ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో.....
పాట వెనుక కథ
ఆ చల్లని సముద్ర గర్భందాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో...
భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో కులమతాల సుడిగుండాలకు బలి కాని పవిత్రులెందరో... ఆ చల్లని
మానవ కల్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో రణరక్కసి కరాళనృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపుకోతతో అల్లాడినకన్నులలో విషాదమెంతో ఉన్మాదుల అకృత్యాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో... ఆ చల్లని
అన్నార్తులు అనాధులుండని ఆ నవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెపుడో పసిపాపల నిదుర కనులలో మురిసిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలల రాయబడని కావ్యాలెన్నో... ఆ చల్లని
ఇటీవలి కాలంలో ఎంతో ప్రాముఖ్యం పొంది అనేక వేదికల మీద వినిపిస్తున్న ఈ పాటను దాశరథి రాసి 65 సంవత్సరాలు అవుతోంది. ఇది 1949లో ముద్రితమైన ‘అగ్నిధార’లో ఉంది. ‘భరతావని బలిపరాక్రమం చెరవీడేదింకెన్నాళ్లకో’ అని రాశాడంటే 1947కు ముందే రాశాడేమో అనుకోవాల్సి వస్తోంది. కాని ఆయన జీవించి ఉండగా బహుశా ఒక్కసారి కూడా ఆ పాటను విని ఉండరు. ఎందుకంటే ఆయన 1987 నవంబరులో చనిపోయారు. నాకు తెలిసి అప్పటికి ఆ పాటకు బాణీ కట్టి వేదికల మీద పాడటమన్నది మొదలుకాలేదు. నాకు జ్ఞాపకమున్న మేరకు పూర్తి రాగయుక్తంగా మొదటిసారి విన్నది 1991 కర్నూలు ఉపఎన్నికలో పి.వి.కి వ్యతిరేకంగా మండ్ల సుబ్బారెడ్డి అనే విప్లవ కమ్యూనిస్టు అభ్యర్థికి మద్దతుగా జరుగుతున్న సభలో అరుణోదయ రామారావు పాడిన సందర్భంలో. అంటే 23 సంవత్సరాల క్రితం అన్నమాట.
దాశరథి ఆ పాటకు శీర్షికగా ప్రశ్నార్థకాన్ని (?) ఇచ్చారు. పలు ప్రశ్నల ద్వారా ఆలోచింపజేసే శైలిని ఆయన ఆ పాటంతా అనుసరించారు కనుక శీర్షికను కూడా అలానే ఉంచారు. ఆయన 7 చరణాలుగా ఈ పాటను రాస్తే గాయకులు ఒక పల్లవి మూడు చరణాలుగా విభజించుకుని పాడుతున్నరు. ప్రతి చరణం మధ్యలో మూడవ కాలంలో ఎత్తుకునే ఆలాపనతో ఆరోహణ అవరోహణల ఆవృతాన్ని పూర్తి చేసుకుని పాడిన పాదాలను మళ్లీ ఎత్తుకోవటం ద్వారా శ్రోతలను ఆ పాట బలంగా ఆకట్టుకుంటుంది.
దాశరథి రాసిన పాటను యథాతథంగా కాకుండా కొన్ని మార్పులు చేసుకుని గాయకులు పాడటం మనం చూస్తున్నాం. 28 పంక్తుల అసలు పాటలు ఒక 8 పంక్తులను మార్చడం మనం గమనించవచ్చు. దాశరథి ‘కానరాని భానువులెందరో’ అని రాస్తే గాయకులు ‘భాస్కరులెందరో’ అని పాడుతున్నారు. అలాగే భూగోళం పుట్టుక కోసం ‘కూలిన’ సురగోళాలెన్నో అని దాశరథి రాస్తే ప్రజాగాయకులు ‘రాలిన’ అని పాడుతున్నారు. ఇంకొక వివరణ. ‘అన్నార్తులు అనాథలుండని’ అని మా గాయకులు పాడుతుండగా ‘అనాధులు’ అని పాడేట్టు నేను మార్పు చేయించాను. రెండింటికీ నిఘంటువుల అర్థం ఒకటే కావచ్చుకానీ వ్యవహారంలో ‘అనాథ’ అంటే భర్తను కోల్పోయిన స్త్రీ అనీ ‘అనాధులు’ అంటే దిక్కు మొక్కులేని వారనే భావన ఉన్నది కనుక ‘అనాధులు’ అని పాడమన్నాను. అలాగే ‘కులమతాల సుడిగుండాలకు బలికాని పవిత్రులెందరో’ అనే దాంట్లో సుడిగుండాలు ఎదుర్కొని నిలిచినవారి పట్ల గౌరవం పెరిగేట్లు దాశరథి రాస్తే ఆ సుడిగుండాలు ఎందరు పవిత్రులను బలిగొన్నాయో గదా అని భావించిన వారు కూడా ఉన్నారు.
వినడానికి ఎంతో సాధారణీకరించిన పాటలాగా ఇది అనిపించినా అది చరిత్ర, వర్తమానాల ప్రత్యేక స్థితిగతులను సాధారణీకరించినది గనుక కాలాతీతంగా అది అజరామరంగా జీవించి ఉంటుంది. కవిని కూడా కలకాలం బతికిస్తూ చిరంజీవిని చేస్తోంది.
- దివికుమార్ 94401 67891