కంగనాపై అసభ్య పోస్ట్‌.. సుప్రియాకు షాకిచ్చిన కాంగ్రెస్‌

congress Replaced Supriya Shrinate Remarks On Kangana Ranaut - Sakshi

న్యూఢిల్లీ: సినీ నటీ, హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌పై సోషల్‌ మీడియా వేదికగా చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేత సుప్రియా శ్రీనతే భారీ మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ బుధవారం విడుదల చేసిన లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాలో సుప్రీయా శ్రీనతేకు టికెట్‌ నిరాకరించింది. 

2019లో సుప్రీయా శ్రీనతే ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన విషయం తెలసిందే. అయితే ఈసారి కూడా మహారాజ్‌గంజ్‌ నుంచి తనకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కేటాయిస్తుందని సుప్రియా శ్రీనతే ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో సుప్రియా శ్రీనతేపై బీజేపీ అభ్యర్థి పంకజ్‌ చౌదరీ విజయం సాధించారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఈసారి మహారాజ్‌గంజ్‌లో వీరేంద్ర చౌదరీని బరిలోకి దింపింది.

సుప్రియా శ్రీనతే సోషల్‌ మీడియా ఖాతా నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్‌పై వెలువడిన అసభ్యకరమైన విమర్శలు కాస్త వివాదం రేపాయి. అయితే ఈ నేపథ్యంలో ఆమెకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈసారి తాను లోక్‌ ఎన్నికల్లో పోటీ చేయనని కాంగ్రెస్‌ పార్టీని కోరినట్లు తెలిపారు. అయితే తన స్థానంలో మరో అభ్యర్థి పేరును సూచించినట్లు సుప్రియా పేర్కొన్నారు.

కంగనాపై చేసిన అసభ్యకరమైన పోస్ట్‌పై.. సుప్రియా శ్రీనతే వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డులు పలువురికి తెలుసని తనకు తెలియకుండానే కంగనాపై అసభ్యకరమైన సోస్ట్‌ వేశారని తెలిపారు. ఈ పోస్ట్‌ తన దృష్టికి రావటంతో డిలీట్‌ చేశానని తెలిపారు.‘సుప్రియాపేరడీ’ అనే ‘ఎక్స్‌’ అకౌంట్‌ నుంచి పోస్ట్‌ చేశారని.. దాని నిర్వాకులు ఎవరో తెలియదన్నారు. తన ‘ఎక్స్‌’ఖాతా హ్యాక్‌ అయిందని తెలిపారు.

అప్పటికే  ఆమె పోస్ట్‌ వివాదస్పదం కాగా.. బీజేపీ నేతలు ఆమెపై మండిపడ్డారు. ఇలా మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతేకు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. మార్చి 29 సాయంత్రం 5 గంటలోపు స్పందించాలని కోరింది. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల కోడ్)ని ఉల్లంఘించినట్లు పోల్ ప్యానెల్ తెలిపింది. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలియజేయాలని ఈసీ ఆదేశించింది.

Election 2024

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top