ఫైవ్ స్టార్ హోటల్‌లో చంద్రబాబు నివాసం
- ముచ్చటగా మూడోసారి ఇల్లు మార్చిన ముఖ్యమంత్రి
- మదీనాగూడ ఫాంహౌస్ నుంచి బంజారాహిల్స్‌కు రాక
- ఎన్టీఆర్ భవన పక్కనే ఉన్న ఐదు నక్షత్రాల హోటల్‌లో ఉంటున్న వైనం
- హోటల్ రూం అద్దె రోజుకు రూ.17 వేల నుంచి రూ. 30 వేలు
- నెలకు అపార్ట్‌మెంట్ అద్దె రూ. 3.60 లక్షల నుంచి 5.25 లక్షలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ మకాం ఐదు నక్షత్రాల హోటల్‌కు మారింది. అందులోనే సుమారు మూడు నెలలపాటు వారు ఉండనున్నారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా 2014 జూన్ 8న బాధ్యతలు చేపట్టిన తరువాత మారిన ఇళ్ల జాబితాలో ఇది మూడోది. మదీనగూడలోని ఫాంహౌస్‌లో చంద్రబాబు కుటుంబం ప్రస్తుతం ఉంటోంది. తాజాగా ఆయన కుటుంబం బంజారాహిల్స్ రోడ్డు నంబరు2 లోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ పొరుగునే ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ పార్క్ హయత్‌కు మారింది.
దేశంలోనే ఒక ముఖ్యమంత్రి కుటుంబం ఓ హోటల్‌లో మకాం ఉండటం ఇదే తొలిసారి అని రాజకీయ వర్గాలంటున్నాయి. చంద్రబాబు తొలినుంచి జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 65లోని సొంత ఇంట్లో ఉండేవారు. కానీ తర్వాత వాస్తు కారణాలతో ఆ ఇంటిని కూలదోసి కొత్త ఇల్లు నిర్మించాలని భావించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ ఇంటి నిర్మాణం ప్రస్తుతం తుదిదశలో ఉంది. ఆ ఇంటిని సర్వహంగులతో నిర్మించేందుకు కూలదోసిన సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 24లోని ఓ ఇంటిలో అద్దెకు దిగారు. అక్కడ కొద్దిరోజులు ఉన్న ఆయన ఆ తరువాత తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్న లేక్‌వ్యూ అతిథి గృహంలో ఉండేందుకు సిద్ధపడ్డారు. కుటుంబసభ్యులు దానిని పరిశీలించారు. అయితే వారు మనస్సు మార్చుకుని మదీనగూడలోని సొంత ఫాంహౌస్‌కు మారారు.
తాజాగా అక్కడి నుంచి ఐదు నక్షత్రాల హోటల్‌కు మారారు. సొంత ఇంటి నుంచి స్టార్ హోటల్‌కు మారే వరకు ఆయన ఉన్న నివాసాలు, కార్యాలయాల మరమ్మతుల నిమిత్తం సుమారు రూ. 100 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారవర్గాల సమాచారం. వీటి మరమ్మత్తులు, భద్రతా ఏర్పాట్లకే ఈ మొత్తంలో సింహభాగం ఖర్చు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కుటుంబం ఉండే హోటల్ అద్దె అందులో ఉన్న సౌకర్యాలు, విస్తీర్ణం బట్టి రోజుకు రూ. 17 వేల నుంచి రూ. 30 వేల వరకు ఉంటుంది. అదే నెలకు అయితే వాటి విస్తీర్ణాన్ని బట్టి రూ. 3.50 లక్షల నుంచి రూ. 5.25 లక్షల వరకూ హోటల్ వసూలు చేస్తుంది. వీటికి పన్నులు అదనం. సీఎం కుటుంబం ఎక్కడ నివాసం ఉన్నా వారికి అయ్యే ఖర్చు, అద్దెను ప్రభుత్వమే భరిస్తుంది.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు తాత్కాలికంగా నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని లింగమనేని ఎస్టేట్స్‌కు రోడ్ల నిర్మాణం, ఇతర అవసరాల నిమిత్తం రూ. 10 కోట్లకు పైగా ఖర్చుచేశారు. హైదరాబాద్‌లోని మదీనాగూడ, తాడేపల్లిలో గృహాలను నివాస, క్యాంపు కార్యాలయాలుగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ప్రస్తుతం, భవిష్యత్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్నంతవరకూ ఏ చిన్న మార్పులు చేసినా ప్రభుత్వమే ఖర్చు భరించాల్సి ఉంటుంది.