పాత్రికేయ మేరువు కుష్వంత్
నివాళి
లౌకికవాదాన్నీ, జర్నలిజం ప్రమాణాలనూ, ప్రజాస్వామ్య విలువలనూ కుష్వంత్‌సింగ్ సమర్థించిన తీరు అనితరసాధ్యం. పత్రికారంగాన్నీ, సాహిత్య లోకాన్నీ ప్రబలంగా ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి అస్తమయంతో ఒక శకం ముగిసింది.
జీవితాన్ని ఎట్లా ప్రేమిం చాలో, ఎట్లా జీవించాలో, ఎట్లా అనుభవించాలో, ఎట్లా నియంత్రించాలో, వయస్సుకు తగినట్టు ఎట్లా మలచుకోవాలో ఆచరించి చూపించిన స్థితప్రజ్ఞుడు కుష్వంత్‌సింగ్. ఆయన ఎంత హాయిగా, ఉన్నతంగా, కల్లాకపటం లేకుండా, నిజాయితీగా, నిర్భీతిగా బతికాడో అంతే అనాయాసంగా ఈ లోకం విడిచి వెళ్లిపోయాడు. కుష్వం త్‌సింగ్‌ను పోలిన వ్యక్తి మరొకరు లేరు. అం తటి బహుముఖీనమైన వ్యక్తిత్వం మరొకటి గతంలో కానీ వర్తమానంలో కానీ కనిపిం చదు. మెదడు కంటే మనసు చెప్పినట్టు నడుచుకున్న మనిషి. చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. అనర్హులకు యోగ్యతాపత్రాలు ఇచ్చారు. అన్యాయాన్ని సమర్థించారు. తప్పిదాలను గ్రహించిన ప్రతిసారీ ధైర్యంగా ఒప్పుకున్నారు. జయాపజయాలను సమానంగా స్వీకరించారు. పట్టుదల వస్తే ఎంతటికైనా తెగించే మనస్తత్వం ఆయనది. ఎదుటివారు ఎంతటి వారైనా సంకోచించకుండా మనసుకు తోచిన మాటచెప్పడం, బుర్రకు తోచిన విమ ర్శ మొహమాటం లేకుండా చేయడం ఆయన ప్రత్యేకత. కుష్వంత్ తన సుదీర్ఘ జీవితంలో తీసుకున్న నిర్ణయాలలో అసమంజసమైనవీ, అర్థం లేనివీ చాలా ఉన్నాయి. అత్యయిక పరిస్థితిని సమర్థించడం, సంజయ్ గాంధీని వెనకేసుకురావడం, ఇందిరాగాంధీ అభీష్టానికి వ్యతిరేకంగా సంజయ్ భార్య మేన కా గాంధీని అభిమానించడం, ఆమెకు జర్నలిజంలో మార్గదర్శనం చేయబూనడం వంటి అనేక పనులు ముందుగా ఆలోచించి, లాభనష్టాలను బేరీజు వేసుకొని, మంచిచెడులను పరిశీలించి చేసినవి కావు. ఏ నిర్ణయం తీసుకున్నా దానిని నిస్సంకోచంగా అమలు చేయడం కుష్వంత్‌సింగ్ చిత్తశుద్ధికి నిదర్శనం. పత్రికలపైన సెన్సార్‌షిప్‌ను విధించినందుకు ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టినప్పుడూ, పంజాబ్‌లో తీవ్రవాదానికి ప్రతీకగా నిలిచిన భింద్రన్‌వాలే ను ఎండగట్టినప్పుడూ, స్వర్ణదేవాలయంలో సైనికులు ప్రవేశించడం పట్ల నిరసనగా పద్మభూషణ్ పురస్కారాన్ని వాపసు చేసినప్పుడూ కుష్వంత్‌సింగ్‌లోని నిబద్ధత కొట్టవచ్చినట్టు కనిపించింది.
కుష్వంత్‌సింగ్ ఇంగ్లిష్ పత్రికా లోకానికీ, పాఠక లోకానికీ ఒక ఉత్తేజకరమైన జ్ఞాపకంగా నిలిచిపోతాడు. పత్రికా రచయితగా, నవలా రచయితగా, హాస్య రచయితగా ఆయనంటే పడిచచ్చే మూడు తరాల అభిమానుల జీవితాలలో ఆయన విడదీయలేని భాగం. ఇంగ్లిష్ వచనాన్ని ఎంత సులభగ్రాహ్యంగా, ఎంత అందంగా, ఎంత రసమయంగా, ఎంత సూటిగా రాయవచ్చునో కుష్వంత్ రచనలు చదివిన వారికి అనుభవైకవేద్యం. తాము కుష్వంత్ శిష్యులమంటూ ప్రముఖ సంపాదకుడు ఎంజె అక్బర్ వంటి వ్యక్తులు సగర్వంగా చాటుకుంటారు. ఇంగ్లిష్‌లో తాము చేసిన రచనల ప్రమాణాలను కుష్వంత్‌సింగ్ మెచ్చుకుంటూ తన కాలమ్‌లో ఒకవాక్యం రాస్తే దాన్ని ఎంతో విలువైన యోగ్యతా పత్రం గా భావించి పదిలపరుచుకునే మణిశంకర్ అయ్యర్ వంటి సమర్థులైన రచయితలు అనేక మంది.
పీవీ నరసింహారావు రచించిన ఆత్మ కథాత్మక నవల ‘ఇన్‌సైడర్’ చప్పగా ఉందంటూ చప్పరించినా, ఒక పాఠకుడు పంపిన జోక్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తూ పాఠకులకు సిఫార్సు చేసినా కుష్వంత్ తీర్పును ప్రశ్నించే సాహసం ఎవ్వరూ చేయరు. ‘మ్యాలిస్ టువర్డ్స్ ఒన్ అండ్ ఆల్’ అనే శీర్షికతో కాలమ్‌ను అత్యద్భుతంగా అనేక సంవత్సరాలు రక్తికట్టించిన పెద్ద మనిషి మనసులో ఎవరిపట్లా ద్వేషభావం లేదు. తోటివారిని ప్రేమించే స్వభావం, మంచిని మెచ్చుకుంటూ చెడును చీదరించుకునే మనస్తత్వం ఆయనది. తన శృంగార జీవితంపై రాసిన రచనలలో వాస్తవం కంటే కల్పితమే అధికం. స్త్రీలతో తన సంబంధాల గురించి చెప్పిన విషయాలలో ఊహాజనితాలే ఎక్కువ. జీవితాన్ని గానుగ ఎద్దులాగా కాకుండా సృజనాత్మకంగా, రసభరితంగా, ఆహ్లాదకరంగా ఎట్లా జీవించవచ్చునో హృదయాలకు హత్తుకునే విధంగా చెప్పడానికి కొన్ని కట్టుకథలు చెప్పినా తప్పులేదనే ధోరణి ఆయనది. తన మీద తానే జోకులు వేసుకోవడం, సర్దార్‌జీల జోకులను పనికట్టుకొని వ్యాప్తిలోకి తేవడం, హాస్యానికీ, శృంగారానికీ పెద్దపీట వేయడం ఒక ఎత్తు అయితే, ‘ట్రైన్ టు పాకిస్థాన్’ వంటి యథార్థ రచనలు చేయడం, సిక్కుల చరిత్ర వంటి అధ్యయన గ్రంథం రచించడం మరో ఎత్తు. ఉర్దూ కవిత్వం పట్ల కుష్వంత్ సింగ్‌కు అపారమైన ప్రేమ.
సందర్భం వచ్చినప్పుడల్లా గాలిబ్‌నో, ఇక్బాల్‌నో ఉటంకించడం ద్వారా తన రచనలను సంపన్నం చేశారు. సొంత రచనలు చేయడంతోపాటు పంజాబీ నుంచి ఇంగ్లిష్ లోకి అనువాదాలు చేశారు. కుష్వంత్ వెలువరించిన పుస్తకాల శీర్షికలు కూడా ఆకర్షణీయంగా, కొండొకచో తుంట రిగా ఉంటాయి. ‘ద కంపెనీ ఆఫ్ విమెన్’, ‘ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మ్యాలిస్’ వంటి శీర్షికలు ఈ కోవలోనివే.
సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట జర్నలిజం విద్యార్థిగా బొంబాయి వెళ్లినప్పుడు కుష్వంత్‌ను కలుసుకున్నాను. మీ రాష్ట్రంలో అన్ని వార్తలు ఉంటే ఇక్కడికి ఎందుకు వచ్చారంటూ మమ్మల్ని ప్రశ్నించారు. అప్పుడు ‘జై ఆంధ్రా’ ఉద్యమం పతాకస్థాయిలో నడుస్తోం ది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కుష్వంత్ సింగ్ అంటే ప్రాణం. ఆయన రచనాశైలి చా లా ఇష్టం. లౌకికవాదాన్నీ, జర్నలిజం ప్రమాణాలనూ, ప్రజాస్వామ్య విలువలనూ ఆయన సమర్థించిన తీరు అనితరసాధ్యం. పత్రికారంగాన్నీ, సాహిత్య లోకాన్నీ ప్రబలంగా ప్రభావితం చేసిన అరుదైన వ్యక్తి కుష్వంత్‌సింగ్ అస్తమయంతో ఒక శకం ముగిసింది.
కె. రామచంద్ర మూర్తి (వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)