బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పార్టీకి 6 సీట్లు.. కానీ షరతు ఇదే!

BJP extended an offer of six seats to the NCP led by Ajit Pawar - Sakshi

ముంబై: మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ తమ సీట్ల షేరింగ్ ఒప్పందంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి ఆరు సీట్లను ఆఫర్‌ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి కాషాయ పార్టీ ఓ షరతు పెట్టినట్లు చెబుతున్నారు. 

రెండు స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను ఎన్‌సీపీ ఎన్నికల గుర్తు కింద, ఒక ఎన్‌సీపీ అభ్యర్థిని బీజేపీ గుర్తు కింద పోటీ చేయించాలని ప్రతిపాదించినట్లుగా హిందుస్థాన్ టైమ్స్ నివేదిక పేర్కొంది. ఈ పరిణామం ఎన్‌సీపీలో అసంతృప్తిని రేకెత్తించింది. దీంతో మహాయుతి కూటమిలో మరోసారి సీట్ల కేటాయింపుపై చర్చలు అపరిష్కృతంగా మారాయి.

కనీసం 9 సీట్లు కోరుతున్న పవార్‌
అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీసీ కనీసం తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయాలని భావించింది. దీంతో బీజేపీ పెట్టిన నిబంధనలను అంగీకరించడానికి ఆ పార్టీ నాయకత్వం వెనుకాడుతోంది. అందుకే అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని ఎన్‌సీపీ నేతలు పేర్కొంటున్నారు.

మహారాష్ట్రలో ఈసారి లోక్‌సభ ఎన్నికలు ఐదు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో జరగనున్నాయి. జూన్‌ 1న ఓట్ల లెక్కింపు జరగనుంది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top