టి 20 ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్
పాకిస్థాన్‌కు చెందిన హషీమ్ అఖ్తర్ అనే ఓ టీనేజి క్రికెటర్ ఇంగ్లండ్‌లో టి 20 క్రికెట్ మ్యాచ్ ఆట మధ్యలో కుప్పకూలిపోయాడు. అతడికి బ్రెయిన్ హెమరేజ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఆట కొనసాగుతుండగా మధ్యలో అఖ్తర్ కనిపించకపోవడంతో జట్టు సభ్యులు అతడి కోసం వెతకగా, టాయిలెట్‌లో కుప్పకూలి కనిపించాడు. అతడి మెదడులో రక్తం గడ్డకట్టడంతో దాన్ని తొలగించడానికి అత్యవసరంగా ఓ ఆపరేషన్ చేశారు. అయినా ఇంకా అతడి పరిస్థితి విషమంగానే ఉందని రాయల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. అతడిని వైద్యులు బలవంతంగా కోమాలోకి పంపి చికిత్స అందిస్తున్నారు.
ఆస్ట్లీ బ్రిడ్జ్ సీసీ జట్టు తరఫున అతడు బ్రాడ్‌షా సీసీ జట్టుపై క్రికెట్ ఆడుతున్నాడు. తమ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్రేక్ అనంతరం అందరూ కలిసి గ్రౌండ్ లోకి వెళ్దామనుకుంటే అతడు కనిపించలేదని జట్టు సభ్యులు తెలిపారు. తీరా చూస్తే టాయిలెట్‌లో పడిపోయాడని, అదృష్టవశాత్తు అవతలి జట్టు సభ్యులలో ఒకరి తండ్రి వైద్యుడు కావడంతో వెంటనే అతడిని చూసి, ఆస్పత్రికి తరలించాలని చెప్పారని అన్నారు. గతంలో అఖ్తర్‌కు మైగ్రేన్ ఉండేది. 13 ఏళ్ల వయసు నుంచి ఆస్ట్టీ బ్రిడ్జ్ జట్టు తరఫున అతడు ఆల్‌రౌండర్‌గా ఆడుతున్నాడు. అతడిని అప్పుడే కోమాలోంచి బయటకు తేలేమని వైద్యులు చెప్పారని అఖ్తర్ తల్లి చెప్పారు.