ఒక సినిమా నిర్మాణంలో మామూలుగా అయితే కొన్ని నగలు తెప్పిస్తారు. కాని ‘హీరామండీ’ వెబ్ సిరీస్ కోసం 300 కిలోల నగలు అవసరమయ్యాయి. అవి కూడా బ్రిటిష్ కాలం నాటివి. మొగల్ సంస్కృతీ వారసత్వానివి. ఢిల్లీలో శ్రీ పరమణి జువెలర్స్‌కు చెందిన అన్షు గుప్తా భర్త వినయ్‌తో కలిసి మూడేళ్ల పాటు శ్రమించి ఈ నగలు తయారు చేశారు. నత్, ఝూమర్, హాత్ ఫూల్, పస్సా, టీకా... ఎన్నో నగలు. అన్షు గుప్తా పరిచయం.
స్త్రీలు, అలంకరణ అవిభాజ్యం. స్త్రీలు, ఆభరణం కూడా అవిభాజ్యమే. ఆభరణంతో నిండిన అలంకరణ భారతీయ స్త్రీలలో వేల సంవత్సరాలుగా ఉంది. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు, కెంపులు, మరకతాలు, ముత్యాలు... వీటితో తయారైన ఆభరణాలు రాచరిక స్త్రీలకు ప్రీతికరమైనవి. ఐశ్వర్యవంతులకు స్థాయిని కలిగించేవి. అయితే వీరే కాకుండా కళకారులకు కూడా ఆభరణాలు కీలకమైనవి. మొగలుల కాలంలో విరాజిల్లిన తవాయిఫ్‌లు (రాజనర్తకీమణులు) తమ ప్రదర్శనల్లో ఆకర్షణ కోసం భారీ ఆభరణాలను ఉపయోగించేవారు. మరి వారి గురించిన గాథను తెరకెక్కించేటప్పుడు ఆ ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని అందించడానికి ముందుకు వచ్చిన జువెలర్స్ అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తా.
హీరా మండి..
మొగలుల కాలంలో లాహోర్‌లోని ఒక ఏరియా పేరే హీరా మండి. దాని అంతకు ముందు పేరు షాహీ మొహల్లా. అంటే రాచవాడ. పక్కనే ఉన్న కోట నుంచి నవాబులు నడిచి వచ్చేంత దూరంలో ఉండే కొన్ని భవంతుల సముదాయమే షాహీ మొహల్లా. ఇక్కడ తవాయిఫ్‌లు ఉండేవారు. వీరు ఆట, పాటల్లో నిష్ణాతులు. సాయంత్రమైతే వీరి భవంతుల్లో ప్రదర్శనలు జరిగేవి. నవాబులు, శ్రీమంతులు, రసికులు వీటికి హాజరయ్యి తిలకించేవారు. ఈ తవాయిఫ్‌లకు విశేష పలుకుబడి ఉండేది. వీరి దగ్గర ఐశ్వర్యం ఉండేది. రాచరిక రహస్యాలు మొదట వీరికే తెలిసేవి. వీరు మంత్రాంగం నడిపేవారు. 1857 సైనిక తిరుగుబాటులో కూడా వీరు పాల్గొన్నారు. కాని బ్రిటిష్ కాలం వచ్చేసరికి ఇదంతా గతించిపోయింది. షాహీ మొహల్లా కాస్తా సరుకులు అమ్మే మండీగా హీరా మండీగా మారింది. ఆనాడు వెలిగిన వారంతా అంతరించిపోయారు. వేశ్యలుగా మారారు. వారి గాథనే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’ పేరుతో భారీ వెబ్‌సిరీస్‌గా తీశాడు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
భారీ నగలు
పర్‌ఫెక్షనిస్ట్ అయిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ‘హీరామండీ’లో తవాయిఫ్‌ల కోసం నాటి మొగల్ తరహా నగలు కావాలని భావించాడు. గతంలో తన ‘బాజీరావు మస్తానీ’ కోసం పని చేసిన ఆభరణాల శిల్పులైన అన్షు గుప్తా, ఆమె భర్త వినయ్ గుప్తాలను సంప్రదించాడు. వీరు ఢిల్లీవాసులు. వీరికి శ్రీ పరమణి జువెలర్స్ అనే నగల కార్ఖానా, షోరూమ్ ఉన్నాయి. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కార్ఖానాలో ఖరీదైన ఆభరణాలు దొరుకుతాయి. ‘కథ విన్న వెంటనే టైటిల్ దగ్గరి నుంచి ప్రతి పాత్రా ఆభరణాలతో ముడిపడి ఉన్నందుకు ఉత్సాహం వచ్చింది. చరిత్రలోకి వెళ్లి పరిశోధించి నాటి ఆభరణాలు తయారు చేయాలి. మొగలులు కళాప్రియులు. వారి కాలంలో ఆభరణాలలో కెంపులు. ముత్యాలు, వజ్రాలు విరివిగా వాడేవారు. ఆపాదమస్తకం అలంకరించుకోవడానికి వందల రకాల ఆభరణాలు ఉండేవి. అవన్నీ మేము తయారు చేయడానికి ముందుకు వచ్చాం. నేను, నా భర్త వినయ్ మూడేళ్లు కష్టపడి ఈ నగలు తయారు చేయించాం’ అని తెలిపింది అన్షు గుప్తా.
అసలు సిసలు బంగారంతో
‘‘హీరామండీ కోసం కొన్ని ముఖ్యమైన నగలు అసలు బంగారంతోనూ, మిగిలినవి బంగారు పూత కలిగిన వెండితోనూ తయారు చేయించాలని నిర్ణయించాం. వజ్రాలు, ముత్యాలు అన్నీ ఒరిజినల్‌వే వాడాం. మా కార్మికులు మూడేళ్ల పాటు శ్రమపడి మూడు గదుల్లో పది వేల చిన్న, పెద్ద ఆభరణాలు తయారు చేశారు. వీటిని తూస్తే 300 కిలోలు ఉంటాయి. నథ్ (ముక్కు పుడక) దగ్గరి నుంచి నెమలి నెక్లెస్ వరకూ వీటిలో ఉన్నాయి. షూటింగ్‌లో ప్రత్యేక గార్డులు వీటికి కాపలా ఉన్నారు. ‘మేం చేసిన ఆభరణాలు పాత్ర కోసం ధరించి వీటితో పారిపోతే ఒక సినిమా తీసేన్ని డబ్బులొస్తాయి’ అనేది నటి రిచా చద్దా సరదాగా. హీరామండీని చూస్తే ఒక పాత్ర ధరించిన పాపిడి బిళ్లతో మరో పాత్ర ధరించిన పాపిటబిళ్లకు పోలిక ఉండదు. గాజులు, ఉంగారాలు, చెవి కమ్మలు... తెర మీద అద్భుతంగా ఆవిష్కృతమైన తీరుతో మా కష్టం వృథా పోలేదనిపించింది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేసింది అన్షు గుప్తా.
Comments
Please login to add a commentAdd a comment