వేదిక... వెండితెరల సవ్యసాచి
చిలకలపూడి సీతారామ ఆంజనేయులు అంటే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ, సి.ఎస్.ఆర్. ఆంజనేయులంటే తెలియని తెలుగు సినీ ప్రియులుం డరు. హీరోగా, ఆ పైన విలన్‌గా, కమెడియన్‌గా, చివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా జీవితంలోని వివిధ దశల్లో విభిన్న తరహా పాత్రలను పోషించి, అన్నింటిలోనూ సమాన ఆదరణ పొందిన అరుదైన నటుడాయన.
రంగస్థలిపై రాణింపు
రంగస్థలం నుంచి వచ్చినా, వెండితెరకు అనుగుణంగా కొద్ది రోజుల్లోనే తమను తాము మలుచుకొని, రెండు రంగాల్లోనూ సమాన ప్రతిభ చూపిన వారి జాబితాలో మొదట నిలిచే పేరు - సి.ఎస్.ఆర్. 1907 జూలై 11న నరసరావుపేటలో పుట్టి, పొన్నూరు, గుంటూరుల్లో చదివి, మద్రాసులో స్థిరపడిన ఆయన నాటక, సినీ రంగాలు రెంటిలోనూ మకుటం లేని మహారాజుగా వెలిగారు. చిన్నతనంలోనే నాటకాలు వేసిన ఆయన పెద్దయ్యాక తీరైన విగ్రహం, తీయనైన కంఠంతో అభిమానుల్ని సంపాదించుకున్నారు.
అప్పటికే ఆడపాత్రలు వేసే పురుషుడిగా ప్రతిష్ఠ సంపాదించుకున్న ‘పద్మశ్రీ’ స్థానం నరసింహారావు పక్కన ముఖ్య పాత్రలో సి.ఎస్.ఆర్.ది అపూర్వమైన కాంబినేషన్‌గా రంగస్థలంపై వెలిగిపోయింది. స్వతహాగా జాతీయవాదైన సి.ఎస్.ఆర్. ఆ రోజుల్లోనే హరిజనుల అభ్యుదయంపై ‘పతిత పావన’, అలాగే సంత్ ‘తుకా రామ్’ లాంటి నాటకాలు రాయించుకొని, తన సొంత నాటక సమాజం ‘శ్రీలలిత కళాదర్శ మండలి’ పక్షాన ప్రదర్శించడం ఓ చరిత్ర. తుకారామ్ నాటక ప్రదర్శన ద్వారా వచ్చిన డబ్బును సుభాష్ చంద్రబోస్ ‘ఇండియన్ నేషనల్ ఆర్మీ’కి అందజేయడం ఓ అపూర్వ ఘట్టం. ఆ రంగస్థల పేరుప్రతిష్ఠలు ఆయనకు సినీ ఆహ్వానమిచ్చాయి.
వెండితెరకు కొత్త వెలుగు
1933లో తీసిన ‘రామదాసు’ చిత్రంలో సి.ఎస్.ఆర్. శ్రీరాముడి పాత్ర పోషించినా, అది వెలుగులోకి రాలేదు. కానీ, ఆ తరువాత హెచ్.ఎం. రెడ్డి దర్శకత్వంలోని బాక్సాఫీస్ హిట్ ‘ద్రౌపదీ వస్త్రాపహరణము’ (1936)లో శ్రీకృష్ణుడిగా తెరపై స్థిరపడ్డారు. ‘తుకారామ్’ (’37)గా వెలిగారు. పి. పుల్లయ్య తీసిన ‘శ్రీవేంకటేశ్వర మాహాత్మ్యము’ (’38) ఘన విజయంతో తొలి తెర వేలుపయ్యారు. అక్కడ నుంచి ఒకపక్క ‘జయప్రద’, ‘భీష్మ’ లాంటి చిత్రాల్లో పురాణ, చారిత్రక కథా పాత్రల్లో, మరో పక్క ‘చూడామణి’, ‘గృహప్రవేశం’ లాంటివాటిల్లో నవతరం సాంఘిక పాత్రల్లో సమాన ప్రజ్ఞను చూపడం ఆయనలోని గొప్పదనం. ముఖ్యంగా సారథీ వారి ‘గృహప్రవేశం’ (’46)లో ‘మై డియర్ తులశమ్మక్కా’ అంటూ ఆయన పాడిన పాట, చేసిన నృత్యం ఇవాళ్టికీ హైలైట్. విజయా వారి ‘మాయాబజార్’ (’57)లో శకునిగా ఆయన చూపిన అభినయం, ‘ముక్కోపానికి మందు ముఖస్తుతి ఉండనే ఉందిగా!’ అంటూ చెప్పిన డైలాగులు ఇవాళ్టికీ జనానికి గుర్తే. ‘లైలా మజ్ను’, ‘దేవదాసు’, ‘కన్యాశుల్కం’, ‘రోజులు మారాయి’, ‘అప్పు చేసి పప్పుకూడు’ లాంటి చిత్రాల్లో అటు దుష్టత్వమైనా, ఇటు లలితమైన హాస్యమైనా, సాత్త్వికాభినయమైనా - తూకం వేసినట్లు పండించిన ఆయన పాత్రలు నవతరం నటులకు ఓ పెద్దబాలశిక్ష. దర్శకుడిగా ‘శివగంగ’, ‘రిక్షావాలా’ లాంటి ప్రయత్నాలు పురిటిలో సంధి కొట్టడంతో సి.ఎస్.ఆర్.లోని మరో ప్రతిభా పార్శ్వం బహిర్గతం కాలేదు.
పాండీబజార్ పరమ శివుడు
చిత్రసీమ మద్రాసు మహానగరంలో వెలిగిన ఆ రోజుల్లో నటీనటులకు ఆటపట్టయిన టి.నగర్‌లోని పాండీబజార్ ఉదయాస్తమాన వేళల్లో సి.ఎస్.ఆర్‌కు శాశ్వత చిరునామా. అందమైన ‘బ్యూక్’ కారు వేసుకొని వచ్చి, పాండీబజార్ గీతా కేఫ్ (ఇప్పటికీ ఉంది) సెంటర్‌లో, చెట్టు కింద నిలబడి, వచ్చే పోయే సినీ జనాన్ని పలకరిస్తూ ఆయన నడిపిన మాట కచ్చేరీలు అనంతం. అందరినీ ఆదరిస్తూ, గుప్తదానాలతో ఆదుకుంటూ వచ్చి, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుణ్ణి వదిలి, పెద్ద వయసు రాకుండానే కన్నుమూశారు. ఆయన చనిపోతే, రంగస్థల ప్రియులు ‘తుకారామ్ పోయాడ’న్నారు. సీనియర్ సినీ జర్నలిస్టు ఇంటూరి ‘సి.ఎస్.ఆర్. లేని పాండీబజార్... శివుడు లేని కైలాసం’ అని వాపోయారు.
తెలుగు తెర చరిత్రను పరికిస్తే, మాటకు ముక్కును కూడా ఒకింత ఆసరాగా చేసుకున్న సి.ఎస్. ఆర్. విలక్షణ వాచికం అప్పటికీ, ఇప్పటికీ ప్రత్యేకమే. పద్యాన్నీ, వచనాన్నీ విలక్షణ రీతిలో చెప్పడమే కాక, ఒకే మాటను ఆయా సమయ, సందర్భాలకు తగ్గట్లు భిన్న రసాలతో పలికించి, మెప్పించేవారు. ప్రత్యేకమైన ఆంగికాభినయం కూడా అంతే ప్రత్యేకం. వాటికి పాత్రోచితమైన ఆహార్యం కూడా తోడవడంతో, సి.ఎస్.ఆర్. ఏ పాత్ర చేసినా, అక్కడ ఆ పాత్ర తాలూకు స్వరూప స్వభావాలే సాక్షాత్కరించేవి. నాగయ్య లాంటి గొప్ప నటుడు సైతం ‘ఒక రకంగా సి.ఎస్.ఆర్. నాకు గురువు’ అన్నది అందుకే. ఈనాటి బాక్సాఫీస్ ప్రమాణాల్లో టాప్ స్టార్‌గా వెలగకపోయినా, ఉత్తమ నటుడిగా ిసి.ఎస్.ఆర్. వెలిగారు. నూట ఏడేళ్ళ క్రితం పుట్టి, అయిదు దశాబ్దాల క్రితమే (1963 అక్టోబర్ 8) భౌతికంగా దూరమైనా ఇవాళ్టికీ జనం నోట మిగిలారు.
- రెంటాల జయదేవ