విమానాలను నడుపుతున్న తీరు బాధాకరం
విశాఖపట్నం: దేశంలో విమానాలను నడుపుతున్న తీరు బాధాకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏఎన్-32 విమానం అదృశ్యంకావడం విచారకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ విమానంలో ప్రయాణిస్తూ గల్లంతయిన ఆరుగురి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సోమవారం మాధవధార కళింగనగర్లో వరప్రసాద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు.
అంతకుముందు భూపేంద్రసింగ్ కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. విశాఖ మర్రిపాలెంలోని 104 ఏరియాలోని ఆయన నివాసానికి విచ్చేసిన వైఎస్ జగన్ ...ఘటనపై కుటుంబసభ్యుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూపేంద్రసింగ్ కుమారుడితో వైఎస్ జగన్ మాట్లాడి, ధైర్యం చెప్పారు. విమానం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అధైర్యపడవద్దని సూచించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆచూకీ మిస్ అయినప్పుడు తాము కూడా చాలా టెన్షన్ పడ్డామని, ఆరోజు ఎంతో కష్టం అనుభవించామని, ఆ కష్టం తనకు తెలుసని వారితో చెప్పారు. ఇప్పుడు గల్లంతైన భారత వాయుసేన విమానం ఆచూకీని గుర్తించేందుకు గాలింపు చర్యలను ముమ్మరం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతామన్నారు.
కాగా అదృశ్యమైన ఏఎన్-32 విమానంలో భూపేంద్రసింగ్ ఎగ్జామినర్ కూడా ఉన్నారు. ఆయనకు భార్య సంగీత, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరి స్వస్థలం ఉత్తరప్రదేశ్. భూపేంద్ర సింగ్ ఆర్మీలో కూడా పనిచేశారు. ప్రమాదం జరిగి నాలుగు రోజులు అయినా తమవారి జాడ తెలీకపోవడంతో కుటుంబసభ్యులు తల్లడిల్లుతున్నారు.
కాగా ఎన్‌ఏడీ నుంచి ఈ నెల 20వ తేదీన ఎనిమిది మంది ఉద్యోగులు బయలుదేరి వెళ్లారు. 21వ తేదీ ఉదయం 8 గంటలకు చెన్నై చేరుకున్నారు. ఇండియన్ నేవల్ షిప్ (ఐఎన్‌ఎస్) బట్టిమాల్వ్‌లో సీఆర్‌ఎన్-91 అనే ఆయుధంలో తలెత్తిన సమస్యను పరిష్కరించడానికి తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్‌కు ఐఏఎఫ్ విమానం ఏఎన్ 32 ఈ నెల 22వ తేదీ ఉదయం 8.30కి బయలుదేరింది. 8.46 గంట లకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
అనంతరం విమానం అదృశ్యమైనట్లు వైమానిక దళ అధికారులు ప్రకటించారు. విమానంలో 29 మంది ఉండగా వారిలో విశాఖపట్నంలోని నేవల్ ఆర్మమెంట్ డిపో (ఎన్‌ఏడీ)కి చెందిన ఎనిమిది మంది సిబ్బంది ఉన్నారని అధికారులు నిర్ధారించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.