జగన్ ఓటమిని తట్టుకోలేక పలువురి మృతి
మృతుల కుటుంబాలకువైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
అండగా ఉంటామంటూ భరోసా
సాక్షి, నెట్‌వర్క్: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమిని తట్టుకోలేక గురువారం కూడా పలువురు గుండెపోటుతో మృతిచెందారు. మృతుల కుటుంబాలను వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులకు సమీపంలోని గాం«దీగనర్‌కు చెందిన వైఎస్సార్‌సీపీ నేత కిల్లో మోహన్ తండ్రి కిల్లో అప్పారావు(55) ఈ నెల నాలుగో తేదీన ఓట్ల లెక్కింపులో జగన్‌కు వ్యతిరేకంగా వస్తున్న ఎన్నికల ఫలితాలను చూసి గుండె నొప్పితో అస్వస్థతకు గురయ్యాడు.
కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి.. మెరుగైన వైద్యం కోసం 108లో పాడేరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
తిరుపతి జిల్లాలో..
తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైఎస్సార్‌సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డికి విజయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అన్నం తినడం మానేశాడు. తల్లి ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
అబ్బయ్యచౌదరి ఓటమితో అభిమాని ఆత్మహత్య
దెందులూరులో మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఓటమితో వైఎస్సార్‌సీపీ వీరాభిమాని రామారావుగూడెం యువకుడు సూరవరపు సాయిలింగాచార్యులు(23) ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం రామారావుగూడేనికి చెందిన సాయిలింగాచార్యులు వైఎస్సార్‌సీపీకి, కొఠారు అబ్బయ్యచౌదరికి వీరాభిమాని. ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నాడు. జూన్ నాలుగో తేదీన వెలువడిన ఫలితాలు చూసి మనస్తాపానికి గురయ్యాడు.
గురువారం ఉదయం అబ్బయ్యచౌదరిని కలుస్తానని చెప్పి బయలుదేరగా వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తల దాడులు జరుగుతున్న నేపథ్యంలో రెండు రోజులు ఆగి వెళదామని స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు నచ్చజెప్పారు. ఈ క్రమంలో అభిమాన నేత ఓటమిని భరించలేక.. తీవ్ర మనోవేదనతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి ఆత్మహత్య సమాచారం అందుకున్న అబ్బయ్యచౌదరి ఏలూరు వైద్యశాలకు వెళ్లి సాయి భౌతికకాయాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
వైఎస్సార్ జిల్లాలో..
వైఎస్సార్ జిల్లా తెల్లపాడుకు చెందిన వైఎస్సార్‌సీపీ అభిమాని మాలేపాటి పెద్దనరసింహులు (65) గురువారం మృతిచెందాడు. ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా తన స్వగృహంలో టీవీ చూస్తూ వైఎస్సార్‌సీపీ ఓటమిని చూసి తట్టుకోలేక ఒక్కసారికి గుండెపోటుకు గురయ్యారు. వెంటనే 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ప్రాణాలు విడిచినట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడికి భార్య పార్వతి, కుమార్తె, ముగ్గురు కుమారులున్నారు.
గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా కొమ్మూరు ఎస్సీ కాలనీకి చెందిన మూకిరి ఏషయ్య(46)వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీ అంటే ఎంతో అభిమానంగా ఉండేవాడు. మూడు రోజుల కిందట వెలువడిన ఎన్నికల ఫలితాలను చూసి అన్యాయం జరిగిందంటూ తీవ్ర మనో వేదనకు లోనవుతూ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యుడు చెప్పాడు. ఆటో నడుపుకొనే ఏషయ్యకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అనకాపల్లి జిల్లాలో..
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడికి చెందిన చిరుకూరి రాజుబాబు(72) వైఎస్సార్‌సీపీ అభిమాని. వైఎస్ జగన్ రెండోసారి సీఎం అవుతారని గ్రామంలో అందరితో చెబుతుండేవాడు. కౌంటింగ్ పూర్తయ్యాక వైఎస్సార్‌సీపీకి ఎక్కువ సీట్లు రాలేదని తెలియడంతో ఆందోళన చెందాడు. ఇక వలంటీర్లు పెన్షన్లను ఇంటికి తీసుకువచ్చి ఇవ్వరంటా.. అనే ప్రచారం జరగడంతో రెండు రోజులుగా దిగాలుగా ఉన్నాడు. గురువారం గుండెల్లో మంట వస్తుందంటూ కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.
ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం వేములకు చెందిన వైఎస్సార్ వీరాభిమాని అన్నపురెడ్డి చినగురవారెడ్డి(71) వైఎస్సార్‌సీపీ అభిమాని. దర్శి ఎమ్మెల్యేగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి గెలవడంతో బుధవారం గ్రామస్తులతో కలిసి దర్శి వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డితో చినగురవారెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎవరికీ అన్యాయం చేయలేదని, అందరికీ న్యాయం చేశారని, ఆయనకు ఇంత అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే దిగులుతో ఇంటికి చేరుకున్న చినగురవారెడ్డి గురువారం రాత్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.
మృతుడి కుటుంబానికి కొడాలి నాని రూ.5 లక్షల సాయం
తన ఓటమిని జీర్ణించుకోలేక ఆత్మహత్యచేసుకున్న కుటుంబానికి భరోసాసార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కొడాలి నాని ఓటమిని జీర్ణించుకోలేక కృష్ణా జిల్లా గుడివాడ మండలంలోని సైదేపూడికి చెందిన పిట్టా అనిల్‌కుమార్(26) ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కాగా గురువారం రాత్రి అనిల్ కుటుంబ సభ్యులను మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, పార్టీ నాయకులతో కలసి వెళ్లి పరామర్శించారు. రూ.5 లక్షల సాయమందించారు. మృతుడి భార్య, కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అనిల్ పిల్లల చదువుకు అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment