పోలింగ్ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్ జగన్
2019కి మించి 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది
59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాం
విజయవాడలో ఐ–ప్యాక్ ప్రతినిధులతో సమావేశం
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి, ఫలితాల అంచనాపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా స్పందించారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కోసం పొలిటికల్ కన్సల్టెన్సీగా పని చేసిన ఐ–ప్యాక్ (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ) కార్యాలయాన్ని సీఎం జగన్ గురువారం సందర్శించారు.
విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఐ – ప్యాక్ కార్యాలయానికి వచ్చిన ఆయన సుమారు అరగంట సేపు గడిపారు. ఐ–ప్యాక్ ప్రతినిధులను అభినందించి సెల్ఫీలు దిగుతూ సరదాగా గడిపారు. 2019 ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాలను దక్కించుకుని వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం సాధించిందని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు. ఈ దఫా అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయ పతాకం ఎగురవేసి వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.
మరింత మంచి చేద్దాం..
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4న వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని.. ఫలితాలు వెల్లడైన తర్వాత దేశం మొత్తం మన వైపు చూస్తుందని సీఎం జగన్ చెప్పారు. 59 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో ప్రజలకు మంచి చేశామని.. రాబోయే ఐదేళ్లలో ఇంకా ఎక్కువ మేలు చేద్దామని చెప్పారు. రానున్న రోజుల్లో ఐ–ప్యాక్‌తో ప్రయాణం ఇలాగే కొనసాగుతుందన్నారు.
విశ్వసనీయతే విజయానికి మెట్టు..
గత ఎన్నికల్లో చారిత్రక విజయంతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తొలి ఏడాదే మేనిఫెస్టోలోని హామీల్లో 95 శాతం అమలు చేశారు. మొత్తమ్మీద 99 శాతం హామీలను అమలు చేశారు. అర్హతే ప్రామాణికంగా వివక్ష, లంచాలకు తావు లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. సంక్షేమ పథకాల ద్వారా 59 నెలల్లో పేదల ఖాతాల్లోకి డీబీటీ రూపంలో నేరుగా రూ.2.70 లక్షల కోట్లను జమ చేశారు.
నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల మేర ప్రయోజనాన్ని చేకూర్చారు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు. చెప్పిన ప్రతి హామీని అమలు చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత మరింత పెరిగింది. వైఎస్సార్‌సీపీ మరో చారిత్రక విజయానికి ఇదే బాటలు వేసిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మహిళలు, గ్రామీణులు వైఎస్సార్‌సీపీ వైపే..
అమ్మ ఒడి, ఆసరా, చేయూత లాంటి పథకాల ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు సీఎం జగన్ సుస్థిర బాటలు వేశారు. కేబినెట్ నుంచి స్థానిక సంస్థల వరకూ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మరీ మహిళలకు పట్టం కట్టారు. ఇంటి స్థలంతోపాటు ఇంటిని కూడా మహిళల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. మహిళా సాధికారతకు బాటలు వేసిన సీఎం జగన్ నాయకత్వంపై మహిళల్లో మద్దతు మరింత పెరిగింది.
గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. ఊరు దాటాల్సిన అవసరం లేకుండా పనులన్నీ జరుగుతుండటంతో సీఎం జగన్ నాయకత్వంపై గ్రామీణుల నమ్మకం మరింత పెరిగింది.ఇటు ప్రభుత్వం.. అటు ప్రైవేట్ రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇవ్వడంతో సీఎం జగన్ నాయకత్వంపై యువతలో విశ్వసనీయత రెట్టింపైంది.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, గ్రామీణులే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మహిళలు, గ్రామీణులు పెద్ద ఎత్తున సీఎం జగన్ నాయకత్వానికి మద్దతుగా ఓటు వేయడం వల్లే పోలింగ్ శాతం పెరిగిందని, వైఎస్సార్‌సీపీ మరోసారి చారిత్రక విజయం సాధించడం ఖాయమని తేల్చి చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment