పంచ్లతో రోడ్డుపై పిచ్చిపిచ్చిగా కొట్టుకుని..
లండన్: అప్పటికే ఆ రోడ్డంతా రద్దీగా ఉంది. కనీసం పక్కకు కొంచెంకూడా తిప్పలేనంత దగ్గరిగా వాహనాలు వెళుతున్నాయి. ఆ సమయంలో ఆ రోడ్డుపై ఉన్న వాహనాలన్నీ కూడా వోక్స్ వ్యాగన్ కార్లే. కొన్ని కార్లు గృహకార్యకలాపాలకు ఉపయోగించుకునేవి కాగా.. మరికొన్ని క్యాబులు. బ్రిటన్లో ఎం ఫైవ్ రోడ్డులోగల ఓ భారీ వంతెన సమీపించిన కార్లు కొద్ది నిడివిలోనే వేగంగా వెళడం సడెన్ బ్రేక్లతో ఆగిపోవడం జరుగుతోంది. అలాంటి సమయంలోనే ఓ రహదారి నిర్వహణ సిబ్బంది వ్యాన్ కూడా మిగితా వాహనాల మధ్య వెళుతోంది. కాగా, ఏకంగా ఆ వాహనానికే పదే పదే కటింగ్స్ ఇస్తూ ఓ వోక్స్ వ్యాగన్ డ్రైవర్ వెళుతూ ఉన్నాడు.
ఇదే చర్యను పదే పదే చేశాడు. రోడ్డు నిర్వహణ సిబ్బంది వ్యాన్ కూడా వెనుక వచ్చే వాహనాలకు అవకాశం ఇవ్వలేని పరిస్థితుల్లో ఒకే క్రమంలో వెళుతోంది. అలా వెళుతున్న ఆ వ్యాన్ కు పదేపదే హారన్ కొట్టడమే కాకుండా అంతకుముందు కటింగ్స్ ఇచ్చిన వోక్స్ వ్యాగన్ కారు డ్రైవర్ తిరిగి ఈసారి కూడా పెద్ద కటింగ్ ఇచ్చి ఆ వ్యాన్ ముందు ఆపాడు. ఫలితంగా వ్యాన్ డ్రైవర్ అనూహ్యంగా బ్రేక్ చేయాల్సి వచ్చింది. ఈ చర్యల కారణంగా కోపంలో మునిగిపోయిన వ్యాన్ డ్రైవర్, వోక్స్ వ్యాగన్ డ్రైవర్ గబాగబా కిందికి దిగి నేరుగా ఫైటింగ్కు దిగారు. తొలుత వ్యాన్ డ్రైవర్ ఎగిరెగిరి అతడికి పంచ్లు ఇచ్చేందుకు ప్రయత్నించినా కారు డ్రైవర్ గట్టిగా ఎదురుతిరిగి బలంగా పంచ్ చేయడంతో ఒక్కసారిగా అతడు కిందపడిపోయాడు. అనంతరం నీ సంగతి తేలుస్తానంటూ కారు నెంబర్ నోట్ చేసుకొని రోడ్డు నిర్వహణ సిబ్బంది ఉద్యోగి వెళ్లిపోయాడు.