ఫార్ములా టైగర్ రోరింగ్ | bengal tiger Movie Review | Sakshi
Sakshi News home page

ఫార్ములా టైగర్ రోరింగ్

Published Fri, Dec 11 2015 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

ఫార్ములా టైగర్ రోరింగ్

ఫార్ములా టైగర్ రోరింగ్

తారాగణం:   రవితేజ, తమన్నా, రాశీఖన్నా, బొమన్ ఇరానీ
కెమేరా :       ఎస్. సౌందరరాజన్
ఎడిటింగ్:     గౌతంరాజు 
 సంగీతం:     భీమ్స్ సిసిరోలియో
నిర్మాత:       కె.కె. రాధామోహన్
కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్ నంది
 
 ‘‘డబ్బున్నవాడితో పెట్టుకోవచ్చు, పవరున్న వాడితో పెట్టుకోవచ్చు.. కానీ తెలివైనవాడితో పెట్టుకోకూడదు.’’ తాజా ‘బెంగాల్ టైగర్’లో డైలాగ్ ఇది. అలాంటి తెలి వైన హీరో పాత్ర, పాత్రచిత్రణ - మనకు కొత్తేమీ కాదు. కాకపోతే దాన్నెలా ప్యాకేజ్ చేసి, తెరపై చెప్పారన్నదే కీలకం. ఆ ఫార్ములా అరువు తెచ్చుకొని, కొత్త రేపర్‌లో ప్యాక్ చేసిన కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘బెంగాల్ టైగర్’. 
 
 గోదావరి జిల్లాలోని గ్రామంలో ఆకాశ్ నారాయణ్ (రవితేజ) కుటుంబం. అతనికి అమ్మ (ప్రభ), ఇద్దర న్నలు - వదినలు, అమ్మమ్మ (రమాప్రభ). ఒకసారి పెళ్ళిచూపుల్లో పెళ్ళికూతురు (అక్ష) పాపులరైనవాణ్ణే పెళ్ళి చేసుకుంటాననడంతో హీరో కంగు తింటాడు. పేపర్‌లో పేరు, ఫోటో వచ్చేలా పాపులరయ్యేందుకు ప్రయత్నం మొదలుపెడతాడు. మంత్రి సాంబ (సాయాజీ షిండే)ను పబ్లిక్ మీటింగ్‌లో రాయి పెట్టి కొట్టి, పాపులరైపోతాడు. రక్తం కారేలా గాయమైన మంత్రి తీరా హీరో గారి మాట తీరు, ధైర్యం నచ్చి, తన దగ్గరే పనికి పెట్టుకుంటాడు. అలా అక్కడ జీతానికి పని చేస్తూనే హోమ్ మంత్రి నాగప్ప (రావు రమేశ్) కూతురు శ్రద్ధ (రాశీఖన్నా)ను ఫ్యాక్షనిస్ట్ ప్రత్యర్థుల బారి నుంచి కాపాడతాడు.
 
  అలా హోమ్ మంత్రి మనసునూ చూర గొంటాడు. ఆయన నాలుగింతల జీతామిస్తాననే సరికి, మొదటి మంత్రిని నడిరోడ్డుపై వదిలేసి, హోమ్ మంత్రి దగ్గర ప్రత్యేక అధికారిగా హీరో చేరతాడు. మరింత ఫేమస్ అవుతాడు. పెళ్ళి ఫిక్సయిన శ్రద్ధను సైతం ప్రేమలో పడేస్తాడు. తీరా ఆమెనిచ్చి పెళ్ళి చేయడానికి సిద్ధపడితే, ముఖ్యమంత్రి గజపతి (బొమన్ ఇరానీ) సాక్షిగా హీరో ప్లేటు తిప్పేస్తాడు. తాను ఇప్పటికే మరో అమ్మాయిని ప్రేమిస్తున్నానీ, కాకపోతే తనది వన్‌సైడ్ లవ్ అనీ చెబుతాడు. ఆ అమ్మాయినే ఇచ్చి పెళ్ళి చేస్తా మని ముఖ్యమంత్రే హామీ ఇచ్చాక, హీరో ఆ అమ్మాయె వరో చెబుతాడు. అందరూ షాకవుతారు. ఆ అమ్మాయి - మీరా (తమన్నా). ఆ షాక్ దగ్గర ఇంటర్వెల్ కార్డు. 
 
 తీరా అది కూడా హీరో ఆడిన నాటకమేనని తెలిసీ తెలియగానే, అతని తెలివికి ఆ పెద్దింటి అమ్మాయి ఫ్లాటైపోతుంది. ‘ఐ లవ్ యు’ చెప్పేస్తుంది. అది నచ్చని సి.ఎం. ఈ హీరో బ్యాక్‌గ్రౌండ్ ఎంక్వైరీ చేయిస్తాడు. ఆత్రేయపురంలో అందరి బాగు కోసం పనిచేసిన స్వర్గీయ జయనారాయణ్ (నాగినీడు) కొడుకే హీరో అని తెలిసి, షాకవుతాడు. రౌడీలతో హీరోను వేటాడతాడు. వాళ్ళ నుంచి తప్పించుకొని, సి.ఎం.తో 24 గంటల పందెం గెల్చిన హీరో- చివరకి రూ. 500 కోట్ల బేరానికి ప్రేమను వదులుకోవడానికి సిద్ధమవుతాడు. అతనలా ఎందుకు చేశాడు? ఇంతకీ హీరో తండ్రి ఎవరు? ఈ సి.ఎం.కూ, చనిపోయిన ఆయనకూ సంబంధం ఏమిటి? ఇలా ఒక్కొక్కరినీ మెట్లుగా చేసుకుంటూ సి.ఎం. కూతురి దాకా వెళ్ళిన హీరో అసలు లక్ష్యం ఏమిటన్నది సెకండాఫ్ చివరలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్, ఆ తరువాత జరిగే క్లైమాక్స్ ఫైట్, సీన్. 
 
 సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, చిన్నా పెద్దా కలిపి ముగ్గురు విలన్లు, నలుగురైదుగురు కమెడియన్లు, ఒక సెంటిమెంటల్ తండ్రి పాత్రధారి - ఇలా చాలామంది తెరపై వచ్చి పోతుంటారు. కానీ, హీరో పాత్ర చుట్టూ, అతని భుజాల మీద మొత్తం నడుస్తుంది. ప్రత్యర్థిని తెలివిగా పడేసే తరహా పాత్రచిత్రణ రవితేజకు అలవాటే. అందుకే, ఆయన అనాయాసంగా చేశారు. ఇటు నిర్మాణ విలువలు, అటు కెమేరా పనితనం, డి.ఐ. వర్క్ స్పెషల్‌గా ఉన్న ఈ సినిమాలో మొన్నటి ‘కిక్2’లా కాకుండా, రవితేజ తెరపై పుంజుకున్నట్లనిపిస్తారు. నిడివిపరంగా చూస్తే రాశీఖన్నా ఎక్కువ, తమన్నా తక్కువ అన్న మాటే కానీ, నటన, పరిధి ప్రకారం చూస్తే ఈ పాత్రలు రెండూ రెండే! మంత్రుల మొదలు సి.ఎం. దాకా ప్రతి ఒక్కరూ హీరో చేతిలో బకరాలే కాబట్టి, విలనిజమ్‌ను మరీ అతిగా ఆశించకూడదు. అప్పటికీ, (మాజీ) సి.ఎం. పాత్ర రౌడీలతో కలసి ఆఖరులో గొడ్డలి కూడా పట్టి, హీరోతో పోరాడుతుంది. 
 
 బురదలో కూరుకున్న రౌడీల దేహాల మీద నుంచి హీరో వెళ్ళే థ్రిల్లింగ్ విజువల్‌తో మొదలయ్యే ఈ సినిమా కథ, స్క్రీన్‌ప్లే సినిమాటిక్‌గా, కథాగమనానికి కన్వీనియంట్‌గా నడిచిపోతాయి. రైతే వెన్నెముకంటూ ‘వ్యవసాయంలో సాయం ఉంది. అగ్రికల్చర్‌లో కల్చర్ ఉంది. అసలు ప్రపంచానికి సేవ చేసే గుణం రైతుకే ఉంది’ (సాయాజీ షిండే), ‘ఆస్తులు, వాస్తుల్ని కాదు.. దోస్తుల్ని నమ్ముతా’ (రవితేజ) లాంటి మంచి మాటలు చాలానే ఉన్నాయి. మెగాఫ్యామిలీ, పవర్‌స్టార్ ప్రస్తావ నలు, త్రివిక్రమ్ మార్కు హిట్ డైలాగ్‌లకు పేరడీలు సరేసరి. భీమ్స్ బాణీల్లో మాస్ పాటలున్నా, మెలొడీ ‘చూపులతో దీపాలా’ చాలాకాలం గుర్తుంటుంది. చిన్నా నేపథ్య సంగీతం, పదేపదే వచ్చే థీమ్ మ్యూజిక్ హాల్ నుంచి బయటకొచ్చాకా చెవుల్లో రింగుమంటాయి. 
 
 ఈ సినిమాకు, ముఖ్యంగా ఎక్కువ శాతం మంది మెచ్చే ఫస్టాఫ్‌కు వినోదం బలం. పురోహితుడు ‘సెల బ్రిటీ శాస్త్రి’గా పోసాని కొంత, హీరో కావాలని తపించే ‘ఫ్యూచర్‌స్టార్ సిద్ధప్ప’గా పృథ్వి చాలావరకు సినిమాను నిలబెట్టారు. రిపోర్టర్ అమలాపురం పాల్ అలియాస్ అమలాపాల్‌గా బ్రహ్మానందం కనిపిస్తారు. కామెడీతో ఫస్టాఫ్ వినోదాత్మకంగా ఉందనిపిస్తుంది. హీరో ప్రవ ర్తనకు కారణం చెప్పే సెకండాఫ్‌కొచ్చేసరికి పాత్రలకు క్లారిటీ వస్తుంది. ప్రేక్షకులకూ సినిమాపై స్పష్టతొస్తుంది. గడచిన హిట్ ‘రచ్చ’ను దర్శకుడు ఈసారీ కొంత అనుసరించినట్లు కనిపిస్తుంది. శంకర్ ‘ఒకే ఒక్కడు’ నుంచి పాపులరైన సి.ఎం (చీఫ్ మినిస్టర్) వర్సెస్ సి.ఎం (కామన్‌మ్యాన్) ఫార్ములా వినడానికెప్పుడూ బాగుం టుంది. లాజిక్‌లందకపోయినా, గేవ్‌ునెంత తెలివిగా అల్లుకుంటే అంత కిక్. ఆ క్రమంలో సెకండాఫ్ కొంత బిగువైతే, రెండున్నర గంటల ‘బెంగాల్ టైగర్’ మన తెలివికి పనిపెట్టని మాస్ కామెడీ. ఒకరికి ఇద్దరు హీరో యిన్ల గ్లామరస్ ఎంటర్‌టైనర్. 
 
 - రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement