టెల్ అవీవ్: ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు హమాస్ అంగీకారం తెలిపితే.. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం దాడుల్ని కొనసాగించాలనే నిర్ణయించింది. మంగళవారం ఉదయం ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) యుద్ధ ట్యాంకులు గాజావైపున ఉన్న రఫా క్రాసింగ్‌ను ఆక్రమించాయి. గాజా పోరులో ఈ ఆక్రమణ కీలక ఘట్టమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ రఫా క్రాసింగ్ నుంచే ఆదివారం రాత్రి హమాస్ దళాలు దక్షిణ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగించాయి. ఈ ఘటనలో నలుగురు సైనికులు మృతి చెందడంతో ఐడీఎఫ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. రఫా క్రాసింగ్ ఆక్రమణ విషయాన్ని ఇజ్రాయెల్ తమకు తెలియజేసిందని ఈజిప్టు అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అంతకు ముందు..
రఫాపై సోమవారం ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్న వేళ.. హమాస్ సంస్థ కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే ఆ విరమణ ఒప్పందం.. తమ కీలక డిమాండ్లకు అనుగుణంగా లేదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించారు. మరోవైపు కాల్పుల విరమణ కోసం కైరోలో జరుగుతున్న చర్చల్లో ఇజ్రాయెల్ యథావిధిగా పాల్గొంటోంది. కొసమెరుపు ఏంటంటే.. ఆ చర్చలు కొనసాగుతున్న వేళలోనే ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశమై రఫాపై మిలిటరీ ఆపరేషన్‌కు పచ్చజెండా ఊపింది.
మరోవైపు ఇజ్రాయెల్ ఆక్రమణతో రఫా క్రాసింగ్ మీదుగా ఈజిప్టు నుంచి గాజాకు చేరుకుంటున్న మానవతా సాయం ఆగిపోయిందని పాలస్తీనా క్రాసింగ్స్ అథారిటీ ప్రతినిధి వేల్ అబు ఒమర్ తెలిపారు. ఈ పరిణామంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అయితే అమెరికా మాత్రం ఇజ్రాయెల్ చర్యను పరిమితమైన ఆక్రమణగానే పేర్కొంటోంది.
Comments
Please login to add a commentAdd a comment