డొంకెన శ్రీశైలం
డొంకెన శ్రీశైలం ఒక సహజకవి. ప్రాథమికంగా అమ్మకవి. మాయా మర్మాలెరుగని సహృదయమూర్తి. హమేశా హసన్ముఖుడు. తాను శబ్దించకుండా అందరినీ తన హాస్యో క్తులతో నవ్వించిన కరుణాహృదయుడు. అమ్మ విశ్వరూపం, అమ్మతనం, అనితర సాధ్యమైన అమ్మ గుణాన్ని కవిత్వీ కరించాడు. మరొకపక్క, రైతు లోక బాంధవుడై ఈ కవి రైతు ఆత్మను పట్టుకోగలిగాడు. మరణ సదృశంగా మారిన అతని వెతలను ఏకరువు పెట్టాడు. జీవితం ఆసాంతం గోసపాలైన రైతు, ఆఖరుకు ఆత్మహత్య చేసుకున్నప్పుడు, ఆ పాపం ‘దేశానిదా? దేవునిదా’ అని ఆకాశమంతటి ఆవేదనతో ప్రశ్నిస్తూ వచ్చాడు. నేతన్న ‘పోగుల పేగులు’ తెగిన సవ్వడిని వినిపించాడు. శబ్ద శిల్పిగా పరిణతి నొందిన ఆతని సాహిత్య సేవారంగమంతా సృజనశీలమయమే. కనుకనే పసిపాపల చిరునవ్వులో విశ్వశాంతి జాడలను చూశాడు. తెలం గాణ రాష్ట్రం సిద్ధించటమంటే తన ఆకలికి అమృతం కురిసినట్లుందని పరమానంద భరితుడైనాడు. కేరింతలు పెట్టాడు. డొంకెనకు అహరహం స్త్రీల పట్ల అవ్యాజమైన గౌరవ దృక్పథం. ఆమె ఎత్తు ఆకాశమంతటి దన్నాడు. ఈ లోకంలో అద్భుతమైన ఆమె నడకే ఆగలేదు అని నినదిస్తూ నిలిచాడు.
రైతు బాంధవుడి గుండె దడను, చేనేతన్న పోగుల పేగులు తెగిన సవ్వడిని తన కవిత్వంతో వినిపిస్తూవ చ్చాడు డొంకెన. ఆయన మాండలిక పదాలు పలుకుబడు లకు లోటుండక, అవి తొణికిసలాడుతూ ఉంటాయి. అం దుకే ఆతని తొలి కవితా సంపుటి ‘అమ్మ’ను భువనగిరిలోనే ఆవి ష్కరించిన ప్రజాకవి కాళోజీ-అతనివి విద్యాలయాల్లో చదివిన చదువులుగాక (బడి పలుకులు గాకుండా) పలుకు బడులని (పామర జనరంజకాలని) శ్లాఘించారు. ’గుడిసె’ మన తొలినీడ అని, ‘పొయ్యి’ మనకు పూర్వీకు లిచ్చిన అగ్నిహోత్రమని, పాతగుడ్డలే అయినా మా నాన్న కాపాడిన చీనిచీనాంబరాలని, అడవే అంతిమంగా అందివచ్చే దేశ సంపదని, ఎరుక జేస్తూ, అమ్మ శిల్పం ముందు ఎవరెస్టు శిఖరమైనా తలవంచుతుందని సగర్వంగా ప్రకటిం చిన కవిశ్రేష్టుడు డొంకెన. నేటి ఉదయమే (డిసెంబర్ 4) ఈ ప్రపం చానికి వినమ్రంగా వీడ్కోలు పలికి, తన ఆత్మీయ కవితా ప్రపంచా వర ణలోనికి ’అడుగిడిన అన్న-డొంకెన శ్రీశైలం గారికి అశ్రునయనాలతో... వీడ్కోలు పలుకుతున్నాం! కవికి మరణం లేదు.
(డొంకెన శ్రీశైలం 4వ తేదీన అంతిమ శ్వాస విడిచారు)
- వేణు సంకోజు ప్రధాన కార్యదర్శి, జయమిత్ర