టీఎంసీ మెగా ర్యాలీ.. ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్న మమతా బెనర్జీ

Mamata Banerjee To Announce 42 TMC Candidates At Kolkata Rally Today - Sakshi

తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి 'మమతా బెనర్జీ' పశ్చిమ బెంగాల్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మొత్తం 42 మంది అభ్యర్థుల పేర్లను నేడు ప్రకటించనుంది. కోల్‌కతాలోని బ్రిగేడ్ గ్రౌండ్‌లో జరగనున్న పార్టీ మెగా ర్యాలీ 'జన గర్జన్ సభ'లో అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. ఈ ర్యాలీకి పార్టీ ప్రధాన కార్యదర్శి 'అభిషేక్ బెనర్జీ' నాయకత్వం వహిస్తున్నారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 22 సీట్లు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 18 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ రెండు సీట్లు గెలుచుకుంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ 42 స్థానాలకు గాను 34 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాగా ఈ రోజు 42 సీట్లకు అభ్యర్థులను పార్టీ అధినేత అధికారికంగా ప్రకటించనున్నారు.

లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎన్నుకునేటప్పుడు అభ్యర్థుల పనితీరును పరిగణలోకి తీసుకోడంతో పాటు, కొత్త వారికి, ఎస్సీ, ఎస్టీ ఆదివాసీలు, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని సమాచారం. ఈ జాబితాలో పార్లమెంటు సభ్యులు (ఎంపీలు) సహా చాలా మంది పాత పేర్లు ఉండే అవకాశం ఉంది. ఈసారి కొంతమంది యువ నేతలను రంగంలోకి దింపాలని కూడా పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో చాలా మంది రాజకీయ నేతలు పార్టీలు మారుతున్న తరుణంలో 'జన గర్జన్ సభ' ర్యాలీకి దాదాపు ఆరు నుంచి ఎనిమిది లక్షల మంది మద్దతుదారులు హాజరవుతారని భావిస్తున్నారు. కాగా ఏప్రిల్-మేలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది.

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top