నైజీరియన్లతో మాకు తలనొప్పే: సీఎం
పర్యాటకులకు స్వర్గధామమైన గోవాలో నైజీరియన్ల ఆగడాలకు అంతులేకుండా పోతోందని, వాళ్ల వ్యవహారం తమకు భలే తలనొప్పిగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ అన్నారు. నిజానికి తమ రాష్ట్రానికి చాలా దేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారని, అయితే కేవలం నైజీరియన్ల ప్రవర్తనతో మాత్రమే గోవా వాసులు బాగా ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. చాలా సందర్భాల్లో నైజీరియన్ల మీద ఫిర్యాదులు తన దాకా కూడా వచ్చాయని తెలిపారు. గోవా వాసులు మాత్రం వీళ్లతో అసలు ఏమాత్రం సంతోషంగా లేరని.. కేవలం వీళ్ల మీద మాత్రమే గోవన్లు ఫిర్యాదులు చేస్తున్నారని ఆయన అన్నారు. నైజీరియన్ల ప్రవర్తన, వాళ్ల జీవనశైలి.. ఇలా ప్రతి అంశంతోనూ గోవా ప్రజలు విసుగెత్తిపోయారని చెప్పారు.
పనజికి 20 కిలోమీటర్ల దూరంలోని అసాగో అనే గ్రామంలో 30 ఏళ్ల మహిళపై అత్యాచారం చేసిన కేసులో ఓ నైజీరియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను అందరినీ ఒకే గాటన కట్టను గానీ, నైజీరియన్లతో మాత్రం గోవా వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారని సీఎం అన్నారు. వీళ్లు కావాలని ఏదో ఒక నేరం చేసి, కేసులు పెట్టించుకుని ఎక్కువ కాలం ఇండియాలో ఉండిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని.. వీళ్ల ఆటలు కొనసాగకుండా త్వరగా డిపోర్ట్ చేసేయాలని గోవా పర్యాటక శాఖ మంత్రి దిలీప్ పరులేకర్ అంతకుముందు వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకుముందు స్థానిక డ్రగ్స్ వ్యాపారులు ఓ నైజీరియన్‌ను చంపేశారని, దానిపై పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ 2013 అక్టోబర్ నెలలో సుమారు 50 మంది నైజీరియన్లు గోవాలో 17వ నెంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు.