ఆఫ్రిది.. నువ్వెప్పుడు?
కోపా అమెరికా ఫుట్ బాల్ కప్ తుది పోరులో అర్జెంటీనా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు చెప్పిన కొద్ది క్షణాల వ్యవధిలోనే పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిని నెటిజన్లు టార్గెట్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు పాక్ వెటరన్ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది ఎప్పుడు గుడ్ బై చెబుతాడో? అంటూ ట్విట్టర్ లో ప్రశ్నల వర్షం కురిసింది. ఆఫ్రిది నువ్వెప్పుడు వీడ్కోలు చెబుతావు?అని ఒకరు అడిగితే, ఆఫ్రిదిని చూసి మెస్సీ నేర్చుకోవాలని ఇంకొకరు సెటైర్లు వేశారు.
ఇక ఆఫ్రిది రిటైర్మెంట్ కోసం ఎదురు చూస్తున్నామంటూ ఒక నెటిజన్ అడగ్గా, ఈ రోజు ఆఫ్రిది 17వ పుట్టినరోజు కావడంతో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాలని మరొకరు సూచించారు. ఇక అర్జెంటీనాను రక్షించే వ్యక్తి ఆఫ్రిది మాత్రమేనని కొంతమంది చురకలంటించాడు. ప్రతీ ఏడాదీ ఆఫ్రిది రిటైరవుతాడు?, అంతే వేగంగా రిటైర్మెంట్ నుంచి వెనక్కి వస్తాడు?, ఆఫ్రిది తరహాలో రిటైర్ కావాలి..ఇది చూసి మెస్సీ నేర్చుకోవాలి'అని మరొక క్రికెట్ అభిమాని చమత్కరించాడు.
కోపా అమెరికా ఫుట్ బాల్ టోర్నమెంట్ తుది పోరులో అర్జెంటీనాను విజేతగా నిలపడంలో విఫలమైన ఆ జట్టు కెప్టెన్ లియోనల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్ కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే.భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం జరిగిన కోపా ఫైనల్ పోరులో చిలీ 4-2 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. దీంతో తన వీడ్కోలు నిర్ణయాన్ని మెస్సీ ప్రకటించాడు.