‌’ పేరుతో వేసవి సెలవులు సైతం పాఠశాలల పనిదినాలను తలపింపజేస్తున్నాయి.

పిల్లల అభిప్రాయాలను, ఆకాంక్షలనూ ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఆలోచనా విధానాన్ని, ఆకాంక్షలను, పిల్లల బంగారు బాల్యానికి బలంగా రుద్ది, ‘వేసవి శిక్ష’ణా కార్యక్రమాలకు అంకితం చేసేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. దాంతో పిల్లలు యాంత్రిక జీవనవిధానానికి అలవాటు పడి, సెలవులను కూడా క్షణం తీరికలేకుండా  గడపవలసి వస్తోంది. 

సమ్మర్‌ కోచింగ్‌ పేరుతో ఏమాత్రం శారీరక శ్రమలేని ఆటలు, కేవలం ఇళ్లకే పరిమితమైన, బుర్రలు వేడెక్కే కంప్యూటర్‌ గేమ్స్‌.. అవి కూడా వినోదం కోసం కాక పరీక్షల్లో మార్కుల గుడ్లు పెట్టేందుకు మాత్రమే పనికి వచ్చేలా ఉంటున్నాయి. ఫలితంగా ఆటల ద్వారా రావాల్సిన ఐక్యతాభావం స్థానంలో గెలుపే లక్ష్యం అన్న అనారోగ్యకరమైన పోటీ కనిపిస్తోంది. దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే! పిల్లల బాల్యాన్ని లాగేసుకునే హక్కు ఎవరికీ లేదు, ఉండదు.  

ఎలా ఉండాలో... ఎలా ఉండకూడదో నేర్పించాలి
ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడంతో పాటు సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా పిల్లలకు అవగాహన కలిగించాలి. పిల్లలు విద్యాపరంగా అత్యున్నత స్థాయిలో ఉండాలి అని ఎలా అశిస్తున్నారో అలాగే సామాజికంగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించాలి. 

మన భావి తరానికి కావాల్సింది గొప్ప వ్యక్తులే కాదు, మంచి వ్యక్తులు కూడా. మానవత్వం నిండిన మనుషులు అత్యవసరం, చదువులు మార్కుల కోసమే కాదు పిల్లల్లోని ప్రవర్తనా మార్పుల కోసం కూడా అని గుర్తించాలి. ఈ కాలపు వేసవి సెలవులు సాయపడాలని కోరుకుందాం. 
∙డి.వి.ఆర్‌ భాస్కర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement