మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికలు ఈసారి మరింత ఆసక్తికరంగా మారాయి. హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన్ ముంబైలోని నార్త్ సెంట్రల్ సీటు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. బిగ్ బాస్ షోలో పాల్గొన్నాక అజాజ్ ఖాన్ జనంలో మరింత ఆదరణ సంపాదించారు. ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఈ ఖాన్ ఉవ్విళ్లూరుతున్నారు.
అజాజ్ ఖాన్ తాను ముంబైలోని నార్త్ సెంట్రల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని, తన ఎన్నికల గుర్తు డంబెల్ అని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వ్యవస్థ మారాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన పేర్కొన్నారు. అజాజ్ ఖాన్ బీజేపీ అభ్యర్థి ఉజ్వల్ నికమ్, కాంగ్రెస్ అభ్యర్థి వర్ష గైక్వాడ్‌లపై పోటీకి దిగారు.
తన సోషల్ మీడియా ఖాతాలో అజాజ్ ఖాన్ ‘వ్యవస్థలో మార్పు తీసుకురావాలనుకుంటే, అవినీతిపరులపై పోరాడాలంటే ఎన్నికల్లో పోటీ చేయాలి. ప్రజలు నన్ను బిగ్ బాస్ షోలో చూసి ఎంతగానో ఇష్టపడ్డారు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక సమాజానికి ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకనే ఎన్నికల బరిలోకి దిగాను.
అయితే ఎన్నికల్లో పోటీ చేయకూడదంటూ నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అయితే నేను పోరాడటానికి, ప్రజలకు మంచి చేయడానికే ఎన్నికల బరిలోకి దిగాను. నేను వ్యవస్థలో కీలకంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాను. నేను ఒక యువ నాయకునిగా ఎదగాలనుకుంటున్నాను. మనకు దేవాలయాలు, మసీదుల కంటే పాఠశాల అవసరం ఎక్కువగా ఉంది.
నేను భగవద్గీగీతను చదవని హిందువులను, ఖురాన్ చదవని ముస్లింలను చాలా మందిని చూశాను. దీంతో వాస్తవానికి మతం అంటే ఏమిటో చాలామందికి తెలియదని అర్థం చేసుకున్నాను. ఎవరైనా ఈ గ్రంథాలను చదివినప్పుడు మతం అంటే ఏమిటో అర్థం చేసుకోగలుగుతారు. దేశంలో మత రాజకీయాలు చేయకూడదు. ఐక్యతతో కూడిన రాజకీయాలు అవసరం’ అని అజాజ్ ఖాన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment