ఇక నేనే సారథి.. | Akhilesh Yadav declared party chief at Samajwadi Party Meeting | Sakshi
Sakshi News home page

ఇక నేనే సారథి..

Published Mon, Jan 2 2017 1:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:10 PM

ఇక నేనే సారథి.. - Sakshi

ఇక నేనే సారథి..

సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ ఎన్నిక..
ములాయంకు మార్గనిర్దేశక బాధ్యతలు
రాంగోపాల్‌ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం
పార్టీ యూపీ అధ్యక్షుడిగా శివపాల్‌ తొలగింపు, అమర్‌సింగ్‌ బహిష్కరణ
నరేశ్‌ ఉత్తమ్‌కు పార్టీ రాష్ట్ర బాధ్యతలు కట్టబెట్టిన అఖిలేశ్‌
ఆగ్రహంతో ప్రతిచర్యలకు పూనుకున్న ములాయం
ఈ సమావేశం చట్టవిరుద్ధమంటూ లేఖ
రాంగోపాల్, నరేశ్‌ ఉత్తమ్‌ సహా పలువురు నేతలపై బహిష్కరణ వేటు


పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకునేందుకు సిద్ధమని గతంలోనే ములాయంతో చెప్పాను. ఆయన నన్ను సీఎంను చేశారు. అందరూ ఎస్పీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. కొందరు అలా జరగకూడదనుకుంటున్నారు. మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేతాజీ(ములాయం) ఎక్కువ సంతోషిస్తారు.    – అఖిలేశ్‌ యాదవ్‌


పార్టీ పార్లమెంటరీ బోర్డు అన్ని ప్రతిపాదనలు, నిర్ణయాల్ని ప్రకటిస్తుంది. రాంగోపాల్‌ నిర్వహిస్తున్న కార్యవర్గ భేటీ రాజ్యాంగ విరుద్ధం. పార్టీ రాజ్యాంగానికి, క్రమశిక్షణకు ఇది వ్యతిరేకం. ఇది పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించింది. సమావేశం నిర్వహించిన రాంగోపాల్‌ను ఆరేళ్లపాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం.     – ములాయం సింగ్‌ యాదవ్‌


లక్నో : ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల రాజకీయం సరికొత్త మలుపు తీసుకుంది. సమాజ్‌వాదీ పార్టీలో ముసలం మరింత ముదిరింది. ఏకంగా పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి ములాయంసింగ్‌ యాదవ్‌ను తప్పించి.. అఖిలేశ్‌ యాదవ్‌ను అధ్యక్షుడిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ సమావేశం నిర్ణయం తీసుకుంది. ములాయం సోదరుడు శివపాల్‌ యాదవ్‌ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతోపాటు సీనియర్‌ నేత అమర్‌సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇందుకు దీటుగా స్పందించిన ములాయం.. తానే ఎస్పీ జాతీయాధ్యక్షుడినంటూ ప్రతిచర్యలకు పూనుకున్నారు. పార్టీ జాతీయ సమావేశాన్ని నిర్వహించిన రాంగోపాల్‌ యాదవ్‌ను బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక పార్టీ యూపీ అధ్యక్షుడిగా నరేశ్‌ ఉత్తమ్‌ను అఖిలేశ్‌ నియమించగా... ములాయం నరేశ్‌ ఉత్తమ్‌ను కూడా పార్టీ నుంచి బహిష్కరించారు. మొత్తంగా యూపీ అసెంబ్లీ ఎన్నికలను మించి.. ఎస్పీలో కుటుంబ కలహాలు రోజుకో మలుపుతో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి. కుటుంబ కలహాలు కాస్తా పార్టీపై ఆధిపత్య పోరుగా మారడంతో తండ్రీ కొడుకుల మధ్య ఏ రోజు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

రాజీ కుదిరి ఒకరోజైనా గడవకముందే..
ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీలో కొంతకాలంగా అంతర్గత కలహాలు ముసురుకున్న విషయం తెలిసిందే. పార్టీ జాతీయాధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్, ఆయన సోదరుడు శివపాల్‌యాదవ్‌లకు.. ములాయం కుమారుడు, యూపీ సీఎం అఖిలేశ్‌యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్‌యాదవ్, వారి మద్దతుదారులకు మధ్య పోరు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రసకందాయంలో పడింది. పార్టీ అభ్యర్థుల ప్రకటనలో ఇరువర్గాలు మొండిపట్టుతో వ్యవహరించి, ఎవరి జాబితాలు వారు విడుదల చేశారు. దీనిపై ఆగ్రహించిన ములాయం శుక్రవారమే అఖిలేశ్‌ను, రాంగోపాల్‌ పార్టీ నుంచి బహిష్కరించారు. కానీ అఖిలేశ్‌ తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు, నేతలతో బలం ప్రదర్శించడంతో.. శనివారం రాజీకి వచ్చి, బహిష్కరణ ఎత్తివేశారు. కానీ ఇది జరిగి 24 గంటలైనా గడవకముందే.. ఆదివారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

(చదవండి :ములాయం సింగ్కు అస్వస్థత )

రాంగోపాల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఎస్పీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. లక్నోలోని జ్ఞానేశ్వర్‌ మిశ్రా పార్కులో రాంగోపాల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎస్పీ జాతీయ సమావేశంలో అఖిలేశ్‌ను పార్టీ జాతీయాధ్యక్షుడిగా ఎన్నుకుందామని ప్రతిపాదించారు. దీనికి పార్టీ శ్రేణులంతా చేతులెత్తి మద్దతు ప్రకటించాయి. ములాయం సింగ్‌ను పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మార్గ నిర్దేశకుడిగా ప్రకటిస్తూ రాంగోపాల్‌ ప్రతిపాదన ప్రవేశపెట్టారు. అలాగే పార్టీ యూపీ అధ్యక్షుడిగా శివ్‌పాల్‌యాదవ్‌ను తొలగించే మరో ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. అమర్‌సింగ్‌ను శాశ్వతంగా బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక అవసరం మేరకు పార్టీ జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు, ఇతర రాష్ట్ర విభాగాల్ని నియమించేందుకు అఖిలేశ్‌కు అధికారం కల్పిస్తూ నిర్ణయించారు. అలాగే ఎస్పీలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిని వివరిస్తూ ఎన్నికల సంఘానికి సమాచారమిచ్చారు.



ములాయం హెచ్చరికలు బేఖాతరు
రాంగోపాల్‌ నిర్వహిస్తున్న సమావేశానికి హాజరైతే క్రమశిక్షణరాహిత్యంగా పరిగణిస్తామని, వారిపై చర్యలు తీసుకుంటామని ములాయం హెచ్చరించినా... దాదాపు పార్టీలోని సీనియర్‌ నేతలంతా హాజరుకావడం గమనార్హం. సుదీర్ఘకాలంగా ములాయంతో సన్నిహితంగా ఉన్న పార్టీ నేతలు కూడా అఖిలేశ్, రాంగోపాల్‌లతో వేదిక పంచుకున్నారు.

యూపీ కొత్త అధ్యక్షుడిగా నరేశ్‌ ఉత్తమ్‌
మరోవైపు శివ్‌పాల్‌ యాదవ్‌ స్థానంలో పార్టీ యూపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ నరేశ్‌ ఉత్తమ్‌ను అఖిలేశ్‌ నియమించారు. వెంటనే నరేశ్‌ అనుచరులు భారీ భద్రత మధ్య ఉన్న ఎస్పీ ప్రధాన కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. శివ్‌పాల్‌ యాదవ్‌ నేమ్‌ ప్లేట్‌ను ధ్వంసం చేశారు. మరోవైపు శివ్‌పాల్‌ మద్దతుదారులు పోటీగా నిరసన తెలపడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

కుట్రపై పోరాడడం నా విధి: అఖిలేశ్‌
పార్టీ జాతీయాధ్యక్షుడిగా ప్రతిపాదించిన వెంటనే అఖిలేశ్‌ ప్రసంగించారు. ఇంతకుముందు ఉన్నదాని కంటే ఎక్కువగా తన తండ్రిపై గౌరవం ఉందని.. అయితే తనకు వ్యతిరేకంగా పార్టీలో కుట్ర చేస్తున్నవారిపై మాత్రం పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. ‘‘పార్టీకి వ్యతిరేకంగా కుట్ర చేసిన వారే నష్టం కలిగించారు. జాతీయాధ్యక్షుడికి సమస్యలు సృష్టించారు. కొందరు నాపై ఆరోపణలు చేయవచ్చు. కానీ ములాయం కుమారుడిగా.. పార్టీకి, నా తండ్రికి వ్యతిరేకంగా ఏదైనా కుట్ర జరుగుతుంటే పోరాడడం నా విధి. ఇంతకుముందు ఇదే చెప్పాను.. ఇప్పుడు మరోసారి చెబుతున్నాను..’’ అని అఖిలేశ్‌ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పుకొనేందుకు సిద్ధమని గతంలోనే తాను ములాయంతో చెప్పానని.. ఆయన తనకు ముఖ్యమంత్రిగా పనిచేసేందుకు అవకాశమిచ్చారని చెప్పారు. అందరూ ఎస్పీ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని,  కొందరు మాత్రం అలా జరగకూడదని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. మరోసారి ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేతాజీ (ములాయం) ఎక్కువ సంతోషిస్తారని, మరోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. నేతాజీ గౌరవం, హోదా మనకు ఎంతో ముఖ్యమని, రాబోయే మూడు నాలుగు నెలలు మనకు చాలా కీలకమని పార్టీ శ్రేణులకు వివరించారు.

ఆ ఇద్దరే కుట్ర చేశారు: రాంగోపాల్‌
అఖిలేశ్‌ అనంతరం రాంగోపాల్‌ యాదవ్‌ మాట్లాడారు. అఖిలేశ్‌ ప్రభుత్వం బాగా పనిచేస్తుందనే విషయం అందరికీ తెలుసని, ఆయనను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా ఇద్దరు వ్యక్తులు కుట్ర చేశారని ఆరోపించారు. వారే పార్టీకి పెద్ద సమస్యగా తయారయ్యారని ఆరోపించారు. ‘‘శివపాల్‌ యాదవ్‌ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. పార్టీలో సభ్యులుగా లేనివారికి కూడా టికెట్లిచ్చారు. పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు విరుద్ధంగా, పార్టీ నుంచి బయటికి గెంటిన వారిపై సస్పెన్షన్‌ ఎత్తివేశారు. కొందరు వ్యక్తులు ఎస్పీ తిరిగి అధికారంలోకి రాకుడదని కోరుకుంటున్నట్లు స్పష్టమైంది. అఖిలేశ్‌ మరోసారి సీఎం కావడం వారికి ఇష్టం లేదు..’’ అని వ్యాఖ్యానించారు.

అది చట్టవిరుద్ధం: ములాయం
పార్టీ జాతీయాధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని, అందులో తీసుకున్న నిర్ణయాలు చట్టవిరుద్ధమని ములాయంసింగ్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. రాంగోపాల్‌ ఆధ్వర్యంలో పార్టీ సమావేశం ప్రారంభం కాగానే ఆగమేఘాలపై ఓ లేఖ విడుదల చేశారు. ‘‘రాంగోపాల్‌ నిర్వహిస్తున్న కార్యవర్గ భేటీ రాజ్యాంగ విరుద్ధం. పార్టీ రాజ్యాంగానికి, క్రమశిక్షణకు అది వ్యతిరేకం. ఇది పార్టీ ప్రతిష్టకు నష్టం కలిగించింది. పార్టీ పార్లమెంటరీ బోర్డు అన్ని ప్రతిపాదనలు, నిర్ణయాల్ని ప్రకటిస్తుంది. సమావేశం నిర్వహించిన రాంగోపాల్‌ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాం..’’ అని అందులో పేర్కొన్నారు. తాము జనవరి 5న జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం పార్టీ యూపీ అధ్యక్షుడిగా అఖిలేశ్‌ వర్గం ప్రకటించిన నరేశ్‌ ఉత్తమ్‌ను, పార్టీ ఉపాధ్యక్షుడు కిరణ్మయ్‌ నంద, ప్రధాన కార్యదర్శి నరేశ్‌ అగర్వాల్‌లను కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ములాయం, శివపాల్‌లు ఒంటరేనా..?
తాజా పరిణామాలతో పార్టీలో దాదాపు ములాయం, శివపాల్‌ యాదవ్‌లు దాదాపు ఒంటరైనట్లు భావిస్తున్నారు. శనివారం 200 మంది ఎమ్మెల్యేలతో అఖిలేశ్, రాంగోపాల్‌లు తమ బలం నిరూపించుకోగా...ఆదివారం పార్టీ సీనియర్‌ నేతలు కూడా ములాయంకు షాకిచ్చారు. ఎంపీలు సైతం అఖిలేశ్‌కే జై కొడుతూ మాట్లాడారు. తాజా పరిణామాలపై ఆ పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. ‘‘లక్షల మంది ప్రజలు అఖిలేశ్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాంటప్పుడు తొలగించే హక్కు ఎవరికుంది. నేతాజీ మా నాయకుడు. మేమంతా ఆయన్ని గౌరవిస్తాం. మీ కొడుకు ముందుకెళ్తూ మీరు గర్వించేలా చేస్తున్నప్పుడు.. మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయానుకుంటున్న వ్యక్తుల్ని వదులుకోవాలని నేతాజీకి చెప్పాలనుకుంటున్నా..’’ అని పేర్కొన్నారు. ప్రజాభిప్రాయాన్ని ములాయం ఇంకా లక్ష్యపెట్టకుంటే అది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement