దయచేసి నన్ను బతకనీయండి: అమర్ సింగ్
లండన్: సమాజ్ వాదీ పార్టీలో రేగిన చిచ్చుకు తాను కారణం కాదని ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ పునరుద్ఘాటించారు. ములాయం సింగ్ యాదవ్ కుటుంబ వివాదాలతో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ములాయం, అఖిలేశ్ మధ్య విభేదాల వెనుక తాను లేనని చెప్పారు. లండన్ లో ఉన్న ఆయన సమాజ్ వాదీ పార్టీ సంక్షోభంపై స్పందించారు.
‘నాకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్న వారికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. దయచేసి నన్ను బతనీయండి. నా కుటుంబం కోసం నేను బతకాలనుకుంటున్నాను. ఒకవేళ సమాజ్ వాదీ పార్టీలో నావల్లే సంక్షోభం ఏర్పడిందని భావిస్తే నన్ను వదులుకోవాలని ములాయం సింగ్ ను కోరతాను. నన్ను పార్టీ నుంచి బయటకు పంపించమని చెబుతాన’ని అమర్ సింగ్ ఆవేదనతో అన్నారు.
కాగా, ఆదివారం లక్నోలో జరిగిన సమాజ్ వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సదస్సు సందర్భంగా అమర్ సింగ్ పై కార్యకర్తలు మండిపడ్డారు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.