ఒక కరువు.... మూడు కథలు....
స్థలకాలాలూ సరే.స్పందనంటూ ఒకటుంటుంది కదా. దాని సంగతేంటి?
ఒకటేదో చూస్తాం. మనసుకు రాపిడి కలుగుతుంది. ఒకటేదో వింటాం. హృదయం కళవళ పడుతుంది. ఎండ- ఒకోసారి నిలువెల్లా తడిపేస్తుంది. వాన- అణువణువూ మండించేస్తుంది. అప్పుడిక కలం అందుకోవడమే శరణ్యం. ఊరికే ఉండలేక, లోపల అదిమిపెట్టుకోలేక అనిపించింది చెప్పడమే శరణ్యం. దానికి స్థలం లేదు, కాలం లేదు, భాషా లేదు. స్పందన ఒకటే శరణ్యం.
మలయాళ కథ గుర్తుకొస్తోంది. దాని పేరు ‘పోతిచోరు’. అంటే ‘అన్నం పొట్లం’అని అర్థం. మంచి కరువు కాలం. అనేక కాలాలుగా పిడికెడు మెతుకులు కూడా దొరకని కాలం. అలాంటి కాలంలో ఒక మధ్యాహ్నం ఒక స్కూల్లో ఒక పిల్లవాడి అన్నం పొట్లం మాయమయ్యింది. ఎవరు తిన్నట్టు? అన్నం పొట్లం అంటే సామాన్యమా? మెతుకు మెతుకూ బంగారమే. ఆ పిల్లవాడు ప్రధానోపాధ్యాయుడికి కంప్లయింట్ చేశాడు. విచారణ జరిగింది. ఎవరూ దొరక లేదు. ఆ దొంగనో ఈ దొంగనో అయితే పట్టుకోవచ్చుగాని అన్నం దొంగను ఎవరు పట్టుకుంటారు? ప్రధానోపాధ్యాయుడు ఏదో సర్దుబాటు చేశాడు. కాని మరునాటికి ఆయన టేబుల్ మీద ఒక లేఖ ఉంది. దానిని దొంగ రాశాడు. అన్నం పొట్లాన్ని దొంగిలించిన దొంగ. అయ్యా... మరేం చేయమంటారు. కడుపు నిండా తిని చాలా కాలం అయ్యింది. అసలు అన్నం తినే చాలా కాలం అయ్యింది. చేస్తున్న పని అన్నం పెట్టడం లేదు. జీతాలు సక్రమంగా అందడం లేదు. ఏం చేయమంటారు? కళ్లు తిరిగి, శోష వస్తుంటే ఎంత ఏడుపూ గుప్పెడు మెతుకులకు సమానం కాదు కదా అని గతిలేక దొంగతనం చేశాను. దీనికి నేను పైలోకాల్లో సమాధానం చెప్పుకోవాలి. ఇప్పటికి స్థిమితం కోసం మీతో చెప్పుకుంటున్నాను.... హెడ్మాస్టర్ కింద పేరు కోసం చూశాడు. ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. అక్కడ ఇలా ఉంది: ఇట్లు, మీ రెండో తరగతి ఉపాధ్యాయుడు! ఈ కథను రాసింది కరూర్ నీలకంఠ పిళ్లై. కేరళలో రచయితల సహకార సమాఖ్యకి ఊపిరిపోసిన వ్యవస్థాపకుడు. స్కూల్ టీచర్. గొప్ప రచయిత. 1950లనాటి కరువుని ఒక బడిపంతులి కోణం నుంచి రాసిన ఈ కథ కేరళను ఊపేసింది.
ఇంకో కథ గుర్తుకొస్తోంది. తమిళ కథ. పేరు ‘ఎస్తర్’. ఆ పల్లెలో అదొక పెద్ద ఇల్లు. ఆ ఇంటిలో చాలామంది. అప్పటికి చాలా రోజులుగా కరువు. ఎండకు అంతులేదు. రాత్రి చల్లదనం ఎరగదు. గొడ్డూ గోదా ఇళ్ల దగ్గర గడ్డిపోచక్కూడా నోచుకోక అడవి దారి పట్టి అక్కడా ఏమీ దొరక్క గుడ్లు తేలేస్తున్నాయి. నీళ్లు లేవు. పసిపిల్లలు తినడానికి రాగి పిండి కూడా మిగలడం లేదు. ఈ కరువు ఇప్పుడల్లా పోదా? వేచి చూశారు. వేచి చూశారు. వేచి చూశారు. కదలదే. కడుపులు ఎండిపోతున్నాయి. మనుషులు ఎండిపోతున్నారు. ఇక లాభం లేదు. మధురైకు వెళ్లి కూలో నాలో చేసుకు బతకాల్సిందే. ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం. కాని ఇప్పుడు? తప్పదు. అయితే ఇంట్లో ఒక ముసలావిడ ఉంది. మంచాన పడి ఉంది. చావు కోసం ఎదురు చూస్తూ ఉంది. చావు రాదు. ఈ పాడుకాలంలో కరువుకాలంలో ఆమెను మోసుకొని ఎక్కడికని వెళ్లడం? ఆమెను వదిలి వెళ్లడానికే నిశ్చయమైంది. ఆమె కూతురు ఎస్తర్- కుటుంబ పెద్ద- నలిగిపోతూ ఉంది. ఒకటి రెండు రోజుల్లో ప్రయాణం. ముసలామె మరణించింది. అమ్మయ్య. కరువు రోజుల్లో ఏవో అంత్యక్రియలు అయ్యాయంటే అయ్యాయనిపించారు. ఆ తర్వాత ఆ కుటుంబం వలసకు బయలుదేరింది. కాని... కాని.... ఎస్తర్‌కు ముసలామె గుర్తుకొస్తూనే ఉంది. ముఖ్యంగా ఆమె కళ్లు. పైకప్పును చూస్తున్న, తడిదేరినట్టున్న ఆ కళ్లు ఆమెను చాలాకాలం వెంటాడిస్తున్నట్టు అనిపించింది. చాలా రోజుల వరకూ వాటినామె మర్చిపోలేకపోయింది. కథ ముగిసింది. అంటే? ఒక నిమిషం మనకు వెలగదు. వెలిగాక ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎస్తర్ ఆ ముసలామెను చంపేసింది. ఆ ముసలామె తన కన్నకూతురి వైపు నిస్సహాయంగా చూస్తూ ఉండగా కొనఊపిరితో ఉన్న ఆమె ప్రాణాన్ని తీసేసింది! తప్పదు. కరువు. మనం మిగలాలి కదా. ప్రసిద్ధ తమిళ రచయిత వణ్ణ నిలవన్ రాసిన కథ ఇది. కరువు విశ్వరూపాన్ని చూపిన కథ.
ఇంకో కథ కూడా గుర్తుకు వస్తోందే. తెలుగు కథ. ‘సావు కూడు’. అసలే అనంతపురం. ఆపైన కరువుకాలం. ముసలాడు టపీమన్నాడు. అప్పటికే ఊళ్లో అందరికీ పంచెలు మాసిపోయి ఉన్నాయి. గడ్డాలు పెరిగిపోయి ఉన్నాయి. ఇళ్లల్లో ఆడాళ్లు నూరడానికి నాలుగు మిరపకాయలు కూడా లేక కారాలు మిరియాలు నూరుతున్నారు. కాని కర్మంతరం చేయక తప్పదు కదా. అక్కడకు తిరిగి ఇక్కడకు తిరిగి కుంటిదో గుడ్డిదో ముసలిదో ఏదో ఒక గొర్రెను పట్టుకొచ్చారు. కోశారు. ఏళ్ల తర్వాత ఒండినట్టుగా అదే మహాభాగ్యం అన్నట్టుగా మసాలా వేసి కూర వండారు. వేటకూర తిని ఎన్నాళ్లయ్యింది? కరువొచ్చినవాడికి తెలుస్తుంది ఆ భాగ్యం. అందరూ బిలబిలమని వచ్చారు. పీకల మొయ్యా తిన్నారు. తృప్తిగా ఆకువక్క నములుతున్నారు. కాని సరిగ్గా ఆ సమయంలోనే లోపలి నుంచి ముసలిదాని ఏడుపు మొదలయ్యింది. బొరోమని ఒకటే ఏడుపు. ముసలాడి మీద భ్రమ చావక ముసల్ది ఎంత ఏడుస్తుందమ్మా అని అమ్మలక్కలు బుగ్గలు నొక్కుకున్నారు. ఊరుకోబెట్టడానికి చూశారు. ఊరుకుంటేనా? ఇంకా ఏడవడమే. ఏమైందే ముసలిదానా... ఎందుకట్టా ఏడ్చి సస్తున్నావ్ నువ్వేడిస్తే పోయినోడు తిరిగొస్తాడా అని కొడుకు కొట్టడానికి వచ్చాడు. కాని ముసలాడి కోసమా ముసల్దాని ఏడుపు? కాదు. ముసల్ది ఏమందో తెలుసునా? మూడు నూర్లు పెట్టి గొర్రె తెస్తిరి. ఊరందరి కోసం కూర చేస్తిరి. ఎవరెవరికో పుట్టిన నా కొడుకులంతా గొంతు వరకూ తిని పాయిరి. నా ఇస్తరాకులో మాత్రం నాలుగు తునకలు కూడా ఎయ్యకపాతిరి... కూరంతా అయిపోయి బొమికలు మిగిలెను గదరా ముండనా కొడకల్లారా అని ఒకటే శోకం. ఎంత విషాదం ఇది. చావును అధిగమించిన ఆకలి విషాదం. బండి నారాయణస్వామి రాసిన ఈ కథ కరువు ఉన్నంత కాలం ఉంటుంది. కరువు మాయమయ్యేంత వరకూ ఉంటుంది.
ఒక కరువు. మూడు ప్రాంతాలు. ముగ్గురు రచయితలు. ఒకే స్పందన. తాకలేదు మనల్ని? కదిలించలేదూ?
అదిగో అలా కదిలించడం కొరకే నిద్రాహారాలు మాని ఆత్మనూ దేహాన్ని కోతకు గురి చేసి కథలు రాస్తుంటారు చాలా మంది. స్పందనగా చిన్న కరచాలనం దొరికితే చిర్నవ్వుతో మరో కథ వైపు నడుస్తుంటారు చాలామంది.
- ఖదీర్