పిచ్చి అభిమానంతోనే చంపేశాడా!
ఫ్లోరిడా: గాయని క్రిస్టినా గ్రిమ్మీ(22)పై కాల్పులకు పాల్పడిన హంతకుడిని పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ఆర్లాండోలో తన బ్యాండ్ ప్రదర్శన ముగిసిన అనంతరం అభిమానులకు ఆటోగ్రాఫ్లు ఇస్తుండగా జరిపిన కాల్పుల్లో గ్రిమ్మీ మృతి చెందిన విషయం తెలిసిందే. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని సెయింట్ పీటర్స్బర్గ్కు చెందిన కెవిన్ జేమ్స్(27)గా గుర్తించారు. కేవలం గ్రిమ్మీని చంపే ఉద్దేశంతోనే అతడు ఆమె ప్రదర్శన నిర్వహిస్తున్న చోటుకు వచ్చాడని పోలీసులు నిర్థారించారు.
గ్రిమ్మీపై కాల్పులు జరిపిన అనంతరం కెవిన్ జేమ్స్ కూడా తనకు తాను కాల్చకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గ్రిమ్మీ సోదరుడు మార్క్ గ్రిమ్మీ కాల్పులకు పాల్పడిన కెవిన్ను పట్టుకోవడానికి ప్రయత్నించాడని.. అయితే ఆ క్రమంలోనే కెవిన్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు వెల్లడించారు. హంతకుడు కెవిన్ ఇంటి దగ్గర ఓ లేఖను గుర్తించారు. దానిలో గ్రిమ్మీని టాలెంటెడ్, లవింగ్ సింగర్గా పేర్కొన్న కెవిన్.. ఆమె కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, అభిమానులకు క్షమాపణలు తెలిపాడు. లేఖను బట్టి చూస్తే గ్రిమ్మీని చంపాలని ముందుగానే కెవిన్ నిర్ణయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. గ్రిమ్మీకి కెవిన్ వీర ఫ్యాన్ అని తెలుస్తోంది.