అమెరికన్ల వాలెట్లు తెరుచుకున్నాయ్..
నెమ్మదస్తుగా ఉన్న శీతాకాల అనంతరం అమెరికన్ ఆర్థికవ్యవస్థ పుంజుకుంది. ఏప్రిల్ నెలలో అమెరికన్ వినియోగదారుల ఖర్చులు పెరిగాయి. మార్చి నెల కంటే ఏప్రిల్ నెలలో అమెరికన్ల ఖర్చు 1శాతం పెరిగాయని వాణిజ్య విభాగ డేటాలో తేలింది. వినియోగదారుల వ్యయాలు పెరగడం 2009 ఆగస్ఠు తర్వాత ఇదే మొదటిసారని గణాంకాలు పేర్కొన్నాయి. ఈ పెరుగుదల అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి బయటపడి, వినియోగదారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందనే సంకేతాలను అందిస్తోంది. రిటైల్ అమ్మకాలు పెరిగాయనే గణాంకాలు వెల్లడైన కొన్ని వారాల్లోనే వినియోగదారుల వ్యయ సూచి పెరగడం విశేషం.
రిఫ్రిజిరేటర్లు, రూఫ్స్, కార్లు, డెలివిజన్లు వంటి భారీ ఉత్పత్తుల కొనుగోలు ఎక్కువగా నమోదైనట్టు గణాంకాలు తెలిపాయి. అమెరికన్ వినియోగదారులు ప్రస్తుతం ఆత్మవిశ్వాసంతో వారి వాలెట్లను తెరుస్తున్నారని పేర్కొంది. రెండో త్రైమాసిక ఆర్థిక వృద్ధికి ఈ వ్యయాలు పెరగడం ఎక్కువ ప్రయోజనం కల్పించబోతుందని హై ఫ్రీక్వెన్సీ ఎకనామిక్స్ రీసెర్చ్ సంస్థ చీఫ్ అమెరికన్ ఆర్థిక వేత్త జిమ్ ఓ సులీవాన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. అదేవిధంగా మిచిగాన్ యూనివర్సిటీ వినియోగ వ్యయ ఇండెక్స్ సైతం పెరిగింది. ఏప్రిల్ లో 89శాతంగా ఉన్న ఈ ఇండెక్స్ మే నెలలో 95శాతంగా నమోదైంది.
ఖరీదైన వస్తువుల కొనుగోళ్లలో కార్లు ఎక్కువ మొత్తంలో వాటాను నమోదుచేశాయని వాణిజ్య విభాగం గణాంకాలు తెలిపాయి. సెడాన్లు, మినీ వ్యాన్లను అమెరికన్ కారు డీలర్స్ రికార్డు స్థాయిలో అమ్మారని గణాంకాలు పేర్కొన్నాయి. జనవరి, ఫిబ్రవరి లో ఓ మోస్తారుగా నమోదైన ఆటో అమ్మకాలు, మార్చి నెలలో పడిపోయి, మళ్లీ ఏప్రిల్ నెలలో పుంజుకున్నాయని గణాంకాలు వెల్లడించాయి. కేవలం కార్లు మాత్రమే కాకుండా గృహోపకరణాలు డిష్ వాషర్స్, డ్రైయర్స్, స్టవ్ లు ఇటీవల ఎక్కువ మొత్తంలో విక్రయాలు నమోదై, అధికమొత్తంలో రాబడులు సాధించాయని గణాంకాలు తెలిపాయి. అధికమొత్తంలో వినియోగదారుల వ్యయాలు పెరగడం, వృద్ధి అంచనాలపై ఆర్థికవేత్తల్లో ఆశాభావాన్ని నింపడానికి, ఏప్రిల్, జూన్ లో వృద్ధి అంచనాలు పెరగడానికి దోహదంచేస్తున్నాయని అమెరికన్ ఎకానమీ సూచిస్తోంది.