RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్‌? | RCB In IPL 2024 Playoffs: Fans Burst Crackers, Celebrate All Night Goes Viral | Sakshi
Sakshi News home page

RCB: ట్రోఫీ గెలిచినట్లుగా అంబరాన్నంటే సంబరాలు.. ఎందుకంత ప్రత్యేకం?

Published Sun, May 19 2024 11:14 AM | Last Updated on Sun, May 19 2024 11:50 AM

RCB In IPL 2024 Playoffs: Fans Burst Crackers, Celebrate All Night Goes Viral

అంబరాన్నంటిని ఆర్సీబీ ఫ్యాన్స్‌ సంబరాలు (PC: X)

ఆర్సీబీ.. ఆర్సీబీ.. ఆర్సీబీ.. సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పేరు.. ఆర్సీబీ నామస్మరణతో హోరెత్తుతూ ఆగని జోరు... రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఏకంగా ఐపీఎల్‌-2024 టైటిల్‌ సాధించిందా? అన్నంతగా సంబరాలు..

ఖండాంతరాలు దాటిన సంబురం.. అమెరికాలోనూ పేలుతున్న విన్నింగ్‌ క్రాకర్స్‌.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ చేరిన క్రమంలో ‘నమ్మ బెంగళూరు’ అంటూ కనీవినీ ఎరుగని రీతిలో సెలబ్రేషన్స్‌.. 

అంత ప్రత్యేకమా
ఈ విజయం అంత ప్రత్యేకమా అంటే అవుననే చెప్పాలి. ఇంత వరకు ఒక్కసారి కూడా ఆర్సీబీ టైటిల్‌ గెలవనే లేదు. అయితే, అనూహ్య రీతిలో ఈసారి మహిళా ప్రీమియర్‌ లీగ్‌ రూపంలో తొలిసారి బెంగళూరు ఫ్రాంఛైజీకి ట్రోఫీ దక్కింది.

స్మృతి మంధాన కెప్టెన్సీలో ఆర్సీబీ వుమెన్‌ టీమ్‌ కప్‌ కొట్టింది. ఇదే జోరులో పురుషుల జట్టు కూడా ఈసారి ట్రోఫీ సాధిస్తుందని.. టైటిల్‌ లేదన్న వెలితిని పూరిస్తుందని అభిమానులు ఆశపడ్డారు. అయితే, ఆరంభ మ్యాచ్‌లోనే ఆర్సీబీ ఓటమిపాలైంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో పరాజయంతో సీజన్‌ను మొదలుపెట్టింది.

ఆ తర్వాత సొంతగడ్డపై పంజాబ్‌ కింగ్స్‌పై విజయం సాధించిన బెంగళూరు జట్టు.. అదే జోరును కొనసాగించలేకపోయింది. వరుస వైఫల్యాలతో చతికిల పడి ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించే తొలి జట్టు అవుతుందేమోనన్న భావన కలిగించింది. KGF త్రయంలో విరాట్‌ కోహ్లి రాణించినా గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కెప్టెన్‌ ఫాఫ్ డుప్లెసిస్‌ అంచనాలు అందుకోలేకపోయారు.

మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా
‌ఫలితంగా విమర్శల పాలయ్యారు. దీంతో మాక్సీ కొన్నాళ్లు జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌ చేరాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. నిజానికి ఇలాంటి ఒత్తిడిలో ఏ జట్టైనా చిత్తవుతుంది. కానీ ఆర్సీబీ అందుకు విరుద్ధం.

ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా చెలరేగిపోతాం అన్నట్లుగా వరుసగా ఆరు విజయాలు సాధించి.. ఇప్పుడిలా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. చెన్నై సూపర్‌ కింగ్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఊహించని విజయం సాధించింది. 

రిపీట్‌ అవుతుందా?
సీఎస్‌కేపై గెలిచినా నెట్‌ రన్‌రేటు పరంగా కూడా ఆ జట్టు కంటే మెరుగైన స్థితిలో ఉంటేనే టాప్‌-4కు అర్హత సాధిస్తుందన్న తరుణంలో అద్భుతం చేసి.. టాప్‌-4కు అర్హత సాధించింది. కాగా 2016లోనూ ఆరంభంలో ఆకట్టుకోలేకపోయిన ఆర్సీబీ.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ చేరి.. అటుపై ఫైనల్లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. 

ఈసారి కూడా అదే ఫలితం పునరావృతమవుతుందని అభిమానులు భావిస్తున్నారు. కాగా  2016 ఫైనల్లో ఆర్సీబీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

ఆర్సీబీ వర్సెస్‌ చెన్నై స్కోర్లు
👉వేదిక: చిన్నస్వామి స్టేడియం.. బెంగళూరు
👉టాస్‌: చెన్నై.. బౌలింగ్‌

👉ఆర్సీబీ స్కోరు: 218/5 (20)
👉చెన్నై స్కోరు: 191/7 (20)

👉ఫలితం: చెన్నైపై 27 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం.. ప్లే ఆఫ్స్‌లో ఎంట్రీ
👉ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌: ఫాప్‌ డుప్లెసిస్‌(39 బంతుల్లో 54, కీలక సమయంలో రెండు క్యాచ్‌లు).

చదవండి: Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్‌

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement