హారుకి మురకామి
‘1 క్యూ 84’. జపాన్ కవిత్వమైనా కొద్దిగా చదివాను గానీ వర్తమాన జపాన్ నవలలతో అసలు పరిచయం లేదు. పది రోజుల క్రితం నాకు మంచి స్నేహితుడు, అంతర్జాతీయంగా సినిమాటోగ్రఫీలో ప్రసిద్ధుడు అయిన మధు అంబట్... హారుకి మురకామి గురించి చెప్పాడు. మధు సాహిత్యాభిరుచి తెలుసు. అందుకని వెంటనే హారుకి 2011లో రాసిన ‘1 క్యూ 84’ చూడాలనిపించింది.
తీరా పుస్తకం ‘ఫ్లిప్‌కార్ట్’లో వచ్చాక చూస్తే 1,318 పేజీలుంది. సాహసంతో మొదలుపెట్టాను రెండు రోజుల క్రితం, రోజుకి వంద పేజీలైతే 13 రోజుల్లో పూర్తవుతుందిలే అనే ధీమాతో! మూడు వందల పేజీలు చదివాను. రచన సరళంగా, సూటిగా అదే సమయంలో సాంద్రంగా ఉంది. ప్రతి చిన్న వివరమూ రాస్తున్నాడు. అలా రాయటం పేజీలు నింపటానికి కాకుండా పాత్ర పోషణకు ఉపయోగపడుతున్నదని క్రమంగా తెలిసివస్తోంది.
మూడు వందల పేజీల్లో ఐదారు పాత్రలే ప్రవేశించాయి. ఒక హత్య జరిగింది. హత్య చేసింది ‘అయెమామె’ అనే ముప్పై ఏళ్ల యువతి. హత్య చాలా సున్నితంగా జరిగింది. నాకేం జరిగిందని ఆ చనిపోయిన వ్యాపారి కళ్లు ఆశ్చర్యంతో నిండి ఉండగానే అతని ప్రాణం పోయింది. అతని భార్యే చంపించినట్లనిపిస్తోంది. అప్పుడప్పుడే రాస్తున్న ఒక యువ రచయిత, పెద్ద పబ్లిషింగ్ హౌస్ సంపాదకుడు ఈ నవలలోని మరో రెండు పాత్రలు. ఆ సంపాదకుడు ఒక పదిహేడేళ్ల అమ్మాయిని స్టార్ రైటర్‌ని చేయటానికి ఈ యువ రచయితని వాడుకుందామని చూస్తాడు. జపాన్‌లో పబ్లిషింగ్ రంగం, సాహిత్య రంగం ఎంత పెద్దవో ఎలా ఉన్నాయో మనకు కొంత అర్థమవుతుంది. అతను ఈ సాహిత్య స్కామ్ చేయటానికి చెప్పిన కారణాలు సరదాగా ఉన్నాయి. అతనికి పెద్ద పెద్ద రచయితలంటే కోపం. చిరాకు. అసహ్యం. వాళ్ల అహంకారాలను భరించలేడు.
‘‘నేనీ పని డబ్బుకోసం చేయటం లేదు. ఈ సాహిత్య ప్రపంచాన్ని గందరగోళం చెయ్యటం కోసం చేస్తున్నాను. వాళ్లంతా ఒక గుంపు. ఒకచోట చేరి నానా ఛండాలం చేస్తారు. ఒకరి గాయాలొకరు నాకుతారు. అదంతా సాహిత్య సేవ అంటారు. వాళ్లని చూసి పగలబడి నవ్వుకోవాలని ఈ పని చేస్తున్నాను. ఈ సాహిత్య వ్యవస్థ తెల్లబోయేటట్లు, ఆ గుంపునంతా ఒట్టి ఇడియట్లని చూపించటానికి నేనీ పని చేస్తున్నాను.’’ అంటాడు (ఇది స్వేచ్ఛానువాదం. అసలు మాటలు నేను రాయలేనట్లున్నాయి).
కొన్ని నవలలు చదువుతుంటే ‘ప్లాట్’ విషయంలో తెలుగు నవలా రచయితలు చాలా వెనకబడి ఉన్నారని అనిపిస్తుంది. ఈ నవల చదువుతుంటే అదే అనిపిస్తోంది.
80 దశాబ్దపు జపాన్ ఈ నవలలో పరిచయమవుతోంది. జపాన్ సినిమాలెంత గొప్పవో నవలలూ అంత గొప్పవని ఈ నవల పూర్తయ్యేసరికి అనుకోగలుగుతానని ఆశపడుతున్నాను. ఈ రచయితకు మిలన్ కుందేరా, వి.ఎస్.నయ్‌పాల్‌లకు వచ్చిన ప్రతిష్టాత్మకమైన ‘జెరూసలెమ్ ప్రైజ్’ వచ్చింది. ఇతని రాబోయే నవల రాకముందే ఇప్పటికి ఇరవై లక్షల కాపీలు అమ్ముడుపోయిందట.
- ఓల్గా