నా నలభై ఏడో ఏటచెంప ఛెళ్లుమనిపించారు! | Allu Aravind special interview | Sakshi
Sakshi News home page

నా నలభై ఏడో ఏటచెంప ఛెళ్లుమనిపించారు!

Published Wed, Jul 30 2014 10:41 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

Allu Aravind special interview

అల్లు రామలింగయ్య... ఆ పేరు తలచుకోగానే... ఎన్నో పాత్రలు... మరెన్నో సినిమాలు కళ్ళ ముందు గిర్రున రీళ్ళు తిరుగుతాయి. ఆ నాటి ‘మాయాబజార్’ నుంచి ఆ మధ్య వచ్చిన ‘జై’ దాకా...  అల్లు... తెలుగుతెరపై నవ్వుల విరిజల్లు. ‘ముత్యాల ముగ్గు’, ‘శంకరాభరణం’, ‘సప్తపది’... ఇలా ప్రతి సినిమాలో ఆయన పాత్ర ఓ కొలికిపూస. మరి, నిజజీవితంలో ఆయన ఎలా ఉండేవారు? పిల్లలతో ఎలా మెలిగేవారు? వారికి ఆయన నేర్పిన పాఠాలేమిటి? నటుడిగా ఆయన ఫిలాసఫీ ఏమిటి? ఇవాళ అల్లు రామలింగయ్య పదో వర్ధంతి సందర్భంగా... తండ్రిగా, నటుడిగా, హోమియో డాక్టర్‌గా... అంతకుమించి మంచి మనిషిగా అల్లులోని అనేక కోణాలపై ఆయన కుమారుడు, ప్రసిద్ధ నిర్మాత అల్లు అరవింద్ ఫోకస్ లైట్...
 
మా నాన్న అల్లు రామలింగయ్య గారు మన కళ్ళెదుట భౌతికంగా లేరన్న మాటే కానీ, ఇవాళ్టికీ కనీసం అయిదారు సార్లయినా తలుచుకోనిదే, ఏదో ఒక సందర్భంలో ఆయనను గుర్తు తెచ్చుకోనిదే నాకు రోజు గడవదు. నిజానికి ఆయన భౌతికంగా లేని ఈ పదేళ్ళలో నేను ఆయనను మిస్ అయిన క్షణం లేదు. ప్రతి విషయంలో ఆయన నా వెంటే ఉన్నారని నా భావన. అందుకే, ‘గీతా ఆర్ట్స్’ పతాకంపై మేము నిర్మిస్తున్న సినిమాలన్నిటికీ ఇప్పటికీ ‘అల్లు రామలింగయ్య సమర్పించు’ అని టైటిల్స్‌లో వేస్తుంటా.
 
జీవించడం నేర్పిన గురువు

నాకు వ్యక్తిగతంగా ఎవరూ గురువులు లేరు. కానీ, గురుపూర్ణిమ వచ్చిందంటే నేను ఇద్దరినే తలుచుకుంటూ ఉంటా. ఆ ఇద్దరూ ఎవరంటే - ఒకరు మా నాన్న గారు. రెండో వ్యక్తి - మా కుటుంబానికి సన్నిహితులు, సలహాదారైన నిర్మాత డి.వి.ఎస్. రాజు గారు. నా వ్యక్తిగత, సినిమా జీవితం మీద నాన్న గారు వేసిన ప్రభావం అంతటిది. నా దస్తూరీ ఇవాళ్టికీ చాలా బాగుంటుంది. దానికి కారణం మా నాన్న గారే! నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలని తెలుగు, ఇంగ్లీషు కాపీ రైటింగ్ పుస్తకాలు తెచ్చి రోజూ నాలుగేసి పేజీల చొప్పున రాసి, చూపించమనేవారు. ఇలా ప్రతి చిన్న విషయంలో ఆయన గెడైన్‌‌స, ఇచ్చిన శిక్షణ నన్నివాళ ఇలా తీర్చిదిద్దాయి.
 
తండ్రిగా ఆయనది ఓ ప్రత్యేక పద్ధతి. ఆడపిల్లల పెంపకంలో సగటు మధ్యతరగతివాడిగా స్ట్రిక్ట్‌గా ఉండేవారు. అదే సమయంలో పిల్లలకు జీవితం నేర్పాలనే ఉద్దేశంతో పధ్నాలుగు, పదిహేనేళ్ళ వయసు వచ్చినప్పటి నుంచి నన్ను ఓ కొడుకులా కాకుండా, స్నేహితుడిలా చూశారు. పదహారేళ్ళ వయసు నుంచే నన్ను చివరకు ఆడిటర్ దగ్గరకు కూడా తీసుకువెళ్ళేవారు. అలాగే, కుటుంబ రాబడి, ఖర్చు, ఆదా, ఎక్కడ ఎలా మదుపు చేయాలనే విషయాల్లోనూ నన్ను ఇన్‌వాల్వ్ చేసేవారు. అప్పట్లో ‘అవేవీ తెలియక, ఇదేమిట్రా బాబూ.. మనకెందుకీ గొడవ’ అనుకొనేవాణ్ణి. కానీ, ఇవాళ మా కుటుంబంలో కానీ, చిరంజీవి గారి కుటుంబంలో కానీ ఎవరికీ పన్ను బకాయిలు, ట్యాక్స్ సమస్యలు ఏమీ లేకుండా ఉన్నాయంటే, ఆర్థిక అంశాలన్నీ జాగ్రత్తగా దగ్గరుండి చూసుకోగలుగుతున్నానంటే దానికి కారణం ఆ ట్రైనింగే! అలాగే, మా చెల్లెళ్ళ పెళ్ళి సంబంధాల దగ్గర నుంచి అన్ని విషయాలూ చిన్నవాడినైన నాతో ఆయన చర్చించేవారు. (నవ్వుతూ...) అలా చిన్నప్పుడే నాకు పెద్దరికం వచ్చేలా చేశారు. అందుకే, ఇవాళ్టికీ మా సిస్టర్స్‌కు నేను అన్నలా కాక, నాన్న గారి తరువాత నాన్న గారిలా కనబడుతుంటాను.  చిన్నప్పటి నుంచి ఆయన నన్ను కూర్చోబెట్టి ఎన్నో చెప్పేవారు. వస్తుతః లోలోపల నేను కొంత దూకుడు! అలాంటి నేనివాళ ఎప్పుడూ తొందరపడి మాట్లాడను. ఎవరి మీదా నోరు పారేసుకోను. అది కూడా నాన్న గారి చలవే. ‘పెదవి దాటిన మాట - తనకు రాజు. కానీ, పెదవి దాటని మాటకు తానే రాజు’ అని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నాన్న గారు చెప్పిన సామెత నా మీద ముద్ర వేసింది.
 
అరుదైన హస్తవాసి
 
మా నాన్నగారు వాళ్ళు అయిదుగురు అన్నదమ్ములు. వాళ్ళలో మూడో ఆయన మా నాన్న గారు. సినిమాల్లో వేషాల కోసం పాలకొల్లు నుంచి మద్రాసు వచ్చినప్పుడు ఆయన కష్టాలు పడిన తొలి రోజులు నాకు గుర్తే. సంపాదన లేక, సరిపోక ఊళ్ళోని మా పెదనాన్న గారి దగ్గర నుంచి డబ్బులు తెప్పించుకొని, ఇల్లు గడిపిన సంగతులు నాకు తెలుసు. నటుడిగా పేరు, డబ్బు సంపాదించినా ఆ రోజుల్ని ఆయన మర్చిపోలేదు. కమ్యూనిస్టు భావాలున్న ఆయనలో మానవత్వం ఎక్కువ. సినిమాల్లోకి రాక ముందు హోమియోపతి వైద్యం ఆయన వృత్తి. ఆయన హస్తవాసి మంచిదని ఎంతోమందికి నమ్మకం. సినిమాల్లో స్థిరపడ్డాక అందరికీ ఉచితంగా మందులిస్తూ, హాబీగా కొనసాగించారు. ఎన్టీఆర్‌కి ఫ్రాక్చరైతే, ఏయన్నార్ గారి కాలులో చిన్న ఇబ్బంది వస్తే నాన్న గారు హోమియో వైద్యం చేశారు. ఎన్టీయార్ గారి భార్య బసవ తారకం గారికి నాన్న గారు నమ్మకమైన ఫ్యామిలీ డాక్టర్. (నవ్వుతూ...) నన్ను కూడా హోమియోపతి నేర్చుకోమనేవారు. కానీ, అది నాకు ఎక్కలేదు. ఆయన సేకరించి, చదువుకొన్న ఎన్నో హోమియోపతి పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. ఆయన గుర్తుగా వాటిని భద్రంగా దాచాం.
 
ఆయన కోరిక తీరింది...         
 
మా ఇంట్లో మేము అయిదుగురం. మా అక్క నవభారతి. నేను, మా చెల్లెళ్ళు వసంతలక్ష్మి (డాక్టర్ వెంకటేశ్వరరావు గారి భార్య), సురేఖ (చిరంజీవి గారి భార్య), చనిపోయిన మా తమ్ముడు వెంకటేశ్. మా తమ్ముడిలో మంచి ఫీచర్లున్నాయని, వాణ్ణి సినీ నటుణ్ణి చేయాలని నాన్న గారికి ఉండేది. కానీ, అనుకోకుండా జరిగిన రైలు ప్రమాదంలో వాడు చనిపోయాడు. మా అబ్బాయి బన్నీ (అల్లు అర్జున్) స్టారవడంతో మా తమ్ముడు వెంకటేశ్‌కు రావాల్సినదంతా బన్నీకొచ్చిందనీ, నటుడిగా తన వారసత్వం కొనసాగాలన్న కోరిక తీరిందనీ సంతోషించారు.
 
వృత్తికి అడ్డు కాని వ్యక్తిగత విషాదం
 
మా తమ్ముడు చనిపోయినప్పుడు నాన్న గారు ఎంతో బాధపడ్డప్పటికీ, తన పర్సనల్ ఫిలాసఫీ ద్వారా దృఢంగా నిలబడ్డారు. వాడు చనిపోయిన నాలుగో రోజునో, అయిదో రోజునో ఆయనకు షూటింగ్ ఉంది. అది బాపు గారి సినిమా అనుకుంటా. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామా అని వాళ్ళు అడిగారు. కానీ, అదేమీ వద్దని, మనసును రాయి చేసుకొని షూటింగ్‌కు వెళ్ళిపోయారు నాన్న గారు. అక్కడ సన్నివేశం కూడా విషాద సన్నివేశం. గ్లిజరిన్ ఇస్తామన్నారట. కానీ, నాన్న గారు అక్కర్లేదని, గ్లిజరిన్ లేకుండానే ఆ సన్నివేశంలో కన్నీళ్ళు పెట్టుకొని, ఆ సన్నివేశం పండించారు. వ్యక్తిగత విషాదాన్ని పక్కనపెట్టి, వృత్తి పట్ల నిబద్ధత చూపే ఆయన ‘దృఢ వ్యక్తిత్వాని’కి ఇదో ఉదాహరణ.
 
తీపి జ్ఞాపకం... తరగని ఆస్తి...     
 
వ్యక్తిగా ఆయనలో నచ్చే అతి గొప్ప విషయం ఏమిటంటే, ఆయన చాలా ప్రజాస్వామికంగా ఉండడం, అందరికీ స్వేచ్ఛనివ్వడం. అయితే, పట్టరాని కోపం వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక తండ్రిగా నన్ను తిట్టేవారు, కొట్టేవారు కూడా! ఆయనతో నాకు ఓ చిత్రమైన తీపి జ్ఞాపకం ఉంది. ఆయన నన్ను ఆఖరు సారిగా కొట్టింది ఎప్పుడో తెలుసా? నా 47వ ఏట! ఒకరోజు నేను కారు నడుపుతుంటే, ఆయన పక్కన కూర్చొని ఉన్నారు. ఇంటి లోపలకు కారుతో అడుగు పెడుతున్నప్పుడు నేను అనుకోకుండా సడెన్ బ్రేక్ వేశాను. సీట్ బెల్టులు లేని ఆ రోజుల్లో ఆయన తల వెళ్ళి, ముందుకు కొట్టుకుంది. అంతే... ఒక్కసారిగా కోపం వచ్చి, ‘ఎవడ్రా నీకు డ్రైవింగ్ నేర్పింది’ అంటూ చెంప ఛెళ్ళుమనిపించారు. కొంపతీసి ఇది మా ఆవిడ కానీ చూసిందేమో అని టెన్షన్ పడ్డా. బాల్కనీ వైపు చూస్తే మా ఆవిడ కనపడలేదు. హమ్మయ్య చూడలేదనుకున్నా. తీరా, ఇంట్లోకి వెళ్ళాక ఎందుకు కొట్టారంటూ అడిగేసరికి గతుక్కుమన్నా. (నవ్వులు...) ఆ క్షణం కొద్దిగా ఇబ్బంది అనిపించినా, ఇప్పుడు తలుచుకుంటే అది మా నాన్న గారు నాకిచ్చిన అత్యంత తీపి జ్ఞాపకం అనిపిస్తుంటుంది. నాకు ఎంత వయసు వచ్చినా, ఎంత ఎత్తుకు ఎదిగినా నన్ను ఓ చిన్న పిల్లాడిగా, తండ్రి మీద గౌరవమున్న కొడుకుగానే చూసిన ఓ తండ్రి తాలూకు ప్రేమ, క్రమశిక్షణ అది.
 
నటుడిగా నాన్న గారు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించారు. నాన్న గారికి ‘పద్మశ్రీ’ వచ్చినప్పుడు నేను ‘ప్రతిబంధ్’ షూటింగ్‌లో హైదరాబాద్‌లో ఉన్నా. విషయం తెలిసి, మద్రాసులో ఇంటికి ఫోన్ చేశా. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా, ‘నాన్న గారూ! ఇన్నాళ్ళూ మీరు మాకిచ్చిన ఆస్తులైన ఇళ్ళు, పొలాలు, డబ్బు అమ్ముకోవచ్చు. కానీ, ఎప్పటికీ అమ్మలేని ఆస్తిగా ‘పద్మశ్రీ’ గౌరవాన్ని మాకు ఇచ్చారు’ అన్నాను. ఆ మాటకు ఆయన ఎంత ఆనందించారో!
 
చెరిగిపోని నవ్వు... చెదిరిపోని నువ్వు...
 
అప్పటికప్పుడు అక్కడికక్కడ ఛలోక్తులు విసరడం ఆయనకు అలవాటు. ఒకసారి ఆయన కాలికి చిన్న దెబ్బ తగిలి, బెణికింది. దానికి చిన్న బ్యాండేజ్ కట్టారు. ఆ రోజున నాతో పాటు మా ఇంటికి వచ్చిన నా ఫ్రెండ్ శ్రీనివాసరావు అది చూస్తూనే, ‘ఏమిటి సార్... ఆ కట్టు...’ అంటూ గావుకేక పెట్టాడు. అంతే. ‘ఏనుగు తొక్కిందిలే’ అన్నారు నాన్న గారు. (నవ్వులు) అదేమిటంటూ విస్తుపోవడం మా ఫ్రెండ్ వంతు అయింది. అప్పుడు మా నాన్న గారు, ‘నువ్వు అంతగా రియాక్ట్ అయినప్పుడు, ‘ఏదో కాలు కొద్దిగా బెణికిందిలే’ అని చెబితే డిజప్పాయింట్ అవుతావు.

అందుకని, ఏనుగు తొక్కిందని చెప్పా’ అని నవ్వించారు. అలాగే, చనిపోవడానికి ఆరు నెలల ముందు హైదరాబాద్ కె.బి.ఆర్. పార్క్‌కు వెళ్ళారాయన. అక్కడ ఆయన కూర్చొని ఉంటే, తెలిసినవాళ్ళు ఎదురై పలకరించి, ‘వాకింగ్‌కు వచ్చారా’ అని అడిగారు. దానికి నాన్న గారు ‘అవునండీ! కానీ, నేను పెద్దోణ్ణి. నడవలేను కదా! అందుకే, కుర్రాణ్ణి పెట్టా. వాడు నడుస్తున్నాడు’ అని చటుక్కున బదులిచ్చారు (నవ్వులు...)  సినిమాలు, నటన, ఇలాంటి ఛలోక్తులు చూసి చాలామంది ఆయన వట్టి హాస్యజీవి అనుకుంటారు.

కానీ, జీవితంలో ఆయన చాలా సీరియస్ మనిషి. ఫిలసాఫికల్ థింకర్. ఆయనకు వివేకానంద స్వామి, రామకృష్ణ పరమహంస అంటే మహా ఇష్టం. వాళ్ళ పుస్తకాలెన్నో ఆయన చదివేవారు. అలాగే, వేస్తున్న వేషం తనకు లొంగే వరకు నటుడిగా ఆయన తృప్తిపడేవారు కాదు. వేస్తున్నది కమెడియన్ పాత్ర అయినా సరే, పూర్తి కథ, సన్నివేశం పూర్వాపరాలు తెలుసుకొని, పాత్రను అవగాహన చేసుకొనేవారు. అలా పాత్రను మనసుకు ఎక్కించుకొనేవరకు దర్శకులనూ, కో-డెరైక్టర్‌నీ వివరాలు అడుగుతూనే ఉండేవారు. ఒక్కసారి ఆ పాత్రను లొంగదీసుకున్న తరువాత అద్భుతంగా నటించేవారు.

అందుకే, ఆయన నటన అంత సహజంగా ఉండేది. చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ - ఇలా ఏ భాషలో చూసినా హాస్యం పండించగలిగినవారే పెద్ద హీరోలయ్యారు. ఉన్నత స్థాయికి వెళ్ళారు. అందుకే, నా దృష్టిలో హీరోయిజమ్ అంటే హాస్యమే. అలాంటి హాస్యాన్ని ప్రాణానికి ప్రాణంగా భావించి, తెరపై నవ్వులు విరబూయించిన నాన్న గారి లాంటి వారందరూ నా దృష్టిలో చిరకాలం గుర్తుండే హీరోలు.  
 
సంభాషణ: రెంటాల జయదేవ
 
దర్శకులు కె.విశ్వనాథ్, బాపు అంటే నాన్న గారికి ఎంతో గౌరవం. దాసరి, రాఘవేంద్రరావులంటే మహా ఇష్టం. అలాంటి దర్శకుల చిత్రాల్లో నటించాలని ఆయన తపించేవారు. ముఖ్యంగా, విశ్వనాథ్, బాపుల చిత్రాల్లో తాను తప్పకుండా ఉండాలనుకొనేవారు. తనకు పాత్ర ఉండదేమోనని తెగ బెంగపడేవారు. వాళ్ళ సినిమాలంటే, ఇక పారితోషికం, ఇతర విషయాలేవీ పట్టించుకొనేవారు కూడా కాదు. చివరి దాకా అదే పాటించారు. అలాంటి పాత్రలెన్నో పోషించబట్టే, కన్నుమూసి ఇప్పటికి పదేళ్ళయినా ఆయన చిరంజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో మిగిలారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement