ఇంటింటికొస్తుంది... హింసపాదు!
బమ్మిడి కథల్లో....వెన్నెల్లో ఆడుకునే పిల్లలూ వాళ్ల కమ్మని కథలూ ఉంటాయి. దట్టమైన చీకటి లోలోతుల్లోకి తీసుకెళ్లి వాస్తవాల వెలుగులను చూపించే కథలూ ఉంటాయి. మావనసంబంధాల్లో పూడ్చలేని అగాథాలు, వైరుధ్యాలు, లైంగిక దోపిడి, లైంగిక హింస, రాజ్యహింసలను ఆయన కథలు బలంగా పట్టి చూపుతాయి.
పుస్తకాన్ని చేతిలో తీసుకున్నప్పుడు- ‘ఇవి ఉత్తరాంధ్ర కథలు’ అనిపిస్తుంది. పుస్తకం తిరిగేసిన తరువాత ‘కానే కాదు’ అనిపిస్తుంది. ఎందుకంటే, ఊరు మారుతుంది, ఆ ఊళ్లో పాత్ర పేరు మారుతుంది... కానీ సమస్య వేరు మాత్రం అన్నిచోట్ల ఒక్కటే అవుతుంది. ‘దూరానికి దగ్గరగా’ కథలో ఉన్న అప్పలమ్మ వరంగల్‌లోనూ ఉంది. పేరు వేరై ఉండొచ్చు. ‘‘ఇంజనీర్లయితే ఇంజన్ల నీరు పోస్తారని గదరా?’’ అని ‘సున్నా’ కథలో అమాయకంగా అడిగిన గంగమ్మలు కరీనగర్‌లోనూ ఉండొచ్చు. రాజ్యహింసకు సంబంధించిన కథల్లో అయితే ఈ హద్దులు పూర్తిగా చెదిరిపోయి ‘ఏడనైనా ఒకటే’ అనే భావనకు గురిచేస్తాయి. విధ్వంసకర విషయాల గురించి చేసే సైద్ధాంతిక చర్చ పరిమిత సమూహాలకు మాత్రమే పరిమితం కావచ్చు. కానీ అది కథారూపం తీసుకుంటే దాని పరిధి విస్తృతం అవుతుంది. తన కథల ద్వారా బమ్మిడి ఈ పనిని సమర్థవంతంగా చేశాడు. సామ్రాజ్యవాద సంస్కృతి, పరాయికరణ, సాంకేతికత సృష్టించిన మనోవిధ్వంసం, హింసోన్మాదం... ఇలా ఎన్నో విషయాలను తన కథల ద్వారా ప్రతిఫలించాడు.
రచయిత ఒకచోట అంటాడు- ‘‘ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయి? తర్కించుకున్నాను. ప్రశ్నించుకున్నాను. జవాబులు వెదుక్కున్నాను. బోధపరుచుకున్నాను’’. పుస్తకం పూర్తి చేసిన తరువాత మనం కూడా తర్కించుకుంటాం. ప్రశ్నించుకుంటాం. బోధపరుచుకుంటాం. ఈ కథల్లో ‘సిక్కోలు’ మాత్రమే కనిపించదు. అన్ని ప్రాంతాలు ఒక సార్వజనీనమైన సత్యమై కదలాడుతుంటాయి.
యాకుబ్ పాషా యం.డి.
హింసపాదు(కథలు); రచన: బమ్మిడి జగదీశ్వరరావు
పేజీలు: 290; వెల: 180
ప్రతులకు: సిక్కోలు బుక్ ట్రస్ట్, ఎంఐజి 100.
హౌసింగ్ బోర్డు కాలనీ, జిల్లా పరిషత్ ఎదురుగా, శ్రీకాకుళం-532001; ఫోన్: 99892 65444