తెలంగాణ అక్షరసేన | Today is the centenary of kaloji | Sakshi
Sakshi News home page

తెలంగాణ అక్షరసేన

Published Tue, Sep 9 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 1:04 PM

తెలంగాణ అక్షరసేన

తెలంగాణ అక్షరసేన

 నేడు కాళోజీ శతజయంతి

కాళోజీ కవిత్వానికి సహజమైన నిర్వచనం ఇచ్చాడు. ‘‘ఎద మెదడుల కలయికతో పదం పదం కదం తొక్కి -ఆవేశము, ఆలోచన అద్వైత స్థాయి వెలయ కైతేర్పడు’’ అని కాళోజీ నిర్వచనం. కనుకనే కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం. ప్రజల జీవితం ప్రజల శిల్పం అతని కవిత్వానికి జీవం.
 
కాళోజీ సైద్ధాంతికంగా ఉదారవాద ప్రజాస్వామ్యవాది. వ్యక్తి స్వేచ్ఛను కోరు కునే సాహిత్యజీవి. నిరంకుశత్వాన్ని ధిక్కరిస్తాడు. భిన్నత్వాన్ని గౌరవిస్తాడు. మానవీయ సమాజాన్ని కోరుకుంటాడు. నిర్బంధాన్ని ప్రయోగించే రాజ్యాన్ని వ్యతిరేకించాడు. ఓటు వేస్తే చేయి నరుకుతామని నక్సలైట్ల పేరుతో పోలీసులు ప్రకటిస్తే నిజంగా నక్సలైట్లే ప్రకటించారేమోనని భ్రమపడి ‘‘నేను ఓటు వేసి వచ్చాను-నా వేలు నరకండని’’ అడిగాడు.  భారతదేశం లాంటి సమాజాలలో చాలా అరుదుగా ఇలాంటి వ్యక్తులు కనిపిస్తారు. రాజ్యంలో కవి ప్రతిక్ష పాత్ర పోషించాలనే స్పష్టత కాళోజీకి తాను జీవించిన కాలమే ఇచ్చింది.

1914లో పుట్టిన కాళోజీ 1930లో ఆంధ్ర మహాసభ ఏర్పడే నాటికి కౌమారంలో ఉన్నాడు. 1938లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పడే నాటికి నిం డు యవ్వనంలో ఉన్నాడు. 1946 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమయ్యే కాలానికి స్పష్టమైన రాజకీయ కార్యాచరణ లోకి వచ్చాడు. కాళోజీ నడిచిన కాలమంతా ప్రపంచం రెండు యుద్ధాల నడుమ ఉంది. ప్రపంచానికి ప్రత్యామ్నాయ వెలుగునిచ్చిన రష్యా విప్లవం (1917), ఆర్థిక మాంద్యం (1929-30), స్పెయిన్ అంతర్యు ద్ధం (1936), చైనాపై అరుణతార (1949) మొదలైన ప్రపంచ ప్రగతి శీల పరిణామాలన్నీ కాళోజీని ప్రభావితం చేశాయి. విశ్వసాహిత్య అధ్య యనం వల్ల ఫ్రెంచ్ తత్వవేత్తల వలె స్పందించే గుణం ఏర్పడింది.

కాళోజీ చుట్టూ ఉండే వాతావరణం కూడా అతణ్ని ప్రజాస్వామ్యవాదిగా మార్చింది. తన కుటుంబంలో తల్లి మరాఠి, కన్నడం మాట్లాడేది. తండ్రి ఉర్దూ, హిందీ మాట్లాడేవాడు. ఫలితంగా కాళోజీకి మరాఠి, ఉర్దూ, హిందీ, తెలుగు మాట్లాడటం, రాయటం వచ్చు. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన కుటుంబం నుంచి వచ్చింది. బాల్యంలోనే స్వేచ్ఛ భావన ఏర్పడటానికి కుటుంబం నేపథ్యంగా పనిచేసింది. కాళోజీ ప్రజాస్వామిక దృక్పథాన్ని తల్లి నుంచి నేర్చుకొని ఉండాలి? ఇక తన చుట్టూ వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి కృష్ణమాచార్యులు, ఆర్యసమాజ్ భావజాలం, ఆంధ్ర మహాసభ రాజకీయ కార్యాచరణ ఉండటం వలన రాజ్యాధికార స్వభావం జీవితంలోనూ, కవిత్వంలోనూ ఉండటానికి కారణమయ్యాయి. ఆంధ్రమహాసభలో జరిగిన సైద్ధాంతిక చర్చనంతటినీ దగ్గరుండి చూశాడు. అందువలన కూడా ‘‘నూరు పూలు వికసించాలి. వేయి ఆలోచనలు సంఘర్షించాలనే’’ విశాలత్వం తన వ్యక్తితంలో భాగమైంది. అందుకే కాళోజీ బూర్జువా పార్టీ నాయకుడైన పి.వి.నరసింహారావుతో స్నేహం ఉండటం, విప్లవ రచయితలతో కలిసి నడవటం చేయగలిగాడు. దాశరథి లాంటి కవులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థాన కవులుగా ఉంటే, కాళోజీ  ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను జీవితాంతం ఎండగట్టాడు. ఈ నేపథ్యం నుంచి కాళోజీ కవిత్వాన్ని పరిశీలిస్తే చాలా స్పష్టంగా అతని కవిత్వంలో ప్రజాస్వామిక లక్షణం కనిపిస్తుంది. ఆయన మొత్తం 510 కవితలు రాశాడు. అందులో కేవలం ప్రజాస్వామ్యం ఇతివృత్తంగా 50 కవితలు రాశాడు. ప్రజాస్వామ్యం పేరుతో ఇవాళ ధనస్వామ్యం, భూస్వామ్యం రాజ్యమేలుతు న్నాయి. కాని కాళోజీ నారాయణరావు భావనలో ప్రజాస్వామ్యం అంటే ప్రజారాజ్యం, శాసనస బద్ధ వ్యవస్థ. కవితా రచనలోకి కూడా కాళోజీ ప్రజాస్వామ్య స్వభావాన్నీ - నిర్మాణాన్నీ ప్రవేశపెట్టాడు. భాషలో, భావంలో, నిర్మాణంలో ఆడంబరం లేని కవిత్వం కాళోజీది. అతని కవిత్వానికి సాయగ్రి ప్రజల సజీవ భావన. ఉత్పత్తి వర్గాల భాష, తెలంగాణ నుడి, నానుడులు, మాండలికాలు అతని కవిత్వంలో సహజంగా ఇమిడిపోతాయి. అందుకే ‘‘కవిత్వం అంటే పద్యం అనే భ్రమను పోగొట్టిన వారిలో శ్రీశ్రీ... పాటు నీవొకడవు. వీళ్ల రచనల్లో శబ్దాడంబరం కనిపిస్తుందేమోకాని నీలో అదిలేదు’’ (నా గొడవకు ముందుమాట - 1967) అని దాశరథి కృష్ణమాచార్యులు యోగ్యతాపత్రం ఇచ్చాడు. సాహిత్యంలో అలంకారికుల నుంచి నేటి విమర్శకుల వరకు వస్తు రూపాలలో ఏది ముఖ్యం అనే చర్చ జరుగుతూనే ఉంది. కాని కాళోజీ కవిత్వంలో త్రిపురనేని మధుసూదనరావు అన్నట్లు వస్తువే రూపాన్ని ఎన్నుకున్నది. కాళోజీ కవిత్వంలో రూపవైవిధ్యం నిండుగా ఉంటుంది. అధిక్షేపం అతని కవితా రూపం. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించి నిజాంను పొగిడిన రాయప్రోలు సుబ్బారావు (ఉస్మానియా యూనివర్సిటీ తెలుగుశాఖ మొదటి అధ్యక్షుడు) ఉద్దేశించి ‘‘లే మావి చివురులను లెస్సగా మేసేవు / రుతురాజు వచ్చెనని అతి సంభ్రము తోడ / మావి కొమ్మల మీద మైమరచి పాడేవు / తిన్న తిండెవ్వానిదే కోకిలా / పాడు పాటే వ్వానిదే కోకిలా’’ అని ఉగాది కవి సమ్మేళనంలో అధిక్షేపించాడు. ‘కుప్పకావలి’ లాంటి జాతీయంతో ‘కంచె చేను మేయటం’ అనే రొటీన్ సామెతను మైమరపించాడు. ప్రజా కవి వేమన తన కవిత్వంలో మొదటి పాదంలో ఒక ఊహను ప్రతిపాదిస్తాడు. రెండో పాదంలో వైరుధ్యాన్ని సృష్టిస్తాడు. మూడో పాదంలో సూచన చేస్తాడు. ఇదే లక్షణం కాళోజీ కవిత్వంలో కూడా ఉంటుంది. అందుకే విమర్శకులు కవిత్వంలో పదును కారణంగా కాళోజీకి వేమనతో పోలిక, ప్రజల భాషను కవిత్వంగా మలచి మౌఖిక గేయ లక్షణాన్ని ఉపయోగించటంలో గురజాడకు పోలిక అంటారు. సాహిత్యంలో ప్రతి కవి కవిత్వానికి నిర్వచనం ఇవ్వటాన్ని మనం చూస్తాం. కాళోజీ కవిత్వానికి సహజమైన నిర్వచనం ఇచ్చాడు. ‘‘ఎద మెదడుల కలయికతో పదం పదం కదం తొక్కి -ఆవేశము, ఆలోచన అద్వైత స్థాయి వెలయ కైతేర్పడు’’ అని కాళోజీ నిర్వచనం. కనుకనే కాళోజీది కమ్యూనికేటివ్ కవిత్వం. ప్రజల జీవితం ప్రజల శిల్పం అతని కవిత్వానికి జీవం. ఆయన భాషను రెండు విధాలుగా వర్గీకరించాడు. బడి పలుకుల భాష, పలుకుబళ్ల భాష.
 కాళోజీని తీవ్రంగా స్పందింపజేసినది బైరాన్‌పల్లి ఘటన. ఈ ఊళ్లో ఒకే రోజున 90 మందిని రజాకార్లు కాల్చి చంపారు. అపుడు కాళోజీ ‘‘మన కొంపలార్చిన మన స్త్రీల చెరిచిన / మన పిల్లలను చంపి మనల బంధించిన / మానవాధములను మండలాధీశులను / మరచిపోకుండా గుర్తుంచుకోవాలి / కసి ఆరిపోకుండా బుసకొట్టుచుండాలె / కాలంబు రాగానే కాటేసి తీరాలి’’. హింసా హింస చర్చను పక్కనపెట్టి దుర్మార్గులను శిక్షించేవాడే నాకు ఆరాధ్యుడనే ప్రజాస్వామిక దృక్పథాన్ని కాళోజీ ఈ కవితలో వ్యక్తం చేశాడు. అన్యాయాన్ని ఎదిరిస్తేనే తన గొడవకు సంతృప్తి, ముక్తి ప్రాప్తి అనుభవించాడే కాని, స్వర్గం కోసం వెంపర్లాడలేదు. ‘అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒక చోట ఉన్నప్పుడు ఉగ్రనర్సింహాలు ఉండాల్సిందేన’ని అతని నిశ్చితాభిప్రాయం.

కాళోజీ కవిత్వంలో - ఆలోచనలలో గతితార్కిక గుణం ఉంటుంది. 1956లో తెలుగు ప్రజలందరూ ఒకే గొడుగు కిందకి రావాలని విశాలాంధ్రకు మద్దతు పలికాడు. కాని చేసుకున్న ఒప్పందాలన్నీ తుంగలో తొక్కడం వలన 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికాడు. ‘‘వానాకాలంలోను చేనులెండిపోతాయని / మండే వేసవిలో వలె ఎండలు కాస్తుంటాయని ఎవరనుకొన్నారు? ఇట్లేనని ఎవరనుకున్నారు’’ అని తన ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇక్కడి నుంచి మొదలు అమరుడయ్యే వరకు ప్రత్యేక - ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ఆరాట పడ్డాడు. 1997 డిసెంబర్‌లో ప్రజా సంఘాలు నిర్వహించిన బహిరంగ సభలో రెండు లక్షల మంది సమక్షంలో ‘వరంగల్ డిక్లరేషన్’ ప్రకటించాడు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన క్షణాలకు సాక్ష్యంగా నిలిచాడు. మనిషితనం మనస్సంతా నింపుకున్న కాళోజీని గుర్తు చేసుకోవటమంటే తోటి మనిషి ప్రజాస్వామిక విలువలను హక్కులను కాపాడటానికి త్యాగానికైనా సిద్ధపడటమే. కాళోజీ స్వభావాన్ని తెలంగాణ సమాజానికి సంతరింపచేయటమే మనం ఆయనకిచ్చే నివాళి.

 (వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ, ఓయూ)  -   డా॥సి.కాశీం
 

 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement