ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్ | Spectre review: Daniel Craig's James Bond keeps to the formula | Sakshi
Sakshi News home page

ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్

Published Fri, Nov 20 2015 11:36 PM | Last Updated on Fri, Nov 9 2018 6:16 PM

ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్ - Sakshi

ఎప్పటిలానే... 'స్పెక్టర్' బాండ్

చిత్రం - ‘స్పెక్టర్’

తారాగణం - డేనియల్ క్రెగ్, క్రిస్టఫ్ వాల్ట్జ్, లీ సేడాక్స్, మోనికా బెలూచీ

కెమేరా - హొయ్‌టే వాన్ హోయ్‌టెమా

దర్శకత్వం- శామ్ మెన్‌డెస్

నిడివి- 147 నిమిషాలు

‘బాండ్... జేమ్స్‌బాండ్...’ ప్రపంచం మొత్తాన్నీ ఊపేసిన డైలాగ్ ఇది. తెరపై ఆ డైలాగ్.., ‘ట..డ..ట్టడా...య్...’ అనే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వినని వాళ్ళూ, విని ఇష్టపడనివాళ్ళూ అరుదు. జేమ్స్‌బాండ్ జానర్ సినిమాలకున్న ఎడ్వాంటేజ్ అది. అశేష అభిమానులు, నిర్ణీతంగా సినిమాకొచ్చే ప్రేక్షకులూ ఎప్పుడూ రెడీ! తాజా జేమ్స్‌బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ మీద అమితమైన ఆసక్తికి అదే కారణం. హాలీవుడ్ జేమ్స్‌బాండ్ చిత్రాల సిరీస్‌లో ఇది 24వ సినిమా.  

 ఒకప్పుడు సీన్ క్యానరీ, రోజర్ మూర్, పీర్స్ బ్రోస్నన్ లాంటి నటులు జేమ్స్‌బాండ్‌గా అలరిస్తే, ‘క్యాసినో రాయల్’, ‘క్వాంటమ్ ఆఫ్ సోలేస్’, ‘స్కై ఫాల్’ లాంటి సినిమాల నుంచి డేనియల్ క్రెగ్ ఆ పాత్రను చేపట్టారు. ‘ఇదే నా ఆఖరి బాండ్ సినిమా’ అని డేనియల్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్న ఈ సినిమా కథ కూడా సగటు జేమ్స్‌బాండ్ సినిమాల్లో కథలానే ఉంటుంది. కాకపోతే, హీరోపై విలన్‌కు కాస్తంత పాత వ్యక్తిగత ద్వేషం కూడా ఉన్నట్లు కలిపారు. ‘స్పెక్టర్’ అనేది ఒక రహస్య సంస్థ పేరు. దాన్ని నడిపే ఒక విలన్. పేరు ఫ్రాంజ్ ఒబెర్‌హాసర్ (క్రిస్టఫ్ వాల్ట్జ్). అతను అలా సరికొత్త ఇంటెలిజెన్స్ సర్వీస్ నడుపుతూ దేశాల రహస్యాలను కనిపెట్టి, అందరినీ ఆట ఆడిస్తుంటాడు. ఆ టైమ్‌లో జేమ్స్‌బాండ్ 007 (డేనియల్ క్రెగ్) రంగప్రవేశం. ‘స్పెక్టర్’ కథా కమామిషు తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. ఆ క్రమంలో కథ లండన్, మొరాకో, ఆస్ట్రియా - ఇలా పది దేశాల మీదుగా తిరుగుతుంది.

 ఒకప్పుడు ‘స్పెక్టర్’లో పనిచేసిన ఒక ముసలి వ్యక్తిని హీరో కలుసుకుం టాడు. డాక్టరైన అతని కూతుర్ని (లీ సేడౌక్స్) కాపాడతానంటూ వాగ్దానం చేస్తాడు. వెంటాడుతున్న విలన్ అనుచరుల నుంచి తప్పించుకుంటూ, వాళ్ళ బారి నుంచి ఆ అమ్మాయిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తాడు. ఆ క్రమంలో కారు ఛేజ్‌లు, వైమానిక విన్యాసాలు, కాల్పులు, పేలుళ్ళ లాంటి అంశాలన్నీ మామూలే. చివరకు ‘స్పెక్టర్’ను నడిపే ప్రధాన విలన్ ఆటకట్టించాడన్నది మన తెలుగు సినిమాల లెక్కన రెండున్నర గంటలు తెరపై చూడాల్సిన కథ.

 ‘క్యాసినో రాయల్’ మొదలు మొన్నటి ‘స్కై ఫాల్’, ఇవాళ్టి ‘స్పెక్టర్’ దాకా జేమ్స్‌బాండ్ అంటే... డేనియల్ క్రెగ్గే. అతని బాడీ లాంగ్వేజ్, చేసిన యాక్షన్ ఘట్టాలు బాండ్ పాత్రకు కొత్త రూపం తెచ్చాయి. ప్రపంచాన్ని ఒంటిచేత్తో కాపాడే బ్రిటీష్ గూఢచారి పాత్రలో ఎప్పటికప్పుడు జీవించడానికి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. విశేషమేమంటే, ఈ సినిమాలో విలన్ అంతే దీటుగా ఉండడం. ఆస్కార్ లాంటి అత్యున్నత పురస్కారాలెన్నో అందుకున్న క్రిస్టఫ్ వాల్ట్జ్ విలన్ పాత్రనూ, క్రూరత్వాన్నీ నేర్పుగా చూపించారు.

 ఈ సినిమా కోసం భారీయెత్తున పెట్టిన ఖర్చు, చాలా శ్రమతో చేసిన యాక్షన్ సీన్లు, వేసిన సెట్లు, తిరిగిన దేశదేశాలు తెరపై కనిపిస్తుంటాయి. విజువల్స్ వండర్‌ఫుల్ అనిపిస్తాయి. ముఖ్యంగా, రీ-రికార్డింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రత్యేకించి చెప్పుకోవాలి. కానీ, కథ మాత్రం పాత సినిమాల్లోని ఘట్టాలకు కొత్త తిరగమోత. అలాగే, పాత్రల మధ్య ఎమోషన్లూ సహజమనిపించవు. యాక్షన్ సీన్లను మినహాయిస్తే, మిగిలిన సందర్భాల్లో కథ సుదీర్ఘంగా సాగు తుంది. అందుకే, ‘స్కైఫాల్’ దర్శకుడు, రచయితల బృందమే ఈ సినిమాకూ పనిచేస్తోందంటే కలిగిన ఉత్సాహం ఈ సినిమా చూస్తుండగా నిలవదు.  
 అయితే, జేమ్స్‌బాండ్ తరహా సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఈ సినిమా మంచి కాలక్షేపమే. వరుసగా జేమ్స్‌బాండ్ సినిమాలన్నీ చూస్తూ వస్తున్న వాళ్ళకు వీటిలో కొత్త సంగతులు ఉండకపోవచ్చు.

సరికొత్త విశేషాలు కనపడకపోవచ్చు. చాలా భాగం సంఘటనలు పదే పదే రిపీట్ అవుతున్నవే కావచ్చు. కానీ, వాటన్నిటినీ ఎప్పటికప్పుడు కొత్త తరహా దృశ్యాలుగా... ఉద్విగ్నభరితమైన సన్నివేశాలుగా... కుర్చీ అంచున కూర్చొని చూడాల్సిన విన్యాసాలుగా... తీర్చిదిద్దడంలోనే నేర్పు ఉంది. సక్సెస్‌ఫుల్ జేమ్స్‌బాండ్ సినిమాలు తీసేవాళ్ళకు అది తెలియాలి. చూసేవాళ్ళు అది తెలిసీ చూడాలి. హాలీవుడ్ మేకింగ్ వ్యాల్యూస్‌తో ‘స్పెక్టర్’ అలానే అనిపిస్తుంది. మునుపటి చిత్రాలతో పోలిస్తే నిరాశపరిచినా, లాజిక్ వెతకని సామాన్య బాండ్ ప్రేమి కుల్ని అలరిస్తుంది. పైగా, నాలుగు భాషల్లో (ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం) వెయ్యికి పైగా హాళ్ళలో రిలీజవడం ‘స్పెక్టర్’కు కలిసొచ్చే అంశం.
 
నిజానికి, ‘స్పెక్టర్’ చిత్రం బ్రిటన్‌లో ఈ అక్టోబర్ 26న, అమెరికాలో, ఇతర ప్రాంతాల్లో ఈ నెల 6న రిలీజైపోయింది. మన దేశంలో మాత్రం ఆలస్యంగా వచ్చింది. ‘ప్రేమ్త్రన్ ధన్ పాయో’ లాంటి భారీ చిత్రాలు ఉండడంతో పంపిణీదారులైన సోనీ పిక్చర్స్ ఇండియా వారు ఈ చిత్రాన్ని ఇక్కడ ఆలస్యంగా రిలీజ్ చేశారని ఒక కథనం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement