ఆక్వాపార్క్‌ రగడ | cpm madhu arrested in bhimavaram over aquapark visitation | Sakshi
Sakshi News home page

ఆక్వాపార్క్‌ రగడ

Published Sat, Oct 1 2016 11:13 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

ఆక్వాపార్క్‌ రగడ - Sakshi

ఆక్వాపార్క్‌ రగడ

► సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సహా 65 మంది అరెస్ట్‌
 తుందుర్రు వెళ్లకుండా అడ్డగింపు
► భీమవరంలో ఉద్రిక్తత
 వైఎస్సార్‌ సీపీ ధర్నాతో దిగొచ్చిన పోలీసులు
 
భీమవరం : అరెస్ట్‌లు, నిర్బంధాల నడుమ భీమవరం మండలం తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తుందుర్రు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్‌ విధించి.. కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తూ భారీఎత్తున పోలీసుల్ని మోహరించారు. మరోవైపు తుందుర్రు, జొన్నలగరువు, నరసాపురం మండలం కంసాలి బేతపూడి గ్రామాలకు చెందిన పురుషుల్ని అరెస్ట్‌ చేయడంతోపాటు వృద్ధులు, మహిళలను ఇళ్లనుంచి బయటకు రానివ్వకుండా నిర్బంధాలు, నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఆ గ్రామాలకు బయట ప్రాంతాలకు చెందిన వారెవరినీ అనుమతించడం లేదు.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రజల హక్కులను హరిస్తూ అక్కడ పోలీస్‌ రాజ్యం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ గ్రామాల్లోని పరిస్థితులను తెలుసుకునేందుకు బయలుదేరిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధును భీమవరం ప్రకాశం చౌక్‌లో పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు. ఆయనతోపాటు సీపీఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జాన్‌శెట్టి వెంకట సత్యనారాయణమూర్తి, మరో 44 మందిని అరెస్ట్‌ చేశారు. ఇదే సందర్భంలో విస్సాకోడేరు గ్రామానికి చెందిన రైతు సంఘం కార్యదర్శి కలిదిండి గోపాలరాజుతోపాటు మరో 19 మందిని కూడా అరెస్ట్‌ చేశారు. తుందుర్రులో గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం నుంచి తుందుర్రు గ్రామానికి ర్యాలీ చేపట్టే ఉద్దేశంతో వీరంతా బయలుదేరుతుండటంతో అరెస్ట్‌ చేశామని టూటౌన్‌ పోలీసులు ప్రకటించారు. 
 
భీమవరంలో ఉద్రిక్తత
పోలీసుల చర్యలతో భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రకాశం చౌక్‌లో పోలీసులు పెద్దఎత్తున మోహరించడం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సహా 65 మందిని అరెస్ట్‌ చేయడం, ఇందుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్, సీపీఎం నాయకులు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నాకు దిగడం వంటి పరిణామాలతో పట్టణం అట్టుడికింది. తుందుర్రులో ఆక్వా ఫుడ్‌ పార్క్‌ నిర్మాణాన్ని తక్షణం నిలిపివేయాలంటూ పరిసర గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనకు సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆందోళనల్లో పాల్గొంటోంది. తుందుర్రు, జొన్నలగరువు, కంసాలి బేతపూడి గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలు చేయడంతో అక్కడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మహిళలు బహిర్భూమికి వెళ్లాలన్నా.. రైతులు పొలాలకు వెళ్లాలన్నా కూడా పోలీసులకు ఆధార్‌ కార్డు చూపించాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఆ గ్రామాలకు చెందిన పలువుర్ని అరెస్ట్‌ చేయడంతో పురుషులంతా గ్రామాల్ని వదిలి వెళ్లారు.

పోలీస్‌ హారన్లు, వారి బూట్ల చప్పుళ్ల నడుమ మహిళలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పిల్లలు పాఠశాలలకు సైతం వెళ్లడం లేదు. అక్కడ నెలకొన్న దుస్థితిని ఆయా గ్రామాల ప్రజలు సీపీఎం అధినాయకత్వం ýlష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో తుందుర్రులో పరిస్థితిని పరిశీలించేందుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు వస్తారని, అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారని సీపీఎం నాయకులు ప్రకటించారు. దీంతో పోలీసులు భీమవరం పట్టణం, తాడేరు, తుందుర్రులో పెద్ద సంఖ్యలో మోహరించారు. మధు సీఐటీయూ కార్యాలయానికి వస్తారని తెలియడంతో మీడియా ప్రతినిధులు, పోలీసులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి సీపీఎం నాయకులు ప్రకాశం చౌక్‌ మీదుగా బయలుదేరారు. ఆ వెంటనే పోలీసులంతా అక్కడకు చేరుకున్నారు. మధు అక్కడకు చేరుకోగానే పోలీసులు చుట్టుముట్టడంతో మధ్య తోపులాట జరిగింది. పోలీసులను సీపీఎం నాయకులు అడ్డుకోవడంతో మధు తదితరులను రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి ప్రత్యేక వాహనంలో వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.
 
వైస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ధర్నా
సీపీఎం కార్యదర్శి మధు, తదితరుల అరెస్ట్, తుందుర్రు, పరిసర గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలు చేయడాన్ని నిరసిస్తూ భీమవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ కన్వీనర్‌ గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. మధును అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస్‌ పోలీసు స్టేషన్‌కు చేరుకుని నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావుతో మాట్లాడారు. తుందుర్రులో పోలీసు రాజ్యం నడుస్తోందని, అక్కడ ఎటువంటి అరాచకాలు లేకపోయినా 144 సెక్షన్‌ విధించి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం 144 సెక్షన్‌ ఎత్తివేయాలని, మధు, తదితరులను విడిచిపెట్టాలని డిమాండ్‌ చేశారు. డీఎస్పీ మాట్లాడుతూ తుందుర్రులో శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతోనే మధు తదితరులను ముందస్తు అరెస్ట్‌ చేశామని చెప్పారు. దీనికి సంతృప్తి చెందిన శ్రీనివాస్‌ వైఎస్సార్‌ సీపీ, సీపీఎం శ్రేణులతో కలసి ధర్నా చేశారు.

‘పోలీసు జులం నశించాలి.. ఎమ్మెల్యే డౌన్‌డౌన్‌.. 144 సెక్షన్‌ ఎత్తివేయాలి’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎట్టకేలకు సీఐ దేశింశెట్టి వెంకటేశ్వరరావు ధర్నా చేస్తున్న ప్రాంతానికి వచ్చి మధును విడుదల చేస్తామని, 144 సెక్షన్‌ ఎత్తివేసే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ధర్నాలో వైఎస్సార్‌ సీపీ నాయకులు గాదిరాజు వెంకట సత్యసుబ్రహ్మణ్యంరాజు (తాతారాజు), భూసారపు సాయిసత్యనారాయణ, తిరుమాని ఏడుకొండలు, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, కోడే యుగంధర్, కామన నాగేశ్వరరావు, నల్లం రాంబాబు, పేరిచర్ల సత్యనారాయణరాజు, సుంకర బాబూరావు, కోటిపల్లి బాబు, నూకల కనకరావు, నాగరాజు శ్రీనివాసరాజు, పాలవెల్లి మంగ, ఆకుల వెంకట సుబ్బలక్ష్మి, చికిలే మంగతాయారు, సీపీఎం రాష్ట్ర నాయకుడు జుత్తిగ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

పూచీకత్తుపై విడుదల
తుందుర్రులో బహిరంగ సభ నిర్వహించేందుకు వెళుతున్న సీపీఎం నాయకుడు మధుతోపాటు 65 మందిని అరెస్ట్‌ చేసినట్టు పట్టణ సీఐ దేశింశెట్టి వెంకటేశ్వరరావు చెప్పారు. అనంతరం పూచీకత్తుపై వారందరినీ విడుదల చేశామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement