తెలంగాణ జీవధాతువు
పొడి మట్టితో మట్టిపాత్ర తయారుచేయడం లాంటిదే రచన కూడా! ఆ ప్రాంతపు మట్టిని అక్కడి నీటితోనే కలిపి అద్భుతంగా కుండ తయారుచేస్తారు పనితనం గలవారు. అలాంటి పనితనం గల నవలారచయిత దాశరథి రంగాచార్య. ఇక్కడి మట్టితో ఆయన సృష్టించిన మొదటి సాహిత్య భాండం ‘చిల్లర దేవుళ్లు’. ఆయన నవలలన్నింటిలో తెలంగాణ మట్టి వాసన ఉంటుంది. సామాన్య జనుల ఉఛ్వాస నిశ్వాసాలుంటాయి. జీవన గతులూ శ్రుతులూ ఉంటాయి. కల్పనలే కాని, నిజాలుంటాయి. నిజాలే కానీ, కొంత అనుభవం రంగరించి ఉంటాయి. తెలంగాణ పోరాటం కేంద్ర బిందువుగా ఎదిగి, వ్యాపించి, తృష్ణతో, అభిలాషతో చుట్టూ సాహిత్య వ్యాసాన్ని గీసుకున్న రచయిత ఆయన. ఈ గుండ్రటి వ్యాసం విశాల విశ్వానికి సంకేతం. చెప్పింది ఒక ప్రాంతపు చరిత్రే అయినా, అందులో విశ్వమానవ జన సంఘర్షణలూ, సామాజిక జీవన స్థితిగతులూ చోటు చేసుకున్నాయి.
రాసింది తెలంగాణ గురించే అయినా, ఫ్యూడల్ వ్యవస్థ ఎలా ఉంటుందో, అంతకన్నా నికృష్టమైన జాగిర్దారీ వ్యవస్థ ఎలా ఉంటుందో, ఆ తరువాత ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఎంత దిగజారిపోయామో సామాజికంగా తెలియజేశారు తప్ప, ఆయన తన నవలల్లో ఏ ఒక్క సిద్ధాంతాన్నో చొప్పించడానికి ప్రయత్నించలేదు. అయితే అన్నింట్లో అభ్యుదయకరమైన అంశాలు తప్పకుండా ఉన్నాయి. ఆయన వామపక్షవాదని, ప్రజాపక్షపాతని, ఆశావాది అని స్పష్టంగా చెబుతాయి. రచన ఉద్యమానికి ఊపునిస్తుంది తప్ప, రచనే ఉద్యమాన్ని సృష్టించదు. ఏ రచనైనా ఉన్నఫళాన సమాజాన్ని మార్చేసిన దాఖలాలు చరిత్రలో ఎక్కడా లేవు. అక్టోబర్ విప్లవానికి లెనిన్ కారకుడయ్యాడు కాని, గోర్కీ కాలేడు. అందువల్ల రంగాచార్య విప్లవోన్ముఖుడై నవలలు రాయలేదు. అంతర్ముఖుడై అంతరంగ మథనాన్ని వినిపించారు. అభ్యుదయ కాముకుడై నిజమైన అనుభవాల్ని నిజాయితీగా అక్షరబద్ధం చేశారు.
‘చిల్లర దేవుళ్ల’కు ముందే తెలంగాణ ప్రజల భాషలో వట్టికోట ఆళ్వారుస్వామి నవలలొచ్చాయి. వెల్దుర్తి మాణిక్యరావు, సురమౌళి, గూడూరు సీతారాం, భాగి నారాయణమూర్తి మొదలైన రచయితల కథలొచ్చాయి. అయితే తెలంగాణ మాండలికంలో రాయాలన్న ప్రత్యేకమైన ఉద్దేశంలో ఆళ్వారుస్వామి నవలలు రాయలేదు. ఆయన సహజంగా మాట్లాడే భాషనే రచనకు వాడుకున్నారు. కాని, ‘చిల్లర దేవుళ్లు’ అలా వచ్చింది కాదు. తెలంగాణకు పరిమితమై కొన్ని ప్రత్యేకమైన సామాజిక స్థితిగతుల్ని తేటతెల్లం చేయడానికి, క్రూరమైన మత ప్రవర్తనను బట్టబయలు చేయడానికి రచయిత చేసిన ఒక తపస్సు. ఈ నవల తెలంగాణవారికి మాత్రమే కాక, తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి రాసింది కనుక, రచన వ్యవహారిక భాషలో ఉండగా పాత్రల సంభాషణ మాత్రం సొంపైన తెలంగాణ మాండలికంలో సాగుతుంది. తెలంగాణ ప్రజలు, వారి భాష, వారి యాసలో మాట్లాడేందుకు జంకుతున్న తరుణంలో ఆ భాషలోనే నవల రాయడానికి పూనుకోవడం గొప్ప సాహసం. అయితే కాలక్రమేణా తెలంగాణ ప్రాంతంలో మారుతూ వస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు, భాష... వీరు ఇతర నవలల్లో నమోదు చేస్తూ వచ్చారు. ‘మోదుగు పూలు’, ‘జనపదం’, ‘మాయ జలతారు’ వంటి పీరియాడిక్ నవలలు ఇందుకోసం పరిశీలించవచ్చు.
దాశరథి కృష్ణమాచార్య వీరి సోదరులు. సహజంగా ఆవేశపరుడు గనుక, ఆయన జీవితం ఆయనను కవిగా నిలబెట్టింది. దాశరథి రంగాచార్య జీవితం వేరు. ఆవేశపరుడైనా, నిదానం ఎక్కువ. జీవితంలోనూ, రచనలోనూ ‘హి ఈజ్ మోర్ ప్రాక్టికల్’. పసి ప్రాయంలోనే కుటుంబ భారాన్ని మోయడం, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా కుగ్రామాల్లో జన జీవితాన్ని అధ్యయనం చేయడం మొదలైనవాటితో ఆయనకు జీవితంలో సునిశిత పరిశీలన అబ్బింది. అందువల్ల ఈయనకు కవిత్వం పనికిరాలేదు. పీడిత తెలంగాణ జన జీవిత పరిధి పెద్దది. అందులోని కరకు నిజాల్ని వెల్లడించడానికి కవిత్వం కన్నా వచనమే సరైందని తేలింది. క్యాపిటలిస్టు సమాజంలో యాంత్రిక యుగంలో వచనానికి ప్రాధాన్యత ఉంటుందని గ్రహించిన ఆయన, నవలా ప్రక్రియను ఎన్నుకున్నారు. ఈ యుగం కవిత్వాన్ని కూడా వచనం చేసిన విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ఈ అనంత జీవన గమనంలో స్థలం, కాలం, కారణం ఎంతో విలువైనవి. బాహ్యంగా ఈ మూడు వేరువేరుగా అనిపించినా ఈ మూడింటికీ అంతర్గతంగా విడదీయరాని సంబంధం ఉంది. ప్రతి స్థలం కొన్ని చారిత్రాత్మక సంఘటనలకు చోటిస్తుంది. అయితే అవి కాలానికీ, కారణానికీ సంబంధం లేకుండా జరగవు. ఏ పోరాటమైనా, ఏ ఉద్యమమైనా ఈ మూడింటి కలయికే (స్పేసియో టెంపరేనియస్ క్యాజువాలిటీ). ఇదొక త్రిభుజం. ఇది తెలంగాణకు అన్వయిస్తే - నిజాం ప్రభువు ఆగడాలు భరించలేక పోవడమే ఇక్కడి బలీయమైన కారణం. రైతులు తిరగబడి, కాలానికి ఎదురొడ్డి, సాయుధంగా పోరాడటమే ఈ గడ్డమీద జరిగిన గొప్ప చారిత్రాత్మక ఘటన. మరొక త్రిభుజం కూడా ఉంది. నిజాం ఒక కోణం, బ్రిటీష్ ప్రభుత్వం మరొక కోణం. ఈ రెండింటి మధ్య ఘర్షించిన మూడో కోణం (త్రిలింగ) ప్రజలు. ఈ ప్రజల్లో ఒకరైన ఈ రచయిత, వ్యక్తిగా కొన్ని బాధ్యతలు నిర్వహించారు. అందువల్ల ఆ తర్వాత రచయితగా ఆనాటి స్థల, కాల, కారణాలకు ఒక రూపం ఇవ్వగలిగారు.
తెలంగాణ జీవితంపై దాశరథి రంగాచార్య నవలలు, ఇంకా మరికొందరి కొద్ది నవలలు తప్ప రాలేదు. ఇక రావేమో కూడా! తరం తర్వాత తరం మారిపోతున్నది. ప్రజలు పాత గాయాలు, పోరాటాలు మరిచిపోతున్నారు. వాటి స్థానంలో కొత్త గాయాలు, కొత్త పోరాటాలు చోటుచేసుకుంటున్నాయి. రోజురోజుకీ సంక్లిష్టమైపోతున్న జీవన విధానంలో వచ్చిన ఈ వేగం... గతాన్ని మరిచిపోవడంలో కూడా వేగాన్ని పెంచింది. ఎంతోమంది కవులూ కళాకారులూ ఈ వేగంలో కొట్టుకుపోతున్నప్పటికీ, అతికొద్ది మంది మాత్రం మైలురాళ్లలా నిలబడతారు. తెలంగాణ సాహిత్య ప్రపంచంలో నవలా రచయిత దాశరథి రంగాచార్య ఒక మైలురాయి! విశ్వ సాహిత్యంలోని ఒక మాగ్జిమ్ గోర్కీ, ఒక ప్రేమ్ చంద్, ఒక సాదత్ హసన్ మంటోల స్థాయిని తెలుగు నుండి, తెలంగాణ నుండి ఎవరైనా అందుకోగలిగారంటే నిస్సందేహంగా అది దాశరథి రంగాచార్యే!
దాశరథి రంగాచార్య జీవితం వేరు.
ఆవేశపరుడైనా, నిదానం ఎక్కువ. జీవితంలోనూ,
రచనలోనూ ‘ హి ఈజ్ మోర్ ప్రాక్టికల్’.
అందువల్ల కవిత్వం పనికిరాలేదు. పీడిత తెలంగాణ
జన జీవిత పరిధి పెద్దది. అందులోని కరకు నిజాల్ని
వెల్లడించడానికి కవిత్వం కన్నా వచనమే సరైందని తేలింది.