సినిమా రివ్యూ: అల్లుడు శీను | Movie review: Alludu Srinu | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: అల్లుడు శీను

Published Fri, Jul 25 2014 1:26 PM | Last Updated on Sat, Aug 3 2019 12:45 PM

సినిమా రివ్యూ: అల్లుడు శీను - Sakshi

సినిమా రివ్యూ: అల్లుడు శీను

నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, సమంత, తమన్నా, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి, ప్రదీప్ రావత్, బ్రహ్మనందం తదితరులు

ప్లస్ పాయింట్స్:
శ్రీనివాస్ యాక్టింగ్
ఫోటోగ్రఫీ
సంగీతం

మైనస్ పాయింట్స్:
కథ, కథనం
కామెడీ

టాలీవుడ్ లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన బెల్లంకొండ సురేశ్ తన కుమారుడు శ్రీనివాస్ ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం అల్లుడు శీను. పగ, ప్రతీకారం, కామెడీ, నేపథ్యంగా ప్రేమకథా చిత్రంగా రూపొందిన అల్లుడు శ్రీను చిత్రం వీవీవినాయక్ దర్శకత్వంలో రూపొందింది. అల్లుడు శ్రీనుగా శ్రీనివాస్ అకట్టుకున్నాడా అని తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం.

అప్పులు చేస్తూ శ్రీను అల్లరి చిల్లరిగా తిరిగే ఓ తింగరి.  తన తమ్ముడి చేతిలో మోసగించి ఆపదలో ఉన్న నర్సింహను శ్రీను రక్షించి చేరదీస్తాడు. అప్పుల వాళ్ల బారి నుంచి తప్పించుకునేందుకు శ్రీను, నర్సింహలు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ లో మాఫీయా డాన్ భాయ్ కూతురు అంజలిని తొలి చూపులోనే ప్రేమిస్తాడు. ఓ దశలో శ్రీను ప్రేమను అంజలి రిజెక్ట్ చేస్తుంది. కథ ఇలా సాగుతుంటే తన తమ్ముడు నర్సింహ బ్రతికే ఉన్నాడని భాయ్ కి తెలుస్తుంది. తన కూతరును ప్రేమిస్తున్న శ్రీను, నర్సింహను చంపాలని భాయ్ ప్రయత్నిస్తాడు. భాయ్ కుట్రలను శ్రీను ఎలా ఎదుర్కొన్నాడు?  నర్సింహను భాయ్ ఎందుకు చంపాలనుకున్నాడు? అంజలిని ఎలా కన్విన్స్ చేసి తన ప్రేమకు శుభం కార్డు ఎలా వేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే 'అల్లుడు శీను'.

అల్లుడు శ్రీనుగా బెల్లంకొండ శ్రీనివాస్ టైటిల్ రోల్ ను పోషించాడు. ఫైట్స్, డాన్స్ లతో తొలి చిత్రంలోనే ఆకట్టుకున్నాడు. కొత్త హీరో అనే ఫీలింగ్ ఎక్కడ కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే కీలక సన్నివేశాల్లో నటనపరంగా కొంత తడబాటుకు గురైనట్టు కనిపించాడు. డైలాగ్ డెలివరిలో కొంత మెరుగుపరుకుంటే పూర్తి స్థాయి స్టార్ మారే అవకాశం పుష్కలంగా ఉన్నాయి.

భాయ్ కూతురు అంజలిగా సమంత గ్లామరస్ గా కనిపించింది. మాస్ పాటల్లో సమంత మెరుగైన డాన్స్ ఆకట్టుకుంది. గత చిత్రాలతో పోల్చుకుంటే సమంతకు రొటీన్ పాత్రే. తన పాత్రకు సమంత న్యాయం చేకూర్చింది. ఇక పాటలో తమన్నా తళుక్కుమంది.

భాయ్, నర్సింహగా ప్రకాశ్ ద్విపాత్రాభినయం చేశారు. అయితే రెండు పాత్రల్లో పెద్దగా వైవిధ్యం కనిపించలేదు. ప్రకాశ్ రాజ్ ఇలాంటి పాత్రల్లో చాలా సార్లే ప్రేక్షకులకు కనిపించాడు. భాయ్, నర్సింహలో కొత్తదనం ఏమిలేదు.

డింపుల్ గా బ్రహ్మనందం కామెడీతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. గత చిత్రాలతో పోల్చుకుంటే గొప్ప కామెడీని పండించలేకపోయాడు. అయితే క్లైమాక్స్, కొన్ని సీన్లలో కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు.

ప్రదీప్ రావత్, రఘుబాబు, తనికెళ్ల భరణి ఇతర కారెక్టర్లకు అంతగా స్కోప్ లేకపోయింది.

టెక్నికల్:
దేవీశ్రీప్రసాద్ జోష్ తో కలిగించే పాటలు ఇప్పటికే ప్రేక్షకులకు రీచ్ అయ్యాయి. అంతే మొత్తంలో పాటల్ని తెరపై చోటా కే నాయుడు అందంగా చిత్రీకరించాడు. అందమైన లోకేషన్లలో చోటా కే నాయుడు కెమెరా పనితనం అదుర్స్ అనిపించింది. డైలాగ్స్ అంతగా పండలేదు.

ఓ కొత్త హీరో చిత్రానికి కావాల్సిన హుంగుల్ని డిజైన్ చేయడంలో దర్శకుడు వీవీ వినాయక్ సఫలమయ్యాడు కాని.. కథలో పస లేకపోవడం, కథనం పేలవంగా ఉండటం మైనస్ పాయింట్స్ గా మారాయి. సెకండాఫ్ లో ఓ రొటీన్ సీన్లు విసుగు పుట్టించాయి. అయితే ప్రీ క్లైమాక్స్ లో కొంత వేగం పెంచినా.. చివర్లో మళ్లీ కథ మొదటికివచ్చింది. శ్రీనివాస్ లో ఉన్న జోష్, మంచి ఈజ్ కు ఓ వైవిధ్యమున్న కథ తోడైతే.. సూపర్ హిట్ సాధించే ఛాన్స్ ఉండేది. రొటిన్ కథ, పక్కా మాస్ ఎలిమెంట్స్ తో పర్వాలేదనిపించే 'అల్లుడు శీను' చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశంపైనే విజయం ఆధారపడిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement