వైఎస్సార్‌సీపీ ఓటమిపై రాజకీయ వేత్తల విస్మయం
తప్పుడు ప్రచారాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా తిప్పికొట్టి ఖండించడంలో పార్టీ యంత్రాంగం విఫలం
వేధింపులు లేకపోయినా ఉద్యోగులు దూరమయ్యారు
షాక్ కొట్టే ధరలు మందు బాబులకు రుచించలేదు
ల్యాండ్ టైట్లింగ్‌పై విపక్షాల దుష్ప్రచారం
నవరత్నాలు గట్టెక్కించలేకపోయాయి
కోవిడ్‌లోనూ సంక్షేమం అందించినా అండగా నిలవలేదు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి పాలు కావడం అనూహ్యంగా ఉందని తల పండిన రాజకీయ నాయకులు సైతం విస్తుపోతున్నారు. నవరత్నాల హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసిన వైఎస్సార్‌సీపీ పట్ల ఓటర్లు మొహం చాటేయడం ఆశ్చర్యకరంగా ఉందని సీనియర్ రాజకీయనాయకులు విస్మయంవ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ, లోక్‌సభ సీట్లు అత్యల్పంగా రావడం ఊహకు అందనిదని, దుష్ప్రచారాలను క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం సమర్థంగా తిప్పికొట్టలేకపోయిందని.. గ్రామ, మండల, జిల్లా స్థాయిలోఎక్కడికక్కడ వీటిని ఖండించడంలో విఫలమైందని పేర్కొంటున్నారు. దీంతో దుష్ప్రచారాలదే పైచేయి అయిందని, ప్రజలు దాన్నే విశ్వసించారని విశ్లేషిస్తున్నారు.
కోవిడ్ సంక్షోభంలోనూ సీఎం జగన్ ప్రభుత్వం సంక్షేమ యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించినా ప్రజలు అండగా నిలవకపోవడం అంతుపట్టకుండా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. వేధింపులు లేకపోయినా ఉద్యోగులు దూరమయ్యారని, దీంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. ఇచ్చిన మాట మేరకు అధికారంలోకి రాగానే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చినప్పటికీ ఆ తరువాత ఫిట్‌మెంట్‌ను అంతకన్నా తక్కువగా ఇవ్వడంతో ఉద్యోగులు దూరమయ్యారని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.
ఉన్నతాధికారులు ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ను తప్పుదోవ పట్టించారనే అభిప్రాయాన్ని ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. పొదుపు సంఘాల మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామని మాట ఇచ్చిన సీఎం జగన్ మాట మేరకు రూ.25 వేల కోట్లకు పైగా రుణాలను మాఫీ చేశారు. దీంతో మహిళల ఓటింగ్ పెరగడంతో అక్కచెల్లెమ్మలంతా ‘ఫ్యాన్’కే ఓటు వేశారని పోలింగ్ రోజు సర్వత్రా చర్చ జరిగినా ఫలితాల్లో అది కనిపించలేదు.
45–60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలను వారి కాళ్ల మీద నిలబెట్టాలనే తపనతో సీఎం జగన్ వైఎస్సార్ చేయూత కింద రూ.19,189,59 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారు. వారంతా ఆకర్షణకు గురై ఇతర పార్టీల వైపు మొగ్గు చూపారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగనన్న అమ్మ ఒడి ద్వారా రూ.26,067 కోట్ల మేర లబ్ధి పొందిన మహిళల విషయంలోనూ ఇదే జరిగినట్లు విశ్లేషిస్తున్నారు.
మందు ప్రభావం..
దశల వారీ మధ్య నియంత్రణలో భాగంగా షాక్ కొట్టేలా మద్యం ధరలను పెంచడం మందుబాబులకు రుచించలేదని, ఆ ప్రభావం ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. మద్యాన్ని తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం కూడా ప్రభావితం చేసిందని చెబుతున్నారు.
ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలన్నింటినీ కొనసాగిస్తామని, పింఛన్ రూ.3,500కి పెంచుతామని సీఎం జగన్ ఆచరణ సాధ్యమైన హామీలనే ఇచ్చారు. అయితే చంద్రబాబు పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచడంతోపాటు ఏప్రిల్ నుంచి మూడు నెలల బకాయిలతో కలిపి జూలైలో మొత్తం రూ.7 వేలు అందచేస్తామని వాగ్దానం చేశారు. దీంతో పెన్షనర్లు ఆకర్షితులయ్యారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దేశమంతా మెచ్చినా..
వీటన్నింటికి తోడు ఎన్నికల్లో సీఎం జగన్‌పై కూటమి నేతలు వ్యక్తిగత దుష్ప్రచారానికి దిగారు. భూములపై యజమానులకు శాశ్వత హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో వందేళ్ల అనంతరం సమగ్ర భూ సర్వేలో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకొస్తే భూములు లాక్కుంటున్నారంటూ కూటమి నేతలు పెద్ద ఎత్తున అసత్య ప్రచారానికి పాల్పడ్డారు. అర్హతే ప్రామాణికంగా పేదలకు వివక్ష లేకుండా పథకాలను అందించినా ఆయా వర్గాలు పూర్తి స్థాయిలో అండగా నిలవలేదనేది ఫలితాల సరళిని బట్టి అంచనా వేస్తున్నారు.
గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తూ సచివాలయాల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ఇంటి ముంగిటే అందించి దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందినా ప్రజలు ఈ ఎన్నికల్లో పార్టీని ఎందుకు ఆదరించలేదో అర్ధం కావడం లేదని ఓ సీనియర్ రాజకీయ వేత్త వ్యాఖ్యానించారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించకపోవడం ఆశ్చర్యంగా ఉందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment