16 రాత్రి నుంచే అజ్ఞాతంలోకి.. బెంగళూరు వెళ్లినట్టు ప్రాథమిక సమాచారం
ఆయనతో పాటు మరో 14 మంది ఉన్నట్టు పోలీసుల గుర్తింపు
6 ప్రత్యేక బృందాల ఏర్పాటు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు టీడీపీ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరారీలో ఉన్నారు. పోలింగ్ రోజు రెండు మూడు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగినా ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేకపోవడంతో ఆయనపై కేసులు నమోదు కాలేదు. పెదవేగి మండలం కొప్పులవారిగూడెం పోలింగ్ బూత్ సమీపంలో ఈ నెల 13న ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 16వ తేదీన రాజశేఖర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని అదే రోజు భారీ సంఖ్యలో అనుచరులతో పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సినీ ఫక్కీలో పోలీసులపై దౌర్జన్యం చేసి నిందితుడిని బలవంతంగా తీసుకెళ్లిపోయారు.
ఈ ఘటన జిల్లాలో సంచలనంగా మారడంతో పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే చింతమనేనితో పాటు మరో 14 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ విషయం తెలియగానే చింతమనేనితో పాటు అతని అనుచరుల మొబైల్ ఫోన్లు విజయవాడ సమీపంలో స్విచాఫ్ చేశారు. అక్కడ నుంచి తాడేపల్లి ప్రాంతం వెళ్లి బెంగళూరుకు పరారైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిని పట్టుకోవడానికి పోలీస్ యంత్రాంగం ఆరుగురు సీఐల నేతృత్వంలో ఆరు స్పెషల్ టీమ్‌లను ఏర్పాటు చేసింది. నూజివీడు డీఎస్పీ కేసు పర్యవేక్షిస్తున్నారు.
94కు చేరిన కేసుల సంఖ్య...
చింతమనేనిపై ఈ నెల 16న ఐపీసీ సెక్షన్ 353, 224, 225, 143, 149 కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే చింతమనేనిపై ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 93 కేసులు నమోదయ్యాయి. తాజా కేసుతో కలిపి వాటి సంఖ్య 94కు చేరింది. చింతమనేని బెంగళూరు వెళ్లినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించుకుని ప్రత్యేక టీమ్‌లను అక్కడికి పంపారు. హైదరాబాద్‌కు కూడా మరో టీమ్‌ను పంపినట్టు సమాచారం. చింతమనేని తీసుకువెళ్లిన నిందితుడు రాజశేఖర్‌ను శుక్రవారమే అరెస్టుచేసి రిమాండ్‌కు పంపారు.
Comments
Please login to add a commentAdd a comment