అక్కడేం జరుగుతోందో చెప్పే దండకారణ్య కథలు | Yes, it was not worth the battle on behalf of the common people, who are in the country | Sakshi
Sakshi News home page

అక్కడేం జరుగుతోందో చెప్పే దండకారణ్య కథలు

Published Fri, Sep 12 2014 11:55 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM

అక్కడేం జరుగుతోందో చెప్పే  దండకారణ్య కథలు - Sakshi

అక్కడేం జరుగుతోందో చెప్పే దండకారణ్య కథలు

ఏ సాహిత్యమైనా ఆనాటి సమాజాన్ని ప్రతిఫలిస్తుంది. అయితే చూపులకు కనిపించే సమాజం కాకుండా ఆవలివైపు మరో సమాజం ఉంటుంది. అది ఎలా ఉందో దాని గురించిన సాహిత్యం వచ్చినప్పుడే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా ‘నక్సలైట్లు’ లేదా ‘మావోయిస్టులు’ పదం తెలియని వారుండరు. నక్సలైట్లు ఏం చేస్తున్నారు? దండకారణ్యంలో వారికేం పని? ఈ ‘దండకారణ్య కథలు’ చదివితే తెలుస్తుంది. ఇన్నేళ్ల పోరాటం, చేసిన త్యాగాలతో వారు ఏం సాధించారు అంటే ‘జనతన సర్కార్’. అది నడుస్తున్న తీరును పరిచయం చేస్తాయీ కథలు. ‘నేను’ కేంద్రకంగా వర్థిల్లుతున్న ఈ సమాజానికి పరుల కోసం సర్వం అంకితం చేసిన మరో ప్రపంచాన్ని చూపుతాయి.

ఎవరు అవునన్నా కాదన్నా దేశంలో సామాన్యుల తరఫున యుద్ధం జరుగుతోంది. సమాజ పురోగమనంలో అది విడదీయలేని భాగంగా ఉంది. ఈ కథలు ఆ భాగాన్ని లిఖించాయి. ఈ పుస్తకంలోని మొత్తం 15 కథలను ఏడెనిమిదిమంది రచయితలు రాశారు. వీరంతా దండకారణ్యంలో ఉంటున్నవారే. ఉండి వచ్చిన వారే. ఈ రచయితల పేర్లు ‘నిత్య’, ‘మిడ్కో’, ‘ఎస్.డి’, ‘సాధన’, ‘టుంబ్రి’... ఇలా ఉన్నాయి. ఇవన్నీ అసలు పేర్లు కావు. ఈ రచయితలకు తమ ఉనికి అక్కర్లేదు. తాము ఏం చెప్పదలుచుకున్నారో దాని మీదే గురి. విప్లవోద్యమంలో పెరిగి పెద్దవాడైన ఆదివాసీ బుడతడు సంపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకుని ఎర్ర సైనికుడిగా ఎదిగిన వైనం ‘చాయ్‌గ్లాసు’ అనే కథలో కనిపిస్తుంది. ప్రజలను భీతావహులను చేసేందుకు సైన్యం చేసే భయానక హింసకు ప్రతి సమాధానం ఏమిటి అనేది ‘చైతే’ అనే కథలో కనిపిస్తుంది. ఈ పోరాటం ఎందుకు జరుగుతుందో ఎవరి మధ్య జరుగుతుందో గిరి గీసి తెలిపే కథ ‘లక్ష్మణరేఖ’.  ఇంకా తాయమ్మ కరుణ ‘గొడ్డును కాను’, బి.భానుమతి ‘కొత్త చదువు’ తదితర కథలు ఉన్నాయి. ఒక కథ పేరే ‘బాల గెరిల్లాలు’.

 ఇవి బయటి నుంచి చూసి రాసిన కథలు కావు. లోపల ఉండి అనుభవించి రాసినవి. చైనా, రష్యాలలో విప్లవోద్యమ కాలంలో వచ్చిన కథలు మనం అనువాదం చేసుకొని చదువుకున్నాం. కాని మన కథలను అనువాదం చేసి బయటకు తెలియచేస్తే ఇవి ప్రపంచస్థాయి కథలుగా నిలుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

 - తాయమ్మ కరుణ
 దండకారణ్య కథలు (2005-2012)
 విరసం ప్రచురణ; వెల: రూ.125
 ప్రతులకు: నవోదయ, కాచిగూడ
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement